Saturday, September 14, 2024

భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి!

- Advertisement -
- Advertisement -

వాస్తవానికి నిజాం రాజులెప్పుడూ స్వతంత్ర పాలకులుగా ఉండలేదు. వారు బయటి నుండి వచ్చిన వలస పాలకులు కూడా కాదు. అందుకని ‘పరాయి పాలన’ అన్న పదానికి కూడా అవకాశం లేదు. ఈ సువిశాల భారత దేశంలోని ఇతర ప్రాంతాల పాలకులకు లాగానే వారూ ఒక ప్రాంతానికి పాలకులు. మొగల్ సామ్రాజ్య కాలంలో నిజాం పాలకులు వారి సుబేదార్లు (గవర్నర్లు)గా ఉండేవారు. మొగల్ చక్రవర్తే వారిని నియమించేవాడు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత, మొగల్ సామ్రాజ్యం పతనం కావడంతో, నిజాం రాజులు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయారు. ఆ విధంగా 1947 వరకూ బ్రిటిష్ రాణికి విధేయులుగానే ఉన్నారు. 1948లో భారత ప్రభుత్వానికి, నిజాంకు మధ్య జరిగిన ఒప్పందం ద్వారా హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనానికి సంబంధించిన రాజకీయ ప్రక్రియ ఆరంభమైంది.

భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలుపడి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. బిజెపి నుండి అమిత్ షా, కాంగ్రెస్ నుండి సోనియా సెప్టెంబర్ 17న రాష్ట్రానికి రానున్నారు. ఈ రెండు పార్టీల సభలకు దీటుగా బిఆరెస్ కూడా సభ నిర్వహణకు కసరత్తు చేస్తున్నది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆయుధంగా వాడుకోవాలని సదరు పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఉన్న సమస్యలన్నిటినీ పక్కన పెట్టి సెప్టెంబర్ 17 విమోచనా.. విలినమా.. విద్రోహమా.. మరొకటా అని రకరకాల చర్చలు, ఊహాగానాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ గుర్తుకురాని సెప్టెంబర్ 17 భారతీయ జనతా పార్టీకి గత సంవత్సరమే గుర్తొచ్చి, అధికారికంగా విమోచనా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. అధికారం చేపట్టిన ఎనిమిదేళ్ళ తరువాత అకస్మాత్తుగా బిజెపికి ఈ విషయం గుర్తుకు రావడం ఆశ్చర్యకరమే. తెలంగాణ గడ్డను ఏదో ఒక విధంగా కలుషితం చెయ్యాలన్న దుర్బుద్ధి తప్ప ఇందులో మరేమీ లేదు. నిజంగానే గనక ఆసక్తి ఉండి ఉంటే అధికారంలోకి వచ్చిన సంవత్సరమే మొదలు పెట్టాల్సింది కదా.. ఎనిమిదేళ్ళు ఆగాల్సిన అవసరం ఏమిటి? సంపూర్ణ అధికారం చేతిలో ఉండి కూడా ఇన్నేళ్ళు ఆగారంటేనే బిజెపి అసలు రంగు బయటపడుతోంది.

అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా బరి తెగిస్తుందన్నది అనేక సందర్భాల్లో రుజువైన వాస్తవం. సెప్టెంబర్ 17 మాత్రమే దేశానికి చావో రేవో సమస్య అన్నట్లు విమోచనా దినోత్సవం పేరిట తెలంగాణ అలయ్ బలయ్ సంస్కృతిని, గంగా జమునా తహెజీబ్ వారసత్వాన్ని నాశనం చేసి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా పాతాలని బిజెపి ఎత్తుగడ వేసింది. ఒక రాజకీయ పార్టీగా అధికారాన్ని అందుకోవాలన్న ఆశ ఆ పార్టీకి ఉండవచ్చు. అది వారి హక్కు. దానికోసం రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య విధానాలను అనుసరించాలి తప్ప, లేని దేశభక్తి డబ్బా కొట్టుకుంటూ, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి, భావోద్వేగాలను రగిలించి అందలాన్ని అందుకోవాలనుకోవడం దుర్మార్గం. సెప్టెంబర్ 17 విషయంలో కూడా అందరికి లాగానే వారికీ ఒక భిన్నమైన అభిప్రాయం ఉండవచ్చు. దాన్నెవరూ తప్పు పట్టడానికి లేదు. ఎవరి అభిప్రాయం వారిది.. ఎవరి వాదన వారిది. ప్రతిఒక్కరూ తమ అభిప్రాయమే సరైనదని భావిస్తారు. ఆ హక్కు, స్వేచ్ఛ తప్పకుండా వారికి ఉంటుంది.. ఉండాలి కూడా.! అందులో ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఏదో ఒక విధంగా ప్రజల్లో భావోద్రేకాలను రెచ్చగొట్టి తెలంగాణలో కాషాయ పునాదులు పటిష్టం చేసుకోవాలన్న ఆరాటమే ఇందులో కనిపిస్తున్నది. హైదరాబాద్ సంస్థానం విలీన సమయాన ముస్లిం అయినటువంటి నిజాం రాజు పాలకుడుగా ఉన్నాడు కాబట్టి ముస్లిం పాలన’ నుండి విమోచన అన్న అర్ధంలో బిజెపి దీన్ని హిందూ, ముస్లిం సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాలు బలంగా చేస్తున్నది.

ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి ప్రయత్నం ఖచ్చితంగా కులాల మధ్య, మతాలమధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు చర్య మాత్రమే కాదు, చరిత్ర వక్రీకరణ కూడా! ఆనాడు ముస్లిం రాజు పాలకుడుగా ఉండడం అనేది కేవలం యాధృచ్చికమే తప్ప, మరేమీకాదు. ఆమాట కోస్తే, నిజాంకు వ్యతిరేకంగా అనేక మంది ముస్లింలు పోరాడారు. మఖ్దూం మొహియుద్దీన్, షోయబుల్లా ఖాన్, షేక్ బందగీ లాంటి వాళ్ళ వీరోచిత పాత్రను మనం విస్మరించగలమా? మరి వాళ్ళు ముస్లింలు కారా? అంతేకాదు, అనేక మంది దేశ్‌ముఖ్‌లు నిజాం కు మద్దతుగా నిలిచారు. నిజాం నజరానాలకు కక్కుర్తిపడి ‘జీ హుజూర్’ అన్నారు. మరి వాళ్ళు హిందువులు కాదా? అందుకని దీన్ని మత కోణంలో చూడడం దుర్మార్గం. అయితే, నిజాంను ఎవరూ మచ్చలేనివాడు, సుద్దపూస అని అనడంలేదు. కాని అతని పాలన మొత్తాన్నీ రాక్షస పాలనగా చిత్రీకరించే ప్రయత్నం ఖచ్చితంగా దుర్మార్గమే. రజాకార్ల పేరుతో ఆ రోజుల్లో జరిగిన అరాచకాలకు నిజాం ఎంత బాధ్యుడో, అంతకంటే అనేక రెట్లు దేశ్‌ముఖ్ లు, దొరలు, పటేళ్ళే ఎక్కువ బాధ్యులు.వాస్తవానికి నిజాం రాజులెప్పుడూ స్వతంత్ర పాలకులుగా ఉండలేదు.వారు బయటి నుండి వచ్చిన వలస పాలకులు కూడా కాదు.

అందుకని ‘పరాయి పాలన’ అన్న పదానికి కూడా అవకాశం లేదు. ఈ సువిశాల భారత దేశంలోని ఇతర ప్రాంతాల పాలకులకు లాగానే వారూ ఒక ప్రాంతానికి పాలకులు. మొగల్ సామ్రాజ్య కాలంలో నిజాం పాలకులు వారి సుబేదార్లు (గవర్నర్లు)గా ఉండేవారు. మొగల్ చక్రవర్తే వారిని నియమించేవాడు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత, మొగల్ సామ్రాజ్యం పతనం కావడంతో, నిజాం రాజులు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయారు. ఆ విధంగా 1947 వరకూ బ్రిటిష్ రాణికి విధేయులుగానే ఉన్నారు. 1948లో భారత ప్రభుత్వానికి, నిజాంకు మధ్య జరిగిన ఒప్పందం ద్వారా హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనానికి సంబంధించిన రాజకీయ ప్రక్రియ ఆరంభమైంది. ఆ సమయాన రజాకార్లు దీనికి అవరోధాలు కల్పిస్తూ విలీన ప్రక్రియను అడ్డుకోడానికి ప్రయత్నించారు. అయితే పోలీస్ యాక్షన్ ద్వారా రజాకార్ల తిరుగుబాటును అణచివేయడం జరిగింది. ఆ తరువాత 1948 సెప్టెంబర్ 10 న నిజాం నవాబు స్వచ్ఛందంగా ఇండియన్ యూనియన్‌లో విలీనానికి సంసిద్ధత తెలియజేశాడు. సికింద్రాబాద్ మిలిటరీ కంటోన్మెంటును స్వాధీనం చేసుకోడానికి స్వయంగా భారత సైన్యాన్ని ఆహ్వానించాడు.

హైదరాబాద్ సంస్థానం విలీనానికి మార్గం సుగమం చేయడానికే నిజాం భారత ప్రభుత్వ సహాయాన్ని అర్ధించాడు.అందులో భాగంగానే 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యాలు సికింద్రాబాద్ కంటోన్మెంటును ఆక్రమించుకున్నాయి. విషయం ఏమిటంటే, 1947 ఆగస్టు 15న భారత దేశంపై బ్రిటిష్ మూకల అధికారం, ఆధిపత్యం అంతమై, భారత్ సర్వసత్తాక స్వతంత్ర దేశంగా అవతరించింది. బ్రిటిష్ మూకల కబంధ హస్తాల నుండి భారత పౌరులు రాజకీయాధికారాన్ని చేజిక్కించుకున్నారు.
దేశం పరాయి పాలన నుండి స్వపరిపాలనలోకి వచ్చేసింది. ఆ సమయాన దేశంలోని వివిధ సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో విలీనమైనట్లుగానే హైద్రాబాద్ సంస్థానం కూడా ఆ సాధారణ ప్రక్రియలో భాగంగా విలీనం కావలసి ఉండింది. కాని 1947 నుండి 1948 సెప్టెంబర్ వరకు హైదరాబాదులో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా హైదరాబాద్ విలీనం సాధ్యం కాలేదు. కేవలం పది నెలల పాటు మాత్రమే కొనసాగిన ఈ రాజకీయ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ విలీనాన్ని స్వాతంత్య్ర సమరంగానో, విమోచన పోరాటంగానో చూడడం ఎంత మాత్రం సరికాదు. ఎందుకంటే నిజాం సైన్యాలు భారత సైన్యాలను ఎదిరించడంగాని, పోరాడడం కాని చేయలేదు.

భారత సైన్యానికి వ్యతిరేకంగా నిజాం సైన్యం ఒక్క తూటా కూడా పేల్చిన దాఖలా లేదు. నిజాం స్వచ్ఛందంగానే తన సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశాడు. అందుకని మిగిలిన సంస్థానాలను విలీనం చేసిన రాజులు, నవాబులు ఎంతో నిజాం నవాబు కూడా అంతే. ఈ కారణంగానే ఆయా రాజులు, నవాబుల మాదిరిగానే, నిజాం నవాబును కూడా హైదరాబాద్ రాజ్ ప్రముఖ్‌గా నియమించడం జరిగింది. నిజాంకు, భారత ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నిజాం రాజుకు సంవత్సరానికి 50 లక్షల రూపాయల భరణం చెల్లించే విధంగా నిర్ణయం జరిగింది. అంతేకాదు, నిజాం ప్రపంచంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు హైదరాబాదు రాజుగా పూర్వపు బిరుదులన్నీ యథాతథంగా కొనసాగించేందుకు కూడా భారత ప్రభుత్వం సమ్మతించింది. 1950 జనవరి 26 వరకు ప్రభుత్వాధినేతగా హైదరాబాదు రాజ్యపాలన నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదనే కొనసాగింది. ఆయనే ఫర్మానాలు జారీ చేసేవాడు.

1956 అక్టోబరు 31 వరకూ రాజ్యప్రముఖ్‌గా కూడా నిజాం రాజే కొనసాగాడు. ఒకవేళ నిజాం రాజ్యాన్ని, ఆయన సంస్థాన సైన్యాన్ని ఎదిరించి పోరాడి గనక స్వాధీనం చేసుకుని ఉన్నట్లయితే, ఆయనకంతటి రాజమర్యాదలు దక్కేవా? నిజాం ను రాజ్యప్రముఖ్‌గా నియమించడం జరిగేదా? ప్రపంచంలో ఎక్కడ పర్యటించినా హైదరాబాదు రాజుగా గుర్తింపు లభించేదా? ఎట్టి పరిస్థితిలోనూ ఇవేమీ జరిగి ఉండేవి కాదు. పదవీచ్యుతుణ్ణి చేసి, నిర్బంధించి జైల్లో పడేసి ఉండేవారు. కాని అలా జరగలేదు. నిజాం నవాబు తన జీవిత కాలమంతా రాజ్య ప్రముఖ్ గానే రాజభోగాలు అనుభవించాడు. మన ప్రజాస్వామ్య భారతావనిలో భిన్నకులాలు, భిన్నమతాలు, భిన్నవర్గాలు, భిన్నసంస్కృతీ సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా, సామరస్యంగా, పాలూ పంచదారలా కలసిమెలసి సహజీవనం చేస్తున్నారు. ఇటువంటి అహ్లాదకర వాతావరణంలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా రాజకీయ పార్టీలు విజ్ఞతతో, విశాల దృక్పధంతో వ్యవహరించాలి. నిజం చెప్పాలంటే ‘గంగా జమునా తహెజీబ్’ మనది.

హిందూ, ముస్లిం అనే సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తే దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, దేశ లౌకిక వారసత్వానికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది. నిజాం నవాబు స్వచ్ఛందంగానే ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యాడు కనుక 1947 సెప్టెంబర్ 17న నిజాం నుండి హైద్రాబాదుకు విమోచన లభించిందన్న వాదన సత్యదూరం మాత్రమే కాదు, చరిత్రకు వక్రభాష్యం కూడా.. అందుకని సెప్టెంబర్ 17ను రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు జాతీయ సమైక్యతా దినోత్సవంగానో, విలీన దినోత్సవంగానో లేక హైదరాబాద్ రాజ్యం భారత ప్రభుత్వ పాలన కిందికి వచ్చిన రోజుగానో చూడడమే శ్రేయస్కరం. దీనికి ఎలాంటి ప్రత్యేకతలూ ఆపాదించాల్సిన అవసరంలేదు. అలా కాకుండా విమోచన అని, స్వాతంత్య్రం అని లేని పోనివి ప్రచారం చేసి, ప్రజల భావోద్రేకాలను రెచ్చగొడితే మత సామరస్యానికి విఘాతం కలగడమే కాక, ఆగస్టు 15 ప్రాముఖ్యతను తగ్గించడం, స్వాతంత్య్ర స్ఫూర్తిని అవమానించడం కూడా అవుతుంది. అందుకని భారత ప్రజలు ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు బిజెపి, మతోన్మాద, ఫాసిస్టు శక్తుల దుష్ప్రచార వలలో చిక్కకుండా, విజ్ఞతతో వ్యవహరించాలి. దేశ లౌకిక, ప్రజాస్వామ్య వారసత్వ స్ఫూర్తిని కొనసాగించాలి. సామరస్య వాతావరణానికి ఏ మాత్రం హాని కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ, దుష్ట, దుర్మార్గ, మతోన్మాద ఫాసిస్టు శక్తుల బారి నుండి దేశాన్ని రక్షించుకోవాలి. ఇది ప్రస్తుతం భారతీయ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ పౌరుల ముందున్న తక్షణ కర్తవ్యం.

యండి ఉస్మాన్ ఖాన్
9912580645

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News