Monday, April 29, 2024

వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించి పొత్తులపై వచ్చిన ఊహాగానాలకు తెర దించారు. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయడం తమ వ్యక్తిగత అవసరాల కోసం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసమేనని జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియాతో అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రాజమండ్రి వెళ్ళిన జనసేనాని పవన్ కళ్యాణ్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో కలిసి మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన, టిడిపిల మధ్య ఎన్నికల పొత్తు కుదిరిందని కుండ బద్దలు కొట్టారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికిప్పుడే తీసుకున్నామని పొత్తుల విషయాన్ని స్వయంగా ప్రకటించారు. బిజెపి పార్టీ తమతో కలిసి వస్తుందో.. లేదో.. అనేది ఆ పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జనసేనాని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇంకా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే….

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. తనకు గురువారం నాటి ములాఖత్ ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమైందని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ స్పష్టం చేశారు. వైసిపిని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందన్న పవన్ బిజెపి కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ వేత్త అయితే వైఎస్ జగన్ ఆర్థిక నేరస్తుడు అని పవన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో సైబరాబాద్‌ను నిర్మించిన వ్యక్తిని జైల్లో పెట్టడం బాధాకరం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనే తన ఆకాంక్ష అని తెలిపారు. హైటెక్ సిటీ సృష్టించిన విజనరీకి ఈ దుస్థితి ఏమిటీ..? ఏపి దుస్థితిపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాకు అలాగే గవర్నర్‌కు తెలియజేస్తాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు నాయుడు భద్రత విషయంలోనూ ప్రధాని మోడీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని పవన్ వెల్లడించారు. వైసిపి నాలుగేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అధికారులు జగన్‌ను నమ్ముకుంటే..కుక్కతోకను పట్టుకుని గోదావరి ఈదినట్టేనని డిజిపి, సిఎస్ సహా ఎవరిపైనైనా పాత కేసులు తిరగడోడే అవకాశం ఉంటుందని చెప్పారు.

చట్టాలను అధిగమించి చేసే అధికారులు ఆలోచించుకోవాలన్న పవన్..పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరేం చేయలేరు అని విచారం వ్యక్తం చేశారు. మీకు సమయం ఆరు నెలలు మాత్రమే ఉంది..యుద్ధమే కావాలంటే సిద్ధమే అని వపన్ వైసిపి నేతలను హెచ్చరించారు. తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు 6 నెలలు సమయముంది…వైసిపి నాయకులంతా ఆలోచించుకోవాలి..ఎవరినీ వదిలిపెట్టం అని పవన్ కళ్యాణ్ అన్నారు. అక్రమంగా ఇసుక, మైనింగ్ బెల్టు షాపులు నిర్వహిస్తున్న ఎవరినీ వదిలిపెట్టం అని హెచ్చరించారు. నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నామని, అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చానని, సగటు మనిషి వేదన జనసేన ఆవిర్భావ సభలోనే మాట్లాడానని చెప్పారు. తన నిర్ణయాలు కొందరికి ఇబ్బందిగా ఉంటాయన్న పవన్ అవన్నీ ఏపి భవిష్యత్ కోసమే అని స్పష్టం చేశారు. దేశానికే బలమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతో మోదీకి మద్దతు తెలిపానని..

దక్షిణాది నుంచి మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తి నేను అని చెప్తూ ఆ సమయంలో నన్ను అందరూ తిట్టారని గుర్తు చేసుకున్నారు. తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏ రోజైనా సరే ..మోదీ పిలిస్తేనే వెళ్లాను.. ఆ స్థాయి నాయకుల సమయం వృథా చేయను అని చెప్పారు. 2014లో బిజెపి , టిడిపికి మద్దతిచ్చేందుకు కూడా ముఖ్య కారణం ఉందన్న పవన్ విడిపోయిన ఏపికి అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నానని వెల్లడించారు. చంద్రబాబు పాలన, విధానపరమైన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు..చంద్రబాబు అనుభవం, సమర్థతపై సంపూర్ణ విశ్వాసం ఉంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్రమంలోనే తమ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ టిడిపితో కలిసి పోటీ చేస్తుందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News