Saturday, July 27, 2024

సీజ్ చేసిన వాహనాల వేలానికి సిద్ధం

- Advertisement -
- Advertisement -

Police department Prepare for auction of seized Vehicles

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 39 సిపి చట్టం ప్రకారం సీజ్ చేసిన దాదాపు 20వేల వాహనాల దారులకు నోటీసులు ఇచ్చినప్పటికీ తిరిగి తీసుకోని కారణంగా వాటిని వేలం వేసేందుకు పోలీసు శాఖ సిద్దమైంది. ఈక్రమంలో చోరీకి గురైన వాహనాలతో పాటు మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపినా వాహన చోదకుల నుంచి పోలీసులు ఆయా వాహనాలను స్వాధీనం చేసుకుంటారన్న విషయం విదితమే. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపి జరిమానాలు చెల్లించకుండా తప్పించుకు తిరిగే వాళ్ల వాహనాలు కూడా పోలీసులు జప్తు చేశారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 39 సిపి చట్టం ప్రకారం సీజ్ చేసిన వాహన యజమానులకు మూడు నోటీసులు జారీ చేసినా యజమాని నుంచి ఎలాంటి స్పందన రాకపోతే పోలీసులు ఆ వాహనాలను వేలం వేయడానికి సిద్ధం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ఇదిలావుండగా కొందరు వాహన చోదకులు పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారనే భయంతో తిరిగి వాహనాలు తీసుకోవడం లేదన్నది సమాచారం.

కాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతల విభాగం పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సిసిఎస్ పోలీసులు సీజ్ చేసిన వాహనాలన్నింటిని సిటీ ట్రైనింగ్ సెంటర్ కు అప్పచెప్పారు. దీంతో సిటి ట్రైనింగ్ సెంటర్ వాహనాల వివరాలన్నింటిని ఆన్ లైన్ లో పొందుపర్చి సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రకటన సైతం ఇచ్చారు. వాహనాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలున్న వాహనాలను వేలం వేయనున్నామని, వీటిపై ఏమైనా అభ్యంతరం ఉన్నవాళ్లు ఆర్నెళ్ల లోపు సరైన ధ్రువీకరణ పత్రాలు తీసుకొస్తే వారి వాహనాలను అప్పజెప్తామని అధికారులు చెబుతున్నారు. సీజ్ చేసిన ఆన్ లైన్ పెట్టడం వల్ల యజమాని ఒకవేళ తన వాహనం ఉంటే దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, యాజమాన్య పత్రాలు తీసుకెళ్తే పోలీసులు అప్పజెప్పడం జరుగుతుంది. సిటిసి ఆధ్వర్యంలో నోటిఫికేషన్ ఇచ్చిన ఆర్నెళ్ల లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆయా వాహనాలను వేలం వేసేందుకు అనుమతిస్తారు.

గడచిన నాలుగేళ్లలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 15 వేల వాహనాలను వేలం వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 4.25 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని, దీంతో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తూ వాహనాలు వేలం వేస్తున్నారు. ఒక్క పోలీసు శాఖలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని వాహనాలను ఇదే విధానంలో వేలం వేయాలని సోమేశ్ కుమార్ సంబంధిత శాఖలకు సూచించారు. ఈక్రమంలో వేలం వేసే వాహనాలకు సంబంధించి ధర నిర్ణయించే విషయంలోనూ రవాణా శాఖ అధికారులు సాయాన్ని తీసుకుంటున్నారు. కండీషన్ లో ఉన్న బండిని పూర్తిగా పరిశీలించి ఎంవిఐలు ధర నిర్ణయిస్తారు. ఒకవేళ వాహనం తుక్కుగా మారితే దాన్ని కిలో లెక్కన విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేలం ద్వారా పొందిన వాహన యజమానులకు పోలీస్‌శాఖ ఓ పత్రం అందిస్తుందని, దీంతో సంబంధిత ఆర్‌టిఎ కార్యాలయాల్లో మూడు నెలలలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News