Thursday, April 25, 2024

కారులోనే ఓటరు షికారు

- Advertisement -
- Advertisement -

TRS Votes

 

పురపోరులో టిఆర్‌ఎస్‌కు అఖండ విజయం ఖాయం

పెరగనున్న టిఆర్‌ఎస్ ఓట్ల శాతం
మున్సిపాలిటీల్లో 2వేలకుపైగా, కార్పొరేషన్లలో 205పైగా వార్డులు గెలుచుకునే సూచన
సెఫాలజీ అధ్యయనం … 104 నుంచి 109 మున్సిపాల్టీలు , 10 కార్పొరేషన్లలో గెలుపు?

హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల్లో 104 నుంచి 109 మున్సిపాలిటీలు, తొమ్మిది నుంచి 10 కార్పొరేషన్లను టిఆర్‌ఎస్ సొంతం చేసుకోనుందని సెంటర్ ఫర్ సెఫాలజీ నుంచి డాక్టర్ వేణుగోపాల రావు నిర్వహించిన సర్వేలో ఈ అంశం స్పష్టమైంది. 2708 వార్డుల్లో శాస్త్రీయంగా నిర్వహించిన ఈ సర్వేలో టిఆర్‌ఎస్ ఓట్ల శాతం పెంచుకోవడంతో పాటు అఖండవిజయం సాధించనుందని పేర్కొన్నారు. రాజకీయ సర్వేల్లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొంది, ఇప్పటివరకు అనేక సర్వేలు చేసిన సెఫాలజీ( ఎన్నికలకు సంబంధించిన గణాంకాలఅధ్యయనం చేసే సంస్థ) వెల్లడించింది. అలాగే టిఆర్‌ఎస్ ఆంతరంగికంగా నిర్వహించిన సర్వేల్లో కూడా ఈ అంశం స్పష్టమైంది. శాస్త్రీయంగా అనేక కోణాల్లోంచి జరిపిన సెఫాలాజీ సర్వేలో 1,900 నుంచి 2000 వార్డులు గెలుచుకుని అత్యధిక మున్సిపాలిటీలను సాధించనుందని సర్వేఫలితాలను ప్రకటించింది. 10 కార్పొరేషన్లలోని 385 వార్డుల్లో 205కు పైగా వార్డుల్లో టిఆర్‌ఎస్ అత్యధిక మెజారిటీ సాధించనుందని సర్వేలో ప్రకటించింది.

ఈ విధంగా సర్వే నిర్వహించారు
హైదరాబాద్‌కు చెందిన సెఫాలాజీ అనేక రాజకీయసర్వేలు నిర్వహించిన చరిత్ర ఉంది. జనవరి రెండవ వారంలో 120 మున్సిపాలిటీలు. 10 కార్పొరేషన్లలో సెఫాలజీ సభ్యులు సర్వే నిర్వహించారు. ప్రతి మున్సిపాలిటీ నుంచి నమూనాలు సేకరించారు. శాస్త్రీయంగా 2708 వార్డుల్లో ఈ సర్వే నిర్వహించారు. కులం, వర్గం, రాజకీయ ప్రాధాన్యతలు, విద్యావంతులు, రైతులు, మహిళల నుంచి నమూనాలు సేకరించారు. అలాగే సర్వేచేస్తున్న సభ్యులు ప్రతి మున్సిపాలిటీలో ముఖాముఖి చర్చలు నిర్వహించారు. ఈ సర్వే పూర్తిగా గోప్యంగా జరిపారు. ఆతర్వాత నమూనాలన్నింటిని రాజకీయ నిపుణులతో పరిశీలించి సర్వేఫలితాలను విడుదల చేశారు.

ఓట్లశాతం పెంచుకున్న టిఆర్‌ఎస్
ప్రజాక్షేత్రంలో టిఆర్‌ఎస్ ఓట్ల శాతం స్థిరంగా ఉండటంతోపాటు పెరిగిందని సర్వేనివేదికలో పేర్కొన్నారు. సెఫాలాజీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాన్ని స్పష్టం చేసింది. 2018 డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 46.9 శాతం ఓట్లు సాధించగా ఆతర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 41.3 శాతానికి పడిపోయింది. అనంతరం జరిగిన జిల్లాపరిషత్ ఎన్నికల్లో తిరిగి ఓట్ల శాతాన్ని స్థిరంగా చేసి జిల్లాపరిషత్‌లను పూర్తి స్థాయిలో టిఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మరింత ఓట్ల శాతం పెరిగిందని సర్వేనివేదికలో పొందుపర్చారు.

టిఆర్‌ఎస్ ప్రస్తుత ఎన్నికల్లో సుమారు 51 శాతం ఓట్లశాతాన్ని పెంచుకుందని సర్వే లో పేర్కొన్నారు. అలాగే టిఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పటివరకు ఉన్నఓట్ల శాతం కోల్పొయినట్లు సర్వే స్పష్టం చేసింది. బిజెపి పరిస్థితి గతంలాగే ఉందేకానీ ఓట్ల శాతాన్ని పెంచుకోలేకపోయిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి,సంక్షేమం, టిఆర్‌ఎస్ పై చెదరని అభిమానంతో ఈ ఎన్నికల్లో ఓట్లశాతం పెరగడానికి ప్రభావితం చేసిన అంశాలుగా సర్వే భావించింది.

కార్పొరేషన్లలో పార్టీల బలబలాలపై సర్వే
రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లలో టిఆర్‌ఎస్ గతంలో కంటే ఓట్ల శాతం పెంచుకుని ముందుకు దూసుకుపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గించుకుని ప్రజలకు దూరంగా నిలిచింది. ఈసర్వే మేరకు కార్పొరేషన్లలో టిఆర్‌ఎస్ 48.80 శాతం ఓట్లు, కాంగ్రెస్ 18 శాతం, బిజెపి 20 శాతం,ఎంఐఎం 3.3 శాతం, ఇతరులు 9.70 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నప్పటికీ టిఆర్‌ఎస్ మరింత ముందుకు వెళ్లే అవకాశాలున్నట్లు పేర్కొంది.

మున్సిపాలిటీల్లో కారు జోరు
120 మున్సిపాలిటీల్లో 104 నుంచి 109 వరకు టిఆర్‌ఎస్ గెలిచే అవకాశాలు స్పష్టమయ్యాయి. ఈ నివేదిక మేరకు ఈ అంశాన్ని విశ్లేషిస్తే ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ వ్యక్తం చేసిన ధీమా కంటే అధికంగా మున్సిపాలిటీలు సాధించనుందనేది స్పష్టం అవుతుంది. ఎన్నికలు జరిగిన 2,727 మున్సిపాలిటీ వార్డుల్లో 1900ల నుంచి 2,000లకు పైగా వార్డులు టిఆర్‌ఎస్ ఖాతలోకి వెళ్లనుండటంతో 109 వరకు మున్సిపాలిటీలను టిఆర్‌ఎస్ గెలుచుకోనుంది. ఇదే విషయాన్ని పెఫాలజీ సర్వే స్పష్టం చేసింది. మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్ 52 శాతం, కాంగ్రెస్23 శాతం, బిజెపి 14.10 శాతం, ఎంఐఎం 1.60 శాతం, ఇతరులు 8.70 శాతం ఓట్లు సాధించనున్నారని సర్వే తెలిపింది.

ఈ సర్వే మేరకు ఓట్ల శాతం పెంచుకుని అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై టిఆర్‌ఎస్ గులాబి జెండా ఎగురనుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అలాగే కారు స్పీడ్ ముందు కాంగ్రెస్,బిజెపి,ఎంఐఎం నిలవలేకపోయిందనే ఆనందం పార్టీ వర్గాల్లో ఉంది. పోలింగ్ కంటే ముందు నిర్వహించిన ఈ సర్వే ఫలితాలకంటే మరిన్ని ఎక్కువస్థానాల్లో టిఆర్‌ఎస్ గెలవ నుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఎన్నికల పోలింగ్ సరళి పరిశీస్తే 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో కారు స్పీడ్‌గా దూసుకు వెళ్లిందని టిఆర్‌ఎస్ నాయకులు చెప్పారు. ప్రతి వార్డులో టిఆర్‌ఎస్ విజయం సాధించనుందనే ధీమాను వ్యక్తం చేశారు. అయితే నేటి ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీ ఏ మేరకు విజయం సాధించనుందో స్పష్టంకానుంది.

Percentage of increased TRS Votes
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News