Friday, May 24, 2024

పాండవుల గుట్టపై పట్టింపేది!

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో చాలా ప్రాంతాలు ప్రకృతితో అనుసంధానం చేయబడి ఉంటాయి. కొన్ని ప్రాంతాలు పర్యాటకుల తాకిడిని కలిగినవి కూడా ఉన్నాయి. అందులో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట ఒకటి. పాండవుల గుట్ట చరిత్ర అంతా కాదు, మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపించలేనంత. కానీ పేరుకే పాండవుల గుట్ట కానీ మొత్తం సమస్యల పుట్టగా మారింది. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా కూడా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. అధికారులు ఇక్కడి పాండవుల గుట్టను చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. పాండవుల గుట్ట ఉమ్మడి వరంగల్ జిల్లా నేటి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఉంది. రేగొండ మండలంలోని నారాయణపురం, రావులపల్లి గ్రామ శివారులో ఈ పాండవుల గుట్టలు ఉన్నాయి. వరంగల్ జిల్లా నుంచి 60 కి.మీ దూరంలో, భూపాలపల్లి జిల్లా నుంచి 22 కి.మీ దూరంలో, రేగొండ మండల కేంద్రం నుంచి 5 కి.మీ దూరంలో ఈ గుట్టలు వెలిశాయి.

ఆనాటి కాలంలో ఇక్కడ పాండవులు పర్యటించారని సమాచారం ఉంది. కాబట్టి పాండవుల గుట్ట అని నామకరణం చేశారు. ముఖ్యంగా ఇక్కడ పచ్చని వాతావరణం, పక్షుల కిలకిల రావాలు అందరినీ ఆకర్షిస్తాయి. ఎదురు పాండవులు, పోతరాజు చెలిమె, మేకల బండ, ముంగీస బండ, తుపాకుల గుండు అనే విభిన్న ప్రదేశాలకు చిహ్నంగా ఉంటుంది. ఇక్కడ పాండవుల పాదముద్రలు, రాతి బొమ్మలు, రాతి చిత్రాలు, చేతి ముద్రలు ఇలా ఒక్కొక్క అద్భుతం పాండవుల గుట్ట వద్ద కనిపిస్తుంది. సెలవు దినాలలో పర్యాటకులు పాండవుల గుట్టను సందర్శిస్తారు. ఇక్కడ ముఖ్యంగా రాక్ క్లైంబింగ్, సాయంత్రం వేళలో క్యాంప్ ఫైర్ కూడా నిర్వహించేవారు. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగానే సాగి ఆగిపోయింది. ప్రతి శని, ఆదివారాలలో రాక్ క్లైంబింగ్ జరిగేది, ఈ కార్యక్రమాలకు యువత పెద్ద ఎత్తున ఉత్సాహంగా హాజరై పాల్గొనేవారు. కా నీ వసతులు సరిగా లేకపోవడం కారణంగా పర్యాటకుల తాకిడి తగ్గింది. పచ్చని పంట పొలాల మధ్య పాండవుల గుట్ట దాదాపుగా 3 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని అంచనా. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలపై ఉంది.

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిస్తే పర్యాటకుల తాకిడి పెరగడంతో పాటు ప్రభుత్వానికి పేరుతో పాటు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వాలు, గత పాలకులు పట్టించుకోకపోయినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకొని ఇలాంటి విశిష్టత కలిగిన ప్రాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలి. పాండవుల గుట్ట నిజంగా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. పాండవుల గుట్టకు వెళ్లే మార్గం అతి భయంకరంగా ఉంది. ముఖ్యంగా రోడ్డును చూసే వెనక్కి వెళ్లే పరిస్థితి దాపురించింది. కంకరతేలి గుంతల మయం కావడంతో చాలా మంది పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యత లేని పనులు చేయడం కారణంగా రోడ్లు ధ్వంసమైన పరిస్థితి నెలకొన్నది. కావున నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు నిర్మాణం చేసి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలి. ఇంకా అనేక వసతులను పాండవుల గుట్ట ప్రాంతంలో కల్పించాలి. మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రాంతం, పురాతన విషయాలను మరింతగా తెలిపేటటువంటి ప్రాంతం. ఇటు ఆనందానికి, అటు విజ్ఞానానికి, తెలంగాణ ప్రాంతానికి వన్నె తెచ్చే పేరున్న పాండవుల గుట్టను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులను కేటాయించి, విడుదల చేసి అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తే బాగుంటుందని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు.

వెంగల రణధీర్
9949493707

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News