Wednesday, October 9, 2024

శ్రీవారి లడ్డూ కల్తీ అంశంలో నిజానిజాలు వెలికితీయండి:డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

తిరుమల లడ్డూ వ్యవహారంలో తమపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. శ్రీవారి లడ్డూ కల్తీ అంశంలో నిజానిజాలు వెలికితీయాలని తన లేఖలో కోరారు. చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నాడంటూ ఆరోపించారు. 100 రోజుల అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ వివాదంతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, తిరుమల సంప్రదాయాలపై అపోహలు పెంచే విధంగా ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఇది ఎంతో సున్నితమైన అంశం అని, దీన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని జగన్ తన లేఖలో విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి పదవికి అప్రదిష్ఠ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రధాని మోడీని కోరారు.

సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు : వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని ఉపయోగించారని ల్యాబ్ రిపోర్టుల్లో నిర్ధారణ కావడంపై దేశవ్యాప్తంగా భక్తులు, ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. న్యాయస్థానాల్లో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందుకు మరొక పిటిషన్ వచ్చింది. జంతు కొవ్వు కలిసిన నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారనే ఆరోపణలపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హిందూ సేన అధ్యక్షుడు, రైతు సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. టీటీడీ లడ్డూ వ్యవహారంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని ఉపయోగించి హిందువుల మనోభావాలను అగౌరవపరిచారని సుర్జిత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం హిందూ సమాజాన్ని తీవ్రంగా కలవర పెడుతోందని అన్నారు. సాధారణ ప్రజల ప్రయోజనం కోసమే తాను ఈ పిటిషన్‌ను దాఖలు చేశానని చెప్పారు. సాధారణ పౌరులు అందరూ కోర్టు తలుపు తట్టలేకపోవచ్చని, సరిగ్గా సన్నద్ధం కాకపోవడం, ఆర్థిక పరిస్థితి అనువుగా లేకపోవడం ఇందుకు కారణాలు కావొచ్చని అన్నారు.

హైదరాబాద్ లో వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదు : లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ నేత జగన్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. హైకోర్టు న్యాయవాది కే. కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీనిపై కలత చెందిన కరుణ్ సాగర్ మాజీ సీఎం జగన్ పై సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ చైర్మన్ సహా పాలక మండలి సభ్యుల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డూ దైవత్వానికి ప్రతీక అని, ఇది ఒక విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టేనని తెలిపారు. అలాగే పవిత్రతో పాటు నాణ్యతలో శ్రీవారి లడ్డూ ప్రసిద్ధి పొందిందని, లడ్డూను తాను అత్యంత గౌరవిస్తానని, ఈ చర్య గత ప్రభుత్వ కుట్రలో భాగమేనని కరుణ్ సాగర్ ఆరోపించారు.
బ్రహ్మోత్సవాలకు హాజరు కండి : కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, అర్చకులు ఆదివారం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు, అర్చకులకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రిక అందించిన అనంతరం శ్యామలరావు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. గత పాలకమండలి హయాంలో లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్టు ఈవో శ్యామలరావు వివరించారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన ప్రక్రియను, ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను తెలిపారు. టీటీడీ తరపున సంప్రోక్షణ చర్యల వివరాలను ఆయన పవన్ కు తెలియజేశారు. కల్తీ నెయ్యి వినియోగానికి అనుమతించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను పరిరక్షించే విషయంలోనూ, ధార్మిక అంశాల అమలులోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు.

ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ : శ్రీవారి ప్రసాదం లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆదివారం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించి పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. దీక్ష చేపట్టిన తర్వాత ఆలయ ప్రాంగణంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏ మతమైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని చెప్పారు. ఏ మతంలో ఇలాంటి ఘటనలు జరిగినా తాము పోరాడతామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలను అపవిత్రం చేశారని, రథాలను తగలబెట్టారని ఆరోపించారు. రాముడి విగ్రహం తల తొలగిస్తే నాడు పోరాడిన విషయాన్ని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రసాదాల కల్తీ, నాణ్యత లేమి గురించి గతంలోనే చెప్పామన్నారు. వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి పూజా విధానాలనే మార్చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. 2019 నుంచి తిరుమలలో నాటి ప్రభుత్వం చాలా మార్పులు చేసిందన్నారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10 వేలు వసూలు చేసి బిల్లు మాత్రం రూ.500కే ఇచ్చారని ఆరోపించారు. శ్రీవారి మహాప్రసాదంగా భావించే లడ్డూను కూడా కల్తీ చేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు.

శ్రీనివాసుడే నాకు పునర్జన్మనిచ్చారు : లడ్డూ వివాదంపై చంద్రబాబు
తిరుమల శ్రీవారితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీనివాసుడే తనకు పునర్జన్మ ప్రసాదించారని ఆయన స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్ రాజశేఖరరెడ్డి ఏడుకొండలను ఐదు కొండలు చేస్తానని చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పట్లో తాను తీవ్రంగా ఖండించానని, పవిత్రమైన క్షేత్రంలో ఐదేళ్లు అపవిత్ర కార్యక్రమాలు చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాలకు తిరుమల కొండను ఒక పునరావాసంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో భక్తుల మనోభావాలకు విలువలేదని, ప్రసాదం నాణ్యతనూ అపవిత్రం చేశారని, చాలా సార్లు భక్తులు అందోళన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. తిరుపతి లడ్డూకు చాలా డిమాండ్ ఉంది. లడ్డూ 150 గ్రాములుంటుంది. 40 గ్రాములు ఆవు నెయ్యి, 40 గ్రాములు శనగపిండి, మిగిలిన దిగుమతులు 70 గ్రాములుంటాయి. లడ్డూ తయారీని ఎవరూ కాపీ చేయకుండా 2009లో పేపెంట్ రైట్స్ పొందారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కాపీ చేయడానికి వీల్లేదు. కానీ చాలా మంది ప్రయత్నం చేశారు. ఎవరి వల్ల కాలేదు. వెంకటేశ్వర స్వామి మహత్యం ఉందని కాబట్టి ఎవరూ కాపీ కొట్టలేకపోయారని సీఎం చంద్రబాబు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News