Saturday, April 27, 2024

వెక్కిరిస్తున్న అసమానతలు

- Advertisement -
- Advertisement -

దేశంలో ఆర్థిక వృద్ధి, ప్రగతి పరుగులు తీస్తున్నాయని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప మరొకటి కాదని తాజా నివేదిక గణాంకాల ఆధారంగా స్పష్టం చేసింది. వాస్తవానికి దేశంలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, ధనికులు మరింతగా పెరుగుతున్నారని, ఈ అంతరం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదని ఆ నివేదిక తేల్చి చెప్పింది. పారిస్ కేంద్రంగా ఉన్న ప్రపంచ అసమానతల ల్యాబ్ అగ్ర దేశమైన అమెరికాతో పోలుస్తూ భారత దేశ అసమానతల అగాధం ఏమేరకు ప్రతి యేటా పెరుగుతుందో తెలియజెప్పింది. స్వతంత్ర భారత దేశంలో కన్నా బ్రిటిష్ పాలనలోనే అసమానతల అంతరాలు తక్కువగా ఉన్నాయని, ఇప్పుడే మరింతగా పెరుగుతున్నాయని ఆ ల్యాబ్ ఆందోళన వ్యక్తం చేసింది. కుమార్ భారతి, లాకాస్ చానల్ థబూమస్ పికెట్టి, అన్మోల్ సోమంచి ఆధ్వర్యంలో ఈ నివేదిక వెల్లడైంది. అసమానతలను పూర్తిగా నివారించలేకపోయినా తగ్గించలేకపోవడం కూడా ఆందోళనకర అంశమని ఆ నివేదికలో పేర్కొన్నారు.

భారత దేశ ఆదాయం, సంపదను విశ్లేషిస్తూ మొత్తం పన్నుల వ్యవస్థను పునర్వవస్థీకరించి ధనిక కుటుంబాల నికర సంపదపై 2 శాతం సూపర్ ట్యాక్స్ విధిస్తే తప్ప సంపద కేంద్రీకృతం ఆగదని ఆ నివేదిక కేంద్రానికి సూచించింది. దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారి శాతం అమెరికాతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. అమెరికాలో దాదాపు 60 శాతం దాకా ప్రజలు పన్ను చెల్లిస్తున్నారు. కాని 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశంలో కేవలం 2 కోట్ల 24 లక్షల మందే పన్ను చెల్లిస్తున్నారంటే మన ఆదాయపు పన్ను విధానాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఫిన్లాండ్‌లో 56 శాతం, జపాన్‌లో 55 శాతం, అమెరికాలో 50 శాతంపైగా, నెదర్లాండ్స్‌లో 49 శాతంపైగా ఆదాయపు పన్ను రేట్లు ఉండగా, అది భారత దేశంలో 30 శాతంగానే ఉంది. పన్నుల వ్యవస్థలో ఎగవేతలు భారీగా ఉన్నాయి. ఫలితంగా ధనవంతులు మరింతగా ధనవంతులవుతుంటే, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు.

అసమానతలపై పాలకులు దృష్టి పెట్టి విధానాలను సంస్కరించకపోతే ఇవి దేశంలో పలు దుష్పరిణామాలకు తావిస్తాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటిష్ పాలనతో పోలిస్తే వర్తమాన భారత దేశంలో అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. పారిస్‌కు చెందిన వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కుమార్ భారతి, లూకాస్ చానల్, థబూమస్ పికెట్టీ, అన్మోల్ సోమంచి సహ రచయితలుగా ఉన్న ఈ నివేదిక ప్రభుత్వ పెట్టుబడులకు నిధులను సమకూర్చడానికి దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల నికర సంపదపై 2 శాతం సూపర్ ట్యాక్స్ విధించాలని సిఫార్సు చేసింది. 2014-15 నుంచి 2022–23 మధ్య సంపన్నులకు, పేదలకు మధ్య అంతరం పెరిగిపోయిందని నివేదిక పేర్కొంది. సంపద కేంద్రీకృతం కావడంతో 202223 నాటికి భారత్‌లోని 1 శాతం సంపన్నుల ఆదాయం, సంపద వాటా వరుసగా 22.6 శాతం, 40.1 శాతానికి చేరుకుని చరిత్ర సృష్టించాయని నివేదిక తెలిపింది. అమెరికా విషయానికి వస్తే ఆ దేశంలోని 1 శాతం సంపన్నుల ఆదాయం వాటా 21 శాతం ఉంది.

ఇంత తీవ్ర స్థాయిలో అసమానతలు ఉండడం వల్ల ఆదాయం, సంపదంతా కొందరి వద్దనే పోగుబడిపోతున్నదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇది సమాజంపైన, ప్రభుత్వంపైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నివేదిక తెలిపింది. ఈ అసమానతల నివేదిక రూపకల్పన కోసం ఆదాయ గణాంకాలు, సంపద వివరాలు, పన్నుల వివరాలు, సంపన్నుల జాబితాలు, ఆదాయం, వినియోగం, సంపదకు సంబంధించిన సర్వేలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆదాయం, సంపదను లెక్కల్లో తీసుకుని భారత దేశ పన్నుల వ్యవస్థను పునర్వవస్థీకరించవలసి ఉంటుందని నివేదిక సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రపంచీకరణ మార్పుల ప్రయోజనాలు సామాన్యుడికి కూడా చేరువయ్యేందుకు వీలుగా ఆరోగ్యం, విద్యారంగాలలో పెట్టుబడుల కోసం వనరులను సమకూర్చవలసిన అవసరం ఉందని తెలిపింది. ప్రభుత్వ పెట్టుబడుల కోసం దేశంలోని సంపన్న కుటుంబాల వనరులపైన ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించింది.

202223లో భారత్‌లోని 167 సంపన్న కుటుంబాల ఆదాయం, సంపద జాతీయ ఆదాయంలో 0.5 శాతం ఉందని నివేదిక పేర్కొంది. 1922లో దేశంలోని 1 శాతం సంపన్నుల చేతిలో 1.3 శాతం జాతీయ ఆదాయం ఉండగా, 1982 నాటికి అది 6.1 శాతానికి పెరిగిందని నివేదిక తెలిపింది. 2022 నాటికి అది రికార్డు స్థాయిలో 22.6 శాతానికి చేరుకుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News