Saturday, April 27, 2024

జరగబోయే నేరంపై ఎఐ నిఘా?

- Advertisement -
- Advertisement -

పోలీసు వ్యవస్థ కన్నా ముందే నేరాన్ని పసిగట్టేంత దమ్ము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వుంటుందా? అలా అయితే అట్లాంటిక్‌లో ఈ టెక్నాలజీని అన్ని రంగాల్లోనూ ఉపయోగిస్తున్నా అక్కడి క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టడం లేదు ఎందుకని..? ఇలా చాలా అనుమానాలకు దారి తీస్తోంది సరికొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా దేశాల్లో పోలీసు శాఖల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఐ) సేవలను వినియోగించుకోవడం ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. అమెరికాలోని సారా అనే మహిల గృహ హింస ఎదుర్కొంటున్నాని, తక్షణమే సహాయం చేయాలంటూ తన ఫోన్ నుండి ఎమర్జెన్సీ నంబర్‌కు డయల్ చేశారు. తన మాజీ భర్త దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేయడం చూసి ఆమె భయపడిపోయారు. కాల్ సెంటర్ వ్యక్తితో సారా మాట్లాడుతుండగానే ఆ కాల్‌ను ఎఐ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ట్రాన్స్ స్రైబ్ చేస్తుంది. అందతా బ్రిటన్ పోలీసు డేటాబేస్‌లో నిక్షిప్తమవుతుంది. సారా తన మాజీ భర్త పూర్తి పేరు, జన్మించిన తేదీని చెప్పగానే, ఆ ఎఐ సారా చెప్పిన వివరాలతో డేటాబేస్‌లో వెతికి, ఆమె మాజీ భర్తకు సంబంధించిన వివరాలను గుర్తిస్తుంది. అందులో అతడి దగ్గర గన్ లైసెన్స్ కూడా వుందన్న వివరాలు కనిపించాయి.

పోలీసులు ఆ సమాచారం తెలుసుకొని సాధ్యమైనంత త్వరగా ఆమెకు సాయం చేసుందుకు పోలీసులు సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్ళారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇచ్చిన సమాచారం తప్పని పోలీసులు గుర్తించారు. 2023 లో హంబర్‌సైడ్ పోలీసులు ఎఐ ఎమర్జెన్సీ కాల్ సాఫ్ట్‌వేర్ సర్వీస్‌ను మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా వినియోగించిన సమయంలోనే ఇటువంటి ఒక ట్రయల్ బేస్డ్ టెస్ట్‌ను నిర్వహించారు.అన్‌ట్రైట్ అనే ఎఐ స్టార్టప్ సంస్థ రూపొందించిన ఈ ఎఐ సాఫ్ట్‌వేర్ సాయంతో రోజూ హంబర్‌సైడ్ విభాగానికి వచ్చే వేల కాల్స్‌ను అటెండ్ చేయడానికి వాటిని విశ్లేషించి మరింత సమర్థవంతంగా, వేగంగా పని చేయడానికి వీలు కలుగుతుందని అన్‌ట్రైట్ సంస్థ చెబుతోంది. ఆ సాఫ్ట్‌వేర్ రూపొందించేందుకు హంబర్‌సైడ్‌లో రెండేళ్ళ కాలానికి సంబంధించిన గృహహింస కేసుల డేటాను సేకరించి వినియోగించుకున్నారు. తాము రూపొందించిన ఎఐ సాఫ్టవేర్ ఆపరేటర్లకు అసిస్టెంట్‌గా పని చేయడమే కాకుండా, వారి శ్రమను చాలా వరకు ఆదా చేస్తుందని, ఆ సమయంలో మరింత సమర్థవంతంగా వారు పని చేసేందుకు దోహదపడుతుందంటున్నారు సంస్థ కో ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కమీలా.

అన్‌ట్రైట్ ఎఐ స్టార్టప్ సంస్థ రూపొందించిన ఎఐ మోడల్ ఎక్కువ మొత్తంలో సమాచారాన్ని విశ్లేషిస్తుంది. ప్రతి కాల్‌కు సంబంధించిన ఆడియో ట్రాన్స్ స్క్రిప్ట్ ఫైల్‌ను విశ్లేషించి దాని ఆధారంగా ఆ కాల్ ప్రాధాన్యాన్ని నిర్ధారిస్తుంది. ఆ ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకొని స్కోరింగ్ ఇస్తుంది. ఆ వచ్చే ఫలితాన్ని బట్టి పోలీసు అధికారి ఎలా స్పందించాలో కూడా సూచిస్తుంది. ఆ స్కోర్‌ను తక్కువ, మధ్య, అత్యధిక స్థాయి స్కోరింగ్ అంటూ విభజించారు. ఎక్కువ స్కోర్ వచ్చిందంటే పోలీసు అధికారి ఐదు లేదా పది నిమిషాల్లోగా కాల్ చేసిన ఘటనా స్థలికి చేరుకోవాలని అర్థం. అన్‌ట్రైట్ సంస్థ చెబుతున్న దాని ప్రకారం ఎఐ సాఫ్ట్‌వేర్‌తో ఆపరేటర్ల సమయంలో మూడో వంతును ఆదా అవుతుంది. అంతేకాక ప్రతి కాల్‌కు కేటాయించే సమయం తగ్గిపోతుందని కమీలా చెప్పారు.

ఊహించని రీతిలో సేవలు
ఎఐ మోడల్‌కు నమూనా పరీక్షలు నిర్వహించిన అనంతరం, తర్వాత దశలో ప్రత్యక్ష పరిశీలన నిర్వహిస్తారు. అందుకోసం అన్‌ట్రైట్ సంస్థ ఇప్పటికే ఎమర్జెన్సీ సర్వీసు విభాగాలు పోలీసులను సంప్రదించింది. పోలీసుల దర్యాప్తులో సహకారంతో పాటు, కేసుల పరిష్కారాల్లోనూ ఉపయోగపడే సమర్థత కృత్రిమ మేధకు వుంది. గత డేటాను విశ్లేషించి మనుషుల కంటే వేగంగా పని చేయగలదు. అయితే కొన్ని చోట్ల సాంకేతిక లోపాల కారణంగా తప్పులు జరుగుతున్నాయి. ఉదా॥ నిరుడు అమెరికాలో ఎఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ నల్ల జాతీయులను గుర్తించడంలో విఫలమైందని, ఎఐ సాఫ్టవేర్ ఆధారంగా కొంత మంది అమాయకులు అరెస్టయ్యారని వార్తలు వచ్చాయి. అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కో, సియాటెల్ వంటి నగరాల్లో వీటి వినియోగాన్ని నిషేధించారు. అయితే అట్లాంటిక్ ఇరువైపులా వున్న ప్రాంతాల్లో పోలీసు శాఖల్లో వీటి వినియోగం క్రమేణా పెరిగింది. యుఎస్ యాంటీ సర్వైలెన్స్ ప్రెజర్ గ్రూప్ సర్వైలెన్స్ టెక్నాలజీ ఓవర్ సైట్ ప్రాజెక్టు (స్టాప్) సంస్థ అధినేత ఆల్బర్డ్ కాహ్న్ మాత్రం చాలా మార్పుల పట్ల సంతోషంగా లేరు. “ఫేషియల్ రికగ్నిషన్ కోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. అలా రూపుదిద్దుకొన్న సాఫ్ట్‌వేర్‌లు కొన్ని కేసుల్లో ఆధారాలు తగినన్ని లభించినప్పటికీ నల్ల జాతీయులు, లాటిన్, ఆసియా ప్రజల పట్ల పక్షపాత వైఖరితో వున్నట్లు కనిపించింది” అని అన్నారు. ఆ కారణంగా ఏ తప్పూ చేయని వారు కూడా దోషులని ఆ సాఫ్ట్‌వేర్ తేల్చేస్తుంది.

కృత్రిమ మేధ ఆధారంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌లు మూడు ముఖ్యమైన అంశాల్లో ఉపయోగపడతాయి. వాటిల్లో మొదటిది లైవ్ ఫేషియల్ రికగ్నిషన్. ఇది నిజమైన వ్యక్తి చిత్రాన్ని క్యాప్చర్ చేసుకొని తన దగ్గరున్న సమాచారంతో వెతికి, ఆ వ్యక్తి ఎవరో చెప్తుంది. రెండోది గత చిత్రాల్లోని ముఖాలను గుర్తించడం. ఈ పని చేయడం ద్వారా ఆ వ్యక్తి ముఖాన్ని, డేటాబేస్‌లో వేల సంఖ్యలో వున్న చిత్రాలతో పోలుస్తుంది. మూడో అంశం ఏమిటంటే ఆపరేటర్ ఫేష్ రికగ్నిషన్‌ల ఆధారంగా అనుమానితుడి పూర్తి వివరాలు తెలుసుకోవడం. ఆపరేటర్ ఆ వ్యక్తి ఫోటోను తీసుకొని ఆ సాఫ్ట్‌వేర్‌కు ప్రోగ్రామింగ్ చేసిన ఇమేజ్ డేటాబేస్‌లో వివరాల కోసం అన్వేషిస్తారు.2023 అక్టోబర్‌లో యుకె పోలీసింగ్ శాఖ మంత్రి క్రిస్ ఫిలిప్ మాట్లాడుతూ “రానున్న ఏడాదిలో యుకెలోని పోలీసు శాఖ అంతటా ఫేషియల్ రికగ్నైజ్ సాఫ్ట్‌వేర్ వినియోగం రెట్టింపు చేస్తాం” అని చెప్పారు. అదే సమయంలో యుకెలోని నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (ఎన్‌ఫిఎల్) మెట్రోపాలిటన్, సౌత్ వేల్స్ పోలీసు విభాగం వినియోగిస్తున్న మూడు వేర్వేరు ఎఐలను వేర్వేరుగా పరిశీలించింది. తమ పరిశీలనలో టెక్నాలజీ పరంగా దొర్లే పొరపాట్లను అధిగమిస్తూ ఆధునిక టెక్నాలజీతో ఎఐ టూల్స్ అభివృద్ధి చెందాయని తేల్చారు. వెస్ట్ మిడ్ ల్యాండ్ పోలీసులు మరో అడుగు ముందుకేసి కొత్త సాంకేతిక పరికరాలను విశ్లేషించేందుకు ఎథిక్స్ కమిటీని వేయాలని నిర్ణయించారు. ఆ కమిటీకి యూనివర్శిటీ ఆఫ్ నార్తంబ్రియాకు చెందిన ప్రొఫెసర్ మారియన్ ఒస్వాల్డ్ నేతృత్వం వహించనున్నారు.

బిబిసితో ఆయన మాట్లాడుతూ “కమిటీ కొత్త ఫేషియల్ రికగ్నిషన్ సాయంతో అనుమానితుడి ఫోటోను తీసుకొని, ఆ ఫోటోను సాఫ్ట్‌వేర్‌లో ఎలా వెతికి పట్టుకుంటుందో చూడాలి” అన్నారు. నేర నియంత్రణలో ఎఐ పాత్ర కీలకంగా మారే అవకాశమూ వుంది. ఏ ప్రాంతాల్లో నేరాలు ఎక్కువ జరుగుతాయి? ఎవరు ఆ నేరాలకు పాల్పడే అవకాశం వుంది? అన్న విషయాలు డేటా ఆధారంగా అంచనా వేసి, వాటిని నివారించడంలో ఎఐ కీలకంగా మారొచ్చు. 2002లో విడుదలైన సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘మైనారిటీ రిపోర్ట్’ చిత్రం ఈ ఆలోచన ఆధారంగా రూపుదిద్దుకున్నదే. అయితే ప్రజలు ఈ కల్పనను ఎఐ నిజం చేస్తుందని చెబుతోంది.
యూనివర్శిటీ ఆఫ్ చికాగోకు చెందిన బృందం 90% కచ్చితత్వంలో వారం ముందుగానే జరగబోయే నేరాలను అంచనా వేసే అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసింది. ఆ సాఫ్ట్‌వేర్లు అన్ని ఏకపక్ష చారిత్రక డేటా ఆధారంగా పని చేస్తున్నాయని అన్నారు కాహ్న్. “అమెరికాలో మేం చాలా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు చూశాం. అవన్నీ భవిష్యత్తులో జరగబోయే నేరాలపై హెచ్చరిస్తాయి” అన్నారు. ఇంత టెక్నాలజీ వున్నప్పటికీ అమెరికాలో నేరాల సంఖ్య ఎక్కువే. ప్రొఫెసర్ మారియన్ మాట్లాడుతూ “భవిష్యత్తులో జరిగే నేరాల నియంత్రణకు ఏర్పాటైన ఎఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌లో భద్రతా పరమైన అంశాలు కూడా వుంటాయి. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే నిజానికి ఇది జరగబోయే నేరాలను ముందే పసిగట్టడం కాదు, ఆ సాఫ్ట్‌వేర్‌కు ఇచ్చిన డేటా ఆధారంగా నేరాలు జరిగే అవకాశాన్ని మాత్రమే అంచనా వేస్తుందని అని అర్థం చేసుకోవాలన్నారు.

ఇక్కడ గుర్తించాల్సిన సమస్య ఏమిటంటే గతంలో అలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తిని, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వివరాలతో పోల్చి చూస్తున్నారు. అంతేకాక అందుబాటులో వున్న పరిమిత సమాచారం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆ వ్యక్తే నిందితుడు అని కూడా చెప్పలేం” అన్నారు. అయితే, నేరాల నియంత్రణ ప్రపంచ వ్యాప్తంగా కేసుల పరిష్కారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News