Monday, April 29, 2024

కేంద్రం దగా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నిధులు, నియామకాలు’ అనే ప్రధానమైన నినాదంతో ఉద్యమించి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నీళ్ళు, నిధుల విషయంలో తీరని అన్యాయం చేస్తున్నదనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. రాష్ట్రానికి అత్యంత కీలకమైన కృష్ణానదీ జలాల విషయంలో నూ కేంద్రం వివక్షనే చూపుతున్నది. మరోవైపు నిధుల విషయంలో గడచిన ఏడేళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా ఒక లక్షా 35 వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయిని కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టిందని, మరోవైపు నీళ్ల విషయంలోనూ కృష్ణానదీ జలాలను పునఃపంపిణీ చేసేందుకు కొత్తగా ట్రి బ్యునల్‌ను ఏర్పాటు చేస్తానని నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వం ఆ నియామకం జరపకుండా మోసం చేసిందని పలువురు సీనియర్ ఇం జనీరింగ్ అధికారులు మండిపడుతున్నారు. కృష్ణానదీ జలాల కోసం సుప్రీంకోర్టులో కేసు పెట్టామని, ఆ తర్వాత ప్రధానమంత్రి, కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రులతో జరిగిన సమావేశాల్లో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకొంటే కొత్త గా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని,

కేంద్ర సర్కార్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో నడుస్తున్న కేసును వాపస్ తీసుకొన్నామని ఆ ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. ఇది జరిగి సుమారు అయిదేళ్లు అవుతోందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే పనినే చేపట్టలేదని, మరోవైపు సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిందని, ఇప్పుడేమో కేంద్ర సర్కార్ ఎన్నికలను ఎదుర్కొనే బిజీలో పడిపోయిందని, అంటే కృష్ణానదీ జలాల పంపకాలపై కొత్తగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే పనిని కేంద్రం బుట్టదాఖలు చేసిందని స్పష్టమవుతోందని ఆ ఇంజనీరింగ్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 16వ తేదీన ఎంతో అట్టహాసంగా ప్రారంభించనున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తుండగా అన్ని విధాలుగా సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం వీసమెత్తయినా సహకరించకపోగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తోందని ఆ అధికారులు మండిపడుతున్నారు. ఒకవైపు గ్రీన్ ట్రిబ్యునల్‌లో

కేసు మూలం గా మూడేళ్లపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణాలపై ఆంక్షలు తొలగిపోవడంతో రేయింబవళ్లూ కష్టపడి ప్రాజెక్టును నిర్మించుకొంటుంటే నిర్ధిష్టమైన నీటి కేటాయింపులు జరపాల్సిన కేంద్రం ఆ పనిచేయడం లేదని ఆ అధికారులు వ్యాఖ్యానించారు. అంతేగాక జస్టీస్ బ్రజేష్ కు మార్ ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నాయని, ఈ వాదనలు ముగిసి తుది తీర్పు వచ్చే వరకూ కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయ డం కుదరదని కేంద్ర జల్‌శక్తి శాఖాధికారులకు న్యాయ నిపుణులు సలహా ఇచ్చారని ఆ అధికారులు వివరించారు. కేంద్ర జల్‌శక్తి శాఖా మంత్రి షెకావత్ ఇచ్చిన హామీని నమ్మి సుప్రీంకోర్టులో ఉన్న కేసును కూడా తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకొందని, ఇప్పుడేమో కొత్తగా ట్రిబ్యునల్ వేయడానికి కుంటిసాకులు వెతుకుతున్నారని ఆ అధికారులు కేంద్రంపై మండిపడుతున్నారు. కృష్ణానదీ జలాల్లో న్యాయమైన వాటా నీటి కోసం, నికర జలాలు, మిగులు జలాల్లో కూడా నిర్ధిష్టమైన నీటి కేటాయింపులు జరిపేందుకు వీలుగా కొత్తగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం నమ్మించి

మోసం చేస్తూ బుట్టదాఖలు చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిపిన తాత్కాలిక నీటి కేటాయింపులనే మరో పదేళ్ళ వరకూ కొనసాగించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేవలం రాజకీయ పరమైన కారణాలతోనే తెలంగాణ ప్రజలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వేధిస్తోందని అంటున్నారు. కేంద్రం అడుగులకు మడుగులు వత్తకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రైతుల పక్షాన నిలవడం, నల్ల చట్టాలను వ్యతిరేకించడం, ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమాల్లో మరణించిన రైతు ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం, రైతు ఉద్యమనేత తికాయత్‌తో సీఎం కెసిఆర్ దోస్తీ చేయడం, కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడం, వ్యతిరేకించడం, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేసిఆర్ ఆగ్రహించడం వంటి అనేక అంశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల పక్షాన నిలవడం వంటి అంశాలు కూడా బలంగా ప్రభా వం చూపాయని అంటున్నారు. కృష్ణా జలాల వివాదాలపై ఏర్పాటైన జస్టీస్ బ్రజేష్ కుమార్ ఇచ్చిన అవార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా మంటగలిపే విధంగా ఉండటంతోనే ఏడున్నర సం వత్సరాలు ప్రభుత్వం కేంద్రంతో అనేకసార్లు చర్చలు జరిపామని, అనేక లేఖలు రాశామని.

చివరకు సుప్రీంకోర్టులో కేసులు పెట్టామని వివరించారు. కొత్త ట్రిబ్యునల్ వేయాలంటే సుప్రీంకోర్టులో పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని షరతు పెట్టిన మాటను నమ్మి కేసును ఉపసంహరించుకొని రెండేళ్ళ సమయం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకూ కేంద్రం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. జస్టీస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డులో అనేక లొసుగులు, వివాదాలు ఉన్నాయని, నీటిపారుదల ఇంజనీరింగ్ సూత్రాలకు తిలోదకాలిచ్చి అవార్డును రూపొందించారనే ఉద్దేశ్యంతో రెండు తెలుగు రాష్ట్రాలూ పూర్తిగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయని వివరించారు. జస్టీస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డులో ఆయన అనుసరించిన ప్రమాణాలు కృష్ణానదికి ఎగువన ఉన్న రాష్ట్రాలకు మేలు చేసేవిగానూ, దిగువన ఉన్న తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగే విధంగా ఉన్నాయని, అందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోందని వివరించారు. కృష్ణానదీ జలాలపైన ఆధారపడి తెలంగాణ ప్రభుత్వం సుమారు 40 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ సహా మరో పది జిల్లాల ప్రజలకు తాగునీరు, నల్గొండ జిల్లాలోని ఫ్లోరిన్ బాధిత ప్రజలకు సురక్షితమైన నీటిని అందించాలని లక్షంగా పెట్టుకొన్న

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోగా అనేక రకాలుగా మోకాలడ్డుతోందని ఆ అధికారులు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణానదీ జలాల్లో 500 టీఎంసీల నిర్ధిష్టమైన వాటా నీరు కావాలని అడుగుతోంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 299 టిఎంసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టిఎంసీల నీటిని వాడుకునే విధంగా విభజించారు. ఇప్పుడు ట్రిబ్యునల్‌ను నియమించకుండా ఇలా కాలయాపన చేయడం మూలంగా తెలంగాణకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆ ఇంజనీరింగ్ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి కొత్తగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం అంటేనే కనీసం పదేళ్ళ సమయం పడుతుందని, ఎందుకంటే ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమితులయ్యే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కృష్ణానదీ పరివాహక ప్రాంతం, భాగస్వామ్య రాష్ట్రాల విజ్ఞప్తులు, వాదనలు, నీటి లభ్యత, పంపకాలు, ప్రాజెక్టులు, గతంలోని జస్టీస్ బచావత్ అవార్డును అధ్యయనం చేయడం వంటి అనేక ప్రాధమికమైన కార్యక్రమాలకే కనీసం నాలుగేళ్ళ సమయం పడుతుందని, ఆ తర్వాత ముసాయిదా అవార్డును ప్రకటించి భాగస్వామ్య రాష్ట్రాల నుంచి అభ్యంతరాలను

స్వీకరించి వాటిని పరిష్కరించడం వంటి పనులన్నీ పూర్తయ్యేసరికి మరో ఏడాది సమయం పడుతుందని వివరించారు. అప్పటి వరకూ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నీటి కేటాయింపులనే అమలు చేయాల్సి ఉంటుందని, దాంతో నీటి అవసరాలు తీరకపోగా ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా బ్రేకులు పడిపోతాయని ఆ ఇంజనీరింగ్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలానే కొనసాగితే అమలులో ఉన్న నీటి కేటాయింపుల మూలంగా ఆంధ్రప్రదేశ్‌కే అధికంగా మేలు జరుగుతుందని, తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని వివరించారు. కేవలం రాజకీయ పరమైన కారణాలతో కేంద్ర ప్రభుత్వం ఇలా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయకుండా నమ్మించి మోసం చేసిందని, రానున్న ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాన ఎజెండా అవుతుందని, నీళ్ళ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్రంలోని బిజెపి సర్కార్ చర్యల ప్రభావం ఎంతోకొంత తెలంగాణ రాష్ట్ర బిజెపికి నష్టాన్నే కలిగిస్తుందని ఆ అధికారులు గట్టిగా వాదిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News