Friday, March 29, 2024

పురవరులు తేలేది నేడే

- Advertisement -
- Advertisement -

 Municipal Election

 

మధ్యాహ్నం లోపే మున్సిపోల్ ఫలితాలు

ఉదయం 8గం.కు లెక్కింపు ప్రారంభం, 10 గం.ల లోపే తొలి ఫలితం, 129 కౌంటింగ్ కేంద్రాల్లో వార్డుల వారీగా టేబుళ్ల ఏర్పాటు
రెండు దశల్లో కౌంటింగ్
సమాన ఓట్లు వస్తే లాటరీ

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శనివారం మధ్యాహ్నంలోపే తెలియనున్నాయి. ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తయ్యేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటి గంట కౌంటింగ్ ముందస్తు ప్రక్రియకు తీసుకుంటుంది. తొమ్మిది గంటలకు లెక్కింపు మొదలవుతుంది. తక్కువ ఓట్లు పోలైన వార్డుల ఫలితాలు గంట, గంటన్నరలో వెల్లడయ్యే అవకాశముంది. మొత్తం 129 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా ఫలితాలను సాధ్యమైనంత త్వరగా అందించేలా ఓట్ల లెక్కింపునకు 2619 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 24 వార్డులు అంతకంటే ఎక్కువ ఉన్న దగ్గర వార్డుకు ఒక ఓట్ల లెక్కింపు టేబుల్ ఉంటుంది. తక్కువ వార్డులున్న మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు.

అత్యధికంగా రామగుండం కార్పొరేషన్‌లో 120 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు శనివారం జరగనుంది. ఏకగ్రీవమైనవి కాకుండా మున్సిపాలిటీల్లోని 2,647 వార్డులు, కార్పొరేషన్లలోని 324 డివిజన్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో ఎలాంటి వివాదాలు, గందరగోళానికి తావులేకుండా ఓట్ల లెక్కింపు ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఎన్నికల పరిశీలకులకు స్పష్టం చేసింది. సగటున 1200 ఓట్లు పోలై ఉంటే లెక్కింపునకు మూడు గంటల సమయం తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంతకంటే తక్కువ ఓట్లున్న దగ్గర గంట, రెండు గంటల్లోనే లెక్కింపు పూర్తవుతుంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు.

రెండు దశల్లో
పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు. మొదటిది ప్రాథమిక దశగా, రెండోది ఫలితం నిర్దేశించే దశ (గుర్తుల వారీగా ఓట్ల లెక్కింపు)గా నిర్దేశించారు. ఓట్ల లెక్కింపు పర్యవేక్షకులు, సహాయకులు ఉదయం ఆరు గంటలకే లెక్కింపు కేంద్రానికి చేరుకొంటారు. అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ను తెరుస్తారు. పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బ్యాలెట్ పెట్టెను సంబంధిత టేబుల్ వద్దకు తీసుకొస్తారు. ఓట్ల లెక్కింపునకు ప్రతి టేబుల్ వద్ద ఒక పర్యవేక్షకుడు, ఇద్దరు సహాయకులు ఉంటారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కిస్తారు. మొత్తం 3018 మంది సూపర్ వైజర్‌లు, 5876 మంది అసిస్టెంట్లు మొత్తంగా 8894 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

అనుమానాస్పద ఓట్లపై ఆఖర్లో నిర్ణయం
ప్రతి టేబుల్‌పై ఆయా వార్డులో పోటీచేసిన అభ్యర్థులకు ఒక్కో ట్రేను ఉంచుతారు. నోటాకు ఒకటి , అనుమానంగా ఉన్న ఓట్లకు మరోటి ఉంచుతారు. ఓట్ల కట్టలు విప్పి అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ఆయా అభ్యర్థికి సంబంధించిన ట్రేలో వేస్తారు.నోటాకు వచ్చిన ఓట్లను నోటా ట్రేలో, సిరా సరిగా అంటని, రెండువైపులా అంటి, అనుమానంగా కనిపించే ఓట్లను మరో ట్రేలో వేస్తారు. అనుమానస్పదంగా ఉన్న ఓట్లపై ఆఖర్లో రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకొంటారు. అభ్యర్థులను లేదా ఏజెంట్లను పిలిచి వారి సమక్షంలో రిటర్నింగ్ అధికారి వాటిపై నిర్ణయం తీసుకొంటారు. తర్వాతే అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను ప్రకటిస్తారు.

మధ్యలో ఉంటే స్కేలుతో కొలిచి నిర్ణయం
బ్యాలెట్ పత్రంపై ఓటర్లు వేసిన స్వస్తిక్ ముద్ర ఇద్దరు అభ్యర్థుల పేర్ల మధ్యలో ఉంటే, అధికారులు స్కేలుతో కొలిచి నిర్ణయం తీసుకుంటారు. ఇద్దరు అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి పేరుకు సమీపంలో స్వస్తిక్ ముద్ర ఉందో చూసి ఓటును ఆ అభ్యర్థి ఖాతాలో వేస్తారు. అభ్యర్థి పేరుపై స్వస్తిక్ ముద్ర వేయకుండా టిక్ చేసినా సరే దాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఇద్దరు అభ్యర్థుల పేర్లపై టిక్ చేస్తే తిరస్కరిస్తారు. ఒకవేళ ఎవరైనా ఓటర్లు అత్యుత్సాహంతో బ్యాలెట్ పత్రంపై ఎక్కడైనా తమ ఓటరు సీరియల్ నంబరు రాసిన పక్షంలో వాటిని తిరస్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు.

కేంద్రాల సంఖ్య ఆధారంగా ఏజెంట్లు
పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా వార్డు పరిధిలోని పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా కౌంటింగ్ ఏజెంట్ల నియమానికి ఎన్నికల అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఒక వార్డులో నాలుగు పోలింగ్ కేంద్రాలుంటే ముగ్గురు ఏజెంట్ల నియామకానికి అనుమతిస్తారు. ఇందులో ఓట్ల లెక్కింపు టేబుళ్ల వద్ద ఇద్దరు, రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద్ద పరిశీలన నిమిత్తం మరో ఏజెంటును నియమించుకునే వెసులు బాటు కల్పించారు.

రీ కౌంటింగ్ చేయాలంటే
వార్డు పరిధిలోని ఓట్ల లెక్కింపు పూర్తికాగానే కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకొన్న తరువాత రెండు నిమిషాల వ్యవధిలోనే రిటర్నింగ్ అధికారి ఆయా వార్డు ఫలితాన్ని వెల్లడిస్తారు. ఫలితంపై పోటీచేసిన అభ్యర్థులకు ఎవరికైనా అభ్యంతరాలుంటే నిర్ణీత పదిహేను నిమిషాలలోపు రాతపూర్వకంగా అభ్యంతరాన్ని తెలియజేస్తూ రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు సమర్పిస్తేనే రీ కౌంటింగ్‌కు అవకాశం ఉంటుంది. రీ కౌంటింగ్‌పై తుది నిర్ణయం మాత్రం రిటర్నింగ్ అధికారిదేనని ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Today Municipal Election Results
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News