Thursday, April 25, 2024

44 సెకండ్లకు ఒకరు కొవిడ్‌తో మృతి.. నిర్లక్ష్యంతోనే ముప్పు

- Advertisement -
- Advertisement -

నిమ్మళంతోనే విలయం
44 సెకండ్లకు ఒకరు కొవిడ్‌తో మృతి
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక
తగ్గుముఖం దశలో నిర్లక్షంతోనే ముప్పు
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19తో ప్రతి 44 సెకండ్లకు ఒకరు చనిపోతున్నారు. ఇదీ ఇప్పటికీ ప్రపంచాన్ని వీడక నీడలా ఉన్న కరోనా ప్రభావం. ఇప్పటి కరోనా మరణాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) నివేదిక వెలువరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే కరోనా మరణాల సంఖ్య ఇంతకు ముందటితో పోలిస్తే 80 శాతానికి పైగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పటికీ కొవిడ్ తీవ్రంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలలో తేల్చారు. వారం వారం ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ప్రభావం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు వెలువరిస్తోంది. దేశాలకు,వివిధ సంస్థలకు తగు హెచ్చరికలు వెలువరిస్తోంది. భయానక వైరస్ అంతరించిపోయిందని అనుకోవడానికి లేదని ఇప్పటికీ ప్రభావం తీవ్రంగానే ఉందని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రెయెసస్ తెలిపారు. క్రమేపీ కొవిడ్ ప్రభావం తగ్గుతోందనే పరిణామం స్వాగతించదగ్గదే, అయితే పూర్తిస్థాయిలో ఈ వైరస్ నామరూపాలు లేకుండా పొయ్యేది ఎప్పుడనేది ఇప్పుడు చెప్పలేమని ఆరోగ్య సంస్థ అధినేత తెలిపారు. అయితే ఇప్పడు నెలకొంటున్న కేసులు, సెకండ్ల వారిగా దీని ప్రభావంతో మరణాలు తిరిగి కొవిడ్ ఉధృతిని సూచిస్తున్నాయని అన్నారు. వైరస్ పట్ల ప్రజలలో నిర్లక్ష ధోరణి పెరగడం ఇప్పటికీ సంభవిస్తున్న మరణాల రేటును తెలియచేస్తోందని, నిజానికి మరింతగా టీకాల కార్యక్రమం సమగ్రరీతిలో జరిగితే, జనమంతా తగు టీకా డోసులు పొందితే ఈ విషాదాంతాలను అరికట్టవచ్చునని, ఓ విధంగా ఇవి అవాంఛనీయ, చేజేతులా కొని తెచ్చుకునే మరణాలే అవుతాయని వివరించారు.
ఆటకట్టులో అజాగ్రత్తలపై వచ్చేవారం నివేదిక
ఇప్పుడు కొనసాగుతోన్న కొవిడ్ ఉధృతి దశలో వివిధ దేశాల ప్రభుత్వాలు వైరస్ ఆటకట్టు విషయంలో ప్రదర్శిస్తున్న నిర్లక్షంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి సారించింది. ఆరు పాలసీ లోపాలు, అమలులో లోటుపాట్ల గురించి సంస్థ వచ్చే వారం వేర్వేరుగా నివేదికలు వెలువరిస్తుంది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వాలు తీసుకోవల్సిన అత్యవసర కార్యాచరణను ఇందులో తెలియచేస్తారు. వైరస్ పరీక్ష, చికిత్స నిర్వహణ, వ్యాక్సినేషన్, సంక్రమణల నివారణ, అదుపు చర్యలు, వ్యాప్తికి దారితీసే పరిస్థితులపై అవగావహన, సామాజిక స్పందన, వైరస్ సమాచార క్రోడీకరణ, నిర్వహణ వంటి అంశాలను పొందుపరుస్తూ సమగ్ర బులెటిన్లు వెలువరిస్తారు. వీటికి అనుగుణంగా ప్రపంచదేశాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొవిడ్ కట్టడిపై తమ పాలసీలను సమీక్షించుకుంటూ, కార్యాచరణను పటిష్టంగా చేపడుతాయని ఆశిస్తున్నట్లు ఆరోగ్య సంస్థ నేత ఆశాభావం వ్యక్తం చేశారు. మంకీపాక్స్ ప్రమాదకర స్థితినే తెచ్చిపెట్టిందని అన్నారు. ఇటీవల అమెరికాలో కేసుల సంఖ్య తగ్గిందని అయితే ఎప్పుడు కేసులు పెరుగుతాయనేది తెలియదని తెలిపారు. ఏ వైరస్‌కు అయినా తగ్గుముఖ పరిస్థితి ముప్పునకు దారతీస్తుందని చెప్పిన డబ్లుహెచ్‌ఒ డిజి దీనిపై వివరణ ఇస్తూ అంతా సద్దుమణిగిందని నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటే తిరిగి వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, ఇది కొవిడ్ 19కు వర్తిస్తుందని తెలిపారు.

One dying Every 44 Seconds with Covid: WHO

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News