Monday, April 29, 2024

నిష్పక్షపాత దర్యాప్తు!

- Advertisement -
- Advertisement -

PM Narendra modi security breach in punjab పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్య ఘటనపై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల విచారణ కమిటీని నియమించడం వొక మంచి పరిణామం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నాయకత్వంలోని కమిటీ లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) డైరెక్టర్ జనరల్ గాని, ఆయన నియమించే ఐజి ర్యాంకుకు తక్కువగాని అధికారి గాని, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంత డిజిపి, పంజాబ్ భద్రతా వ్యవహారాల ఎడిజిపి, ఈ సంఘటనకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకొన్న పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సభ్యులుగా ఉంటారు. పాకిస్థాన్ సరిహద్దులకు చేరువలోని ఫిరోజ్ పూర్ పర్యటన సందర్భంగా ఈ నెల 5 న ప్రధాని మోడీ వాహనశ్రేణి వొక ఫ్లై ఓవర్ మీద 15-20 నిమిషాల పాటు నిలిచిపోవలసి వచ్చిన భద్రతా వైఫల్య ఘటనపై ఈ కమిటీ కూలంకష దర్యాప్తు జరుపుతుంది. ఆ రోజు ప్రధాని మోడీ ఫిరోజ్ పూర్‌లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడవలసి ఉండింది.

అందుకోసం విమానంలో భటిండా వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఫిరోజ్ పూర్ చేరుకోవాలన్నది ముందుగా అధికారికంగా నిర్ణయించిన కార్యక్రమం. అయితే వాతావరణం బాగులేనందున, తమిళనాడులో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బిపిన్ రావత్ తదితరుల హఠాన్మరణానికి దారి తీసిన మాదిరి ప్రమాదాన్ని నివారించడం కోసం ప్రధానిని రోడ్డు మార్గంలో పంపించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం ప్రధాని వాహనశ్రేణి (కాన్వాయ్) బయలుదేరిన కాసేపటికి అల్లంత దూరాన రైతు ఆందోళనకారులు ఆయన దారికి అడ్డంగా నిరసన ప్రదర్శన చేపట్టినట్టు సమాచారం అందడంతో ఒక ఫ్లై ఓవర్ మీద అకస్మాత్తుగా ఆ కాన్వాయ్ నిలిచిపోవలసి వచ్చింది. అలా 15-20 నిమిషాల పాటు ప్రధాని మోడీ అక్కడ ఆగిపోయారు. దేశ ప్రధాని గూటిలోని పిట్టలా శత్రు దాడికి అందుబాటులో నడిరోడ్డున నిలిచిపోడం అసాధారణమైన భద్రతా లోపమనడానికి సందేహించవలసిన పని లేదు. ఇంతకు ముందెప్పుడూ ప్రధానికి ఇటువంటి భద్రతా సవాలు ఎదురు కాలేదు. ఇదే మొదటి సారి. అందుచేత దీనినొక అతి తీవ్ర లోపంగా భావించి దర్యాప్తు చేయక తప్పని పరిస్థితి తలెత్తింది.

ప్రధాని భటిండా నుంచి రోడ్డు మార్గంలో ఫిరోజ్ పూర్ చేరుకోవాలని తీసుకొన్న నిర్ణయానికి సంబంధించిన సమాచారం సకాలంలో పంజాబ్ పోలీసులకు చేరలేదా, చేరితే వారు అందుకు తగినట్టు ఆయన రోడ్డు మార్గంలో ప్రదర్శకులను చెదరగొట్టవలసిన బాధ్యతను గుర్తించలేదా? లోపం ఎక్కడ జరిగింది, బాధ్యులెవరు? అనేది తేలాలి. మామూలుగానైతే పాలనాపరమైన ఉన్నత స్థాయి దర్యాప్తులో ఇది తేలిపోవలసి ఉంది. పంజాబ్‌లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మామూలుగానే బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య పచ్చిగడ్డి భగ్గుమంటుంది. ఎన్నికల సమయం కాబట్టి ఈ పరిణామం రెండు పార్టీల మధ్య పరస్పర ఆరోపణల యుద్ధానికి దారి తీసింది. భద్రతా లోపానికి పూర్తి బాధ్యత పంజాబ్ ప్రభుత్వానిదేనని కేంద్ర హోం శాఖ ఆరోపించింది. ఆ మేరకు దానికి నోటేసులు కూడా ఇచ్చింది. తమ తప్పేమీ లేదని, రైతు ఉద్యమకారులను ఖాళీ చేయించినా ప్రధాని ఉద్దేశపూర్వకంగా వెనుదిరిగారని, ఫిరోజ్ పూర్ సభకు 70,000 కుర్చీలు వేయగా 700 మంది కూడా హాజరుకాకపోడంతో రైతు ప్రదర్శనను సాకు చేసుకొని, వాహన శ్రేణిని నిలిపివేసి రాజకీయం చేశారని పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర పెద్దలు ఆరోపించారు.

ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం సైతం వొక దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ధర్మాసనం చొరవ తీసుకొని జస్టిస్ ఇందు మల్హోత్ర దర్యాప్తు కమిటీని నియమించడం మంచిదయింది. ప్రశ్నలను ఏకపక్ష దర్యాప్తుకు విడిచిపెట్టలేమని, న్యాయ శోధనలో శిక్షణ పొందినవారి ఆధ్వర్యంలో విచారణ జరగాల్సి ఉందని సిజెఐ ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రం, పంజాబ్ ప్రభుత్వం నియమించిన దర్యాప్తులను రద్దు చేసింది. పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ నోటీసులివ్వడాన్ని తప్పు పట్టింది. అంతేకాకుండా జస్టిస్ ఇందు మల్హోత్ర కమిటీ ఈ ప్రత్యేక ఘటనలో భద్రతా లోపానికి బాధ్యులెవరో నిర్ధారిస్తూనే భవిష్యత్తులో ప్రధానికే కాకుండా మొత్తం రాజ్యాంగ పదవుల్లోని వారెవరికీ ఇటువంటి భద్రతా వైఫల్యం ఎదురు కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను సిఫారసు చేయాలని కూడా సూచించింది. ఆ విధంగా ఈ దర్యాప్తు విశేషమైనది. సాధారణంగా ప్రధాని సన్నిహిత భద్రతకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్‌పిజి) బాధ్యత వహిస్తుంది. అందుకు తోడు ఆయన పర్యటనలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు తగిన తోడ్పాటునిస్తుంది. లోపం ఎక్కడుందో రాజకీయాలకతీతంగా, నిష్పాక్షికంగా బయటపడవలసి ఉంది. అది లోపరహితంగా సిద్ధిస్తుందని ఆశిద్దాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News