Sunday, April 28, 2024

మా సీఎం కేసీఆర్… కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరు..?

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: రానున్న ఎన్నికల్లోనూ మా సీఎం అభ్యర్థి కేసీఆరేనని, కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరని బీఆర్‌ఎస్ యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్నారని, ఆ పార్టీ కార్యకర్తల్లోనూ అపనమ్మకం ఏర్పడిందని, మా సీఎం కచ్చితంగా కేసీఆరేనని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కొంత ఉత్సాహంగా ఉన్నట్టు ప్రదర్శన కనబర్చుతుండటంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిచ్చి ప్రేలాపణలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, అయినా కాంగ్రెస్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. నాలుగేళ్లుగా పెద్ద పెద్ద నాయకులు కొట్లాడలేక అలిసిపోయారని, ఎన్నికలు సమీపిస్తుండటంతో ఐక్యతారాగం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తామన్నా ప్రజలు కాంగ్రెస్‌ను విస్మరించారని, ఈసారి కూడా అదే నినాదం ఎత్తుకున్నారని, గత తొమ్మిదేళ్లలో అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములైన ప్రజలు ఈ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌తోనే కలిసివస్తారన్నారు.

రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, అయినా అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న బీజేపీ అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఆ పార్టీ విధానమేంటో ప్రజలకు చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ కేసీఆర్‌ను మించి ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదని విమర్శించారు. వైఎస్‌ఆర్‌టీపీ, బీఎస్పీ లాంటి చిన్న పార్టీలు కూడా అధికారంలోకి వస్తామంటున్నాయని, ఆ పార్టీలకు రాష్ట్రంలో ఎక్కడా ఒక్క సీటు కూడా రాదని, బీఎస్పీ బహుజనుల పేరు చెప్పుకుని యూపీలో వెలగబెట్టిందేమీ లేదని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉపయోగం లేదని, ప్రజలు కూడా వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలతో అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలంగాణను వ్యతిరేకించిన చం ద్రబాబే తెలంగాణ అభివృద్ధి చెందిందని, తెలంగాణలో ఎకరం అమ్మి ఆంధ్రలో వంద ఎకరాలు కొనవచ్చని చెబుతున్నారని, తెలంగాణ వ్యతిరేకులు కూడా నిజాలను, వాస్తవాన్ని దాచుకోలేక బయటకు చెబుతున్నారని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అద్భుతంగా బాగు చేశారని, 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ తొమ్మిదేళ్లలో చేసి చూపించారని, ఉమ్మడి రాష్ట్రంలో 26 లక్షల ఎకరాల వరి సాగుతో దేశంలో రెండో స్థానంలో ఉండగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో వరి సాగును 56 లక్షల ఎకరాలకు పెంచి పంజాబ్‌ను దాటి తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీగా ఈ విజయాలన్నింటిని ప్రజలకు చెప్పి అన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ నాయకత్వంలో నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా ఈనెల 27న తిరుమలగిరిలో సాయంత్రం 4 గంటలకు తుంగతుర్తి ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలను, ప్రజలను సన్నద్ధం చేయడం కోసం ఈ సభ జరుగుతుందని, సభ విజయవంతం కోసం గ్రామగ్రామాన సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సభకు వస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములైన ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని తుంగతుర్తి ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో మోత్కూరు మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, బీఆర్‌ఎస్ మోత్కూరు, అడ్డగూడూరు మండలాల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, మార్కెట్ మాజీ చైర్మన్ టి.మేఘారెడ్డి, కౌన్సిలర్ కూరెళ్ల కుమారస్వామి, సర్పంచ్ బత్తిని తిరుమలేష్, నాయకులు మర్రి అనిల్ కుమార్, ఎన్.మత్సగిరి, రాజేష్, కూరెళ్ల దాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News