Sunday, May 5, 2024

‘కూటమి’ ముసుగులో కుమ్ములాటలు

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: కేంద్రంలో అప్రతిహతంగా కొనసాగుతున్న మోడీ నేతృత్వం లోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి ముగింపు పలకాలన్న ప్రధాన లక్షంతో విపక్షాల సమైక్య ‘ఇండియా’ కూటమిలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. సీట్ల సర్దుబాటు నుంచి ప్రచారాల వరకు ఎక్కడో ఒక చోట పొరపొచ్చాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కూటమి ఒప్పందానికి విరుద్ధంగా కొన్ని పార్టీలు తమ అభ్యర్థులను నేరుగా పోటీలోకి దింపాయి. ఇప్పటికీ పశ్చిమబెంగాల్, ఢిల్లీ, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల్లో కూటమి ఐక్యత అంతగా కనిపించడం లేదు. జాతీయ స్థాయిలో తామంతా కూటమి లోనే కలిసికట్టుగా ఉన్నామని చెబుతున్నా ఆయా రాష్ట్రాల క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి.

ఇటీవల కేరళలోని కూటమి పార్టీల మధ్యనే తీవ్ర పోటీ ఏర్పడడం చర్చనీయాంశం అవుతోంది. కేరళలో సిపిఎం నేతృత్వం లోని లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) వామపక్ష ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. అయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయే. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలు అయినప్పటికీ కేరళలో మాత్రం పోటీపడుతున్నాయి. ముఖ్యంగా కేరళలోని వాయినాడ్ నియోజకవర్గంలో పోరు తీవ్ర స్థాయిలో ఉంది. వాయినాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) మద్దతుతో పోటీలో ఉండగా, ఎల్‌డిఎఫ్ తరఫున సిపిఐ సీనియర్ నాయకురాలు అన్నేరాజా రంగంలో ఉన్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా సిపిఐ తరఫున పిపి సునీల్ పోటీ చేశారు. బిజెపి అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కె. సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. రాహుల్‌కు వామపక్షాల నుంచే కాకుండా బిజెపి నుంచి కూడా పోటీ తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) అధినేత , ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ అవినీతి ఆరోపణలు చేస్తూ బహిరంగంగా విమర్శిస్తున్నారు.అవినీతి కేసులతో పినరయి విజయన్‌కు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్టు ఎలాంటి రుజువులు లేకపోయినా, ఉన్నట్టు అపోహలు సృష్టిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) లేదా సిబిఐ పినరయిని అరెస్ట్ చేసి ఎందుకు విచారించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

తిరువనంతపురం విమానాశ్రయం ద్వారా స్మగ్లింగ్ అయిన బంగారం కేసులో పినరయి విజయన్‌కు సంబంధం ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ కేసు నిందితుల్లో కొందరితో పినరయి విజయన్ మాజీ ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ ఐఎఎస్ అధికారికి సన్నిహిత సంబంధం ఉన్నట్టు కేవలం అనుమానాలే ఉన్నాయి. వీటిని ఆసరా చేసుకుని పినరయిని కేసులో ఇరికించాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇదే విధంగా విజయన్‌పై వ్యతిరేకంగా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) లోపాలను వెతుకుతోంది. దేశం మొత్తం మీద వామపక్ష పార్టీ నేతల్లో ఎవరి మీదా అవినీతి మచ్చలేదన్నది వాస్తవం. వామపక్షాలతో పోటీ పడడం యుడిఎఫ్‌కు అనివార్యమైనప్పటికీ, యుడిఎఫ్ మద్దతు ఇస్తున్న రాహుల్ పినరయిపై కేంద్ర దర్యాప్తు సంస్థలను అనవసరంగా ఉసి గొలుపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

పైగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర దర్యాప్తు సంస్థలకి యుడిఎఫ్ అనుకూల వైఖరి ప్రదర్శిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కాంగ్రెస్‌ను వామపక్షాలకు దూరం చేస్తోంది. ఇది కూటమిలో చీలికకు దారి తీయవచ్చన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ దర్యాప్తులో ఇడికి వ్యతిరేకంగా మొదటిసారి ఆందోళన సాగినప్పుడు కాంగ్రెస్ పార్టీయే ముందున్నప్పటికీ, తరువాత వెనక్కు తగ్గింది. ఇప్పుడు కేరళలో అదే పరిస్థితి కనిపిస్తోంది. సిపిఐ అభ్యర్థి అన్నేరాజాపై కూడా రాహుల్‌కు మద్దతు ఇస్తున్న పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తుండడం, సిపిఐకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. కూటమి లక్షాలకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల కూటమిలోని పార్టీల పైనే వ్యతిరేక ప్రచారం సాగించడం కాంగ్రెస్ ద్వంద్వ రాజకీయ వైఖరిని చాటుతోంది. కేరళలో వటకర నియోజక వర్గ సిపిఎం అభ్యర్థిని కెకె శైలజకు మద్దతుగా ఇటీవల ప్రచారం సాగించిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కాంగ్రెస్ వైఖరిని తూర్పార బట్టారు.

కెకె శైలజపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన ప్రచారం జరుగుతుండడం వెనుక కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రోత్సాహం ఉంటోందని సిపిఎం ఆరోపిస్తోంది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. వాయినాడ్‌లో ఎల్‌డిఎఫ్ తరఫున పోటీలో ఉన్న సిపిఐ అభ్యర్థిని అన్నేరాజాపై కూడా వ్యతిరేక ప్రచారం సాగుతోంది. ఈ వైఖరిని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా కూడా ఆక్షేపించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను అరెస్టు చేయాలని రాహుల్ డిమాండ్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇండియా కూటమికి ఇంకా ప్రధాని అభ్యర్థి ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఇండియా కూటమి నిర్ణయించాలనుకుంటే దానికి వామపక్షాలు అంగీకారం తెల్పకపోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News