Sunday, April 28, 2024

ఎల్గార్ కేసు జాతీయ అంశం: ఎన్‌ఐఎ

- Advertisement -
- Advertisement -

ఎల్గార్ కేసు జాతీయ అంశం
అందువల్లే కేంద్రం మాకు అప్పగించిందిః ఎన్‌ఐఎ
రాజకీయ దురుద్దేశాలున్నాయి: నిందితులు
ముంబయి: జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలున్నందునే ఎల్గార్ పరిషద్‌మావోయిస్ట్ లింక్‌ల కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కేంద్రం సుమోటోగా నిర్ణయించిందని జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్‌ఐఎ) బాంబే హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నది. నక్సలైట్ల వల్ల దేశానికి పలువిధాల నష్టం వాటిల్లుతుందని, చట్టవ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించాల్సి ఉన్నందున ఈ కేసును తాము దర్యాప్తు చేయడమే సరైందని కోర్టుకు తెలిపింది. శాంతి,భద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ, పలు రాష్ట్రాలకు ఈ కేసుతో సంబంధమున్నందున ఇది జాతీయ ప్రాధాన్యత కలిగి ఉన్నదని ఎన్‌ఐఎ తరఫు న్యాయవాది సందేశ్‌పాటిల్ కోర్టుకు తెలిపారు. దర్యాప్తును ఎన్‌ఐఎకు బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఈ కేసులో నిందితులైన మానవ హక్కుల న్యాయవాది సురేంద్రగాడ్లింగ్, కార్యకర్త సురేంద్రధవాలే హైకోర్టులో వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది.

2020 జనవరిలో ఈ కేసును మహారాష్ట్రలోని పూణె పోలీసుల నుంచి ఎన్‌ఐఎకు బదిలీ చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ దురుద్దేశాలున్నాయని పిటిషనర్ల తరుఫు న్యాయవాది ఎస్‌బి తాలేకర్ కోర్టు దృష్టికి తెచ్చారు. మహారాష్ట్రలో బిజెపి అధికారం కోల్పోయిన నేపథ్యంలోనే ఈ కేసును ఎన్‌ఐఎకు బదిలీ చేశారని ఆయన గుర్తు చేశారు. పుణె పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన రెండేళ్ల తర్వాత కేసును బదిలీ చేయడం గమనార్హమని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన పాటిల్ ఎన్‌ఐఎ తరఫున వివరణ ఇచ్చారు. గతంలో ఎన్‌ఐఎ సమర్పించిన అఫిడవిట్ గురించి తనకు తెలియదని, వేరే న్యాయవాది అది సమర్పించి ఉంటారని, దానిని పరిశీలించేందుకు తనకు వారం రోజుల సమయం కావాలని కోర్టును కోరారు. దాంతో, తదుపరి విచారణను జులై 19కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. ఇదే కేసులో విరసం నేత వరవరరావు, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు గౌతమ్ నవలఖ, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్కుండే, షోమాసేన్, దివంగత క్రిష్టియన్ ఫాదర్ స్టాన్‌స్వామి నిందితులన్న విషయం తెలిసిందే.

NIA to Probe in Elgar Parishad Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News