ఇండియన్ సినిమాల్లో మైలురాయిగా నిలిచిన శివ ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ సారి సౌండ్ మొత్తం హై ఎండ్ ఎఐ టెక్నాలజీతో రీ-డిజైన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్‌లో, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. సిఎన్‌ఎన్‌ఐబిఎన్ టాప్ 100 ఇండియన్ ఫిలిమ్స్‌లో స్థానం సంపాదించింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా, మళ్లీ థియేటర్స్‌లోకి వస్తోంది. ఈ రీ-రిలీజ్ గురించి నాగార్జున మాట్లాడుతూ “శివ నన్ను ఐకానిక్ హీరోగా నిలబెట్టిన సినిమా.
నా క్యారెక్టర్ మరిచిపోలేని స్థాయికి వెళ్లింది. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటూ ఉండటం చూసి, నా అన్నయ్య వెంకట్ అక్కినేని, నేను కలిసి, దీన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయాలని భావించాం. ఈ సినిమాను కల్ట్ క్లాసిక్‌గా ప్రేక్షకులకే కాకుండా, యూట్యూబ్‌లో చూసిన కొత్త తరానికి కూడా థియేటర్‌లో అనుభవం ఇవ్వాలని అనుకున్నాం. అందుకే ఆర్జీవి, వెంకట్, నేను కలసి ఈ సినిమాను డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో, 4కె విజువల్స్‌తో మళ్లీ చూపించబోతున్నాము”అని అన్నారు.