రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో శుక్రవారం (సెప్టెంబర్ 26) పేరెంట్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం కావాలని తెలిపారు. పేరెంట్ టీచర్ మీటింగ్ లో పిల్లల చదువు, హాజరు, ప్రవర్తనపై చర్చించాలని సూచించారు. తల్లిదండ్రుల నుంచి సూచనలు తీసుకోవాలని పేర్కొన్నారు.నాణ్యమైన విద్య, డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రతి నెలా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య పలు అంశాలపై మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
దసరా సెలవుల తర్వాత విద్యార్థుల హాజరుపై పూర్తిస్థాయిలో దృష్టి సాధించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలు చేస్తున్న ముఖ గుర్తింపు హాజరుతో విద్యార్థుల హాజరు క్రమంగా పెరుగుతుందని అన్నారు. తద్వారా విద్యా ప్రమాణాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు పెరిగినట్లు వెల్లడించారు. గత విద్యా సంవత్సరం 83,635 ప్రవేశాలు నమోదు కాగా ఈ ఏడాది 91,853 ప్రవేశాలు నమోదయినట్లు కృష్ణ ఆదిత్య తెలిపారు.
అక్టోబర్ నుంచి పాఠ్యపుస్తకాల ప్రక్రియ ప్రారంభం : వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ అమలు చేయాలని నిర్ణయించినట్లు కృష్ణ ఆదిత్య తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠ్యపుస్తకాలకు సంబంధించిన ప్రక్రియను అక్టోబర్ ప్రారంభించినట్లు వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా సబ్జెక్టుల్లోని సిలబస్‌ను మార్పు చేయనున్నట్లు పేర్కొన్నారు.