Monday, April 29, 2024

ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌ఐఎకు కొత్త డైరెక్టర్ జనరల్స్ కేంద్రం నియామకం

- Advertisement -
- Advertisement -

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ), బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బిపిఆర్‌డి), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్)లకు డైరెక్టర్ జనరల్స్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ ప్రకారం, 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపిఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతే ఎన్‌ఐఎ డైరెక్టర్ జనరల్‌గా నియుక్తుడయ్యారు. మరొక 1990 బ్యాచ్ ఐపిఎస్ అధికారి రాజస్థాన్ కేడర్‌కు చెందిన రాజీవ్ కుమార్ శర్మకు బిపిఆర్‌డి డైరెక్టర్ జనరల్‌గా బ్యూరో నిర్వహణను పర్యవేక్షించే బాధ్యత అప్పగించారు.

ఇది ఇలా ఉండగా, 1991 బ్యాచ్‌కు చెందిన ఉత్తర ప్రదేశ్ కేడర్ ఐపిఎస్ అధికారి, ప్రస్తుతం సిఐఎస్‌ఎఫ్ ప్రత్యేక డిజిగా పని చేస్తున్న పీయూష్ ఆనంద్‌ను ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. కొత్తగా నియుక్తులైన ముగ్గురు డైరెక్టర్ జనరల్స్ పదవీ కాలం ఈ నెల 31 నుంచి అమలులోకి వస్తుంది. అయితే, సదానంద్ దాతే పదవీ కాలం 2026 సంవత్సరాంతంతో ముగియనున్నది. రాజీవ్ కుమార్ శర్మ 2026 జూన్ 30 వరకు బిపిఆర్‌డి అధినేతగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక పీయూష్ ఆనంద్‌కు సంబంధించినంత వరకు ఆయన నూతన పదవిలో చేరిన తేదీ నుంచి రెండు సంవత్సరాల పాటు ఎన్‌డిఆర్‌ఎఫ్ డిజిగా బాధ్యతలు నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News