Wednesday, December 4, 2024

రేపు అఖిల భారత డిజిపి మహాసభకు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ భువనేశ్వర్‌లో శనివారం నుంచి రెండు రోజుల పాటు అఖిల భారత పోలీస్ డైరెక్టర్ జనరల్స్ (డిజిపిలు)/ ఇన్‌స్పెక్టర్ జనరల్స్ (ఐజిలు) మహాసభకు హాజరవుతారు. మూడు రోజుల మహాసభలో ఉగ్ర నిరోధం, వామపక్ష తీవ్రవాదం, తీరప్రాంత భద్రత, కొత్త నేర చట్టాలు, మాదకద్రవ్యాలు సహా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక విభాగాలపై చర్చించనున్నట్లు ప్రధాని కార్యాయం (పిఎంఒ) ఒక ప్రకటనలో తెలియజేసింది. మహాసభ శుక్రవారం మొదలైంది. జాతీయ భద్రతకు సంబంధించిన విభిన్న సమస్యలపైన, పోలీస్ శాఖ ఎదుర్కొంటున్న వివిధ నిర్వహణ, మౌలిక వసతులు. సంక్షేమ సంబంధిత సమస్యలపైన స్వేచ్ఛగా చర్చించేందుకు దేశంలోని సీనియర్ పోలీస్ అధికారులు, భద్రత విభాగం అధిపతులకు ఈ మహాసభ ఒక ఇష్టాగోష్ఠి వేదిక కాగలదని పిఎంఒ తెలిపింది. నేర నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ, అంతర్గత భద్రత ముప్పులకు సంబంధించిన సవాళ్లను అధిగమించే ప్రక్రియలు, వృత్తిపరమైన విధానాలు రూపొందించడం,పంచుకోవడం గురించి కూడా చర్చలు సాగుతాయి.

మోడీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశం అంతటా వార్షిక మహాసభ నిర్వహణను ప్రోత్సహిస్తున్నారని పిఎంఒ ఆ ప్రకటనలో తెలియజేసింది. మహాసభ ఇంత వరకు గౌహతి (అస్సాం), రాణ్ ఆఫ్ కచ్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), టెకన్‌పూర్ (గ్వాలియర్, మధ్య ప్రదేశ్), స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (కేవడియా, గుజరాత్), పుణె (మహారాష్ట్ర), లక్నో (ఉత్తర ప్రదేశ్), న్యూఢిల్లీ, జైపూర్ (రాజస్థాన్)లలో జరిగింది. ఇప్పుడు ఒడిశా రాజధానిలో జరుగుతోంది. విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్ పతకాన్ని కూడా మహాసభ సమయంలో ప్రదానం చేయనున్నారు. డిజిపి మహాసభ పట్ల మోడీ సదా అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తున్నారని పిఎంఒ తెలిపింది. ఈ ఏడాది కొన్ని విలక్షణ అంశాలను మహాసభకు చేర్చారని, యోగా సెషన్, వాణిజ్య సెషన్ నుంచి రోజంతా సమర్థంగా వినియోగించుకుంటారని పిఎంఒ వివరించింది. దేశాన్ని ప్రభావితం చేసే అంతర్గత భద్రత వ్యవహారాలు, కీలక పోలీసింగ్ వంటి అంశాలపై తమ అభిప్రాయాలు,

సూచనలను మోడీకి వివరించే అమూల్య అవకాశం కూడా సీనియర్ పోలీస్ అధికారులకు ఈ మహాసభలో కలుగుతుందని పిఎంఒ తన ప్రకటనలో తెలియజేసింది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, ప్రధానికి ప్రిన్సిపల్ కార్యదర్శి పికె మిశ్రా, జాతీయ భద్రత సలహాదారుల అజిత్ దోవల్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డిజిపిలు, కేంద్ర పోలీస్ సంస్థల అధిపతులు కూడా మహాసభకు హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News