Tuesday, April 30, 2024

‘జమిలి’ ప్రజాస్వామ్య వ్యతిరేకం

- Advertisement -
- Advertisement -

దేశంలో రెండు జాతీయ పార్టీల కన్నా బలంగా ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వీలైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కలిపి ఒకేసారి నిర్వహించడమే జమిలి ఎన్నికలు. ఇలా చేయడానికి మనకు చాలా అడ్డంకులున్నాయి. ఎందుకంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదాహరణకు తెలంగాణ, చత్తీస్‌గఢ్ సహా 5 రాష్ట్రాలకు ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరగాలి. అదే ఆంధ్రప్రదేశ్‌కి 2024 మే వరకు సమయం ఉంది. మరికొన్ని రాష్ట్రాలకు 2025, ఇంకొన్ని రాష్ట్రాలకు 2026 వరకు కూడా టైవ్‌ు ఉంది. కానీ లోక్‌సభ ఎన్నికలకు ఉన్న సమయం 2024 ఏప్రిల్ వరకే. అంటే ఒకేసారి అన్నింటికీ ఎన్నికలు జరగాలంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఆరు నెలలు ఆలస్యంగా గానీ, 2024, 2025న ముగిసే శాసనసభల పదవీ కాలాన్ని ముందే ముగించడం గానీ చేయాలి.

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. అధికార, ప్రతిపక్ష కూటములు రెండూ సార్వత్రిక సమరానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో బిజెపి మేనిఫెస్టోలో ప్రధాన అంశమైన జమిలి ఎన్నికలకు 2016 నుంచి ప్రధాని మోడీ ప్రతిపాదిస్తున్నప్పటికీ ఎట్టకేలకు కీలక అడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. అమృత్‌కాల్ సమావేశాలంటూ పార్లమెంట్ ప్రత్యేక భేటీకి ముహూర్తం ఫిక్స్ చేసిన తర్వాత వన్ నేషన్ -వన్ ఎలక్షన్‌పై సెప్టెంబర్ 02 శనివారం జమిలి ఎన్నికల కమిటీపై న్యాయశాఖ 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ర్టపతి రావ్‌ునాథ్ కోవింద్‌ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15 వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది.

ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్‌రావ్‌ు మేఘ్ వాల్, కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది. ప్రతి ఐదేళ్లకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ఎన్నికలు నిర్వహించడం మన రాజ్యాంగ విధానం. అలా అని రెండింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనేమీ లేదు. మన రాజ్యాంగంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన లేకపోయినా 1967 వరకు జమిలి ఎన్నికలే జరిగేవి. 1968, 69 ల్లో కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు కూలిపోవడం 1970లో ఏడాదికి ముందే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో అంతవరకు కొనసాగిన ఆనవాయితీకి ఫుల్‌స్టాప్ పడింది. కేంద్రానికి, రాష్ట్రానికి వేర్వేరుగా ఎన్నికలు జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే 1983లో కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఏకకాల ఎన్నికల విధానం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. అయితే అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించగా, 1999లో లా కమిషన్ కూడా జమిలికి జై కొడుతూ ఓ నివేదిక సమర్పించింది. అయితే ఎప్పుడూ చర్చలకే పరిమితమైన జమిలి ఎన్నికల విధానం కేంద్రం తాజా నిర్ణయంతో మళ్ళీ చర్చలోకి వచ్చింది. అయితే ప్రధాని మోడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వన్ నేషన్- వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్నపళంగా ఎన్నికలకు వెళ్లాలన్నా సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్రంతో పాటు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలన్నా రాజ్యాంగ సవరణ చేయాల్సి వుంటుంది. మరీ ముఖ్యంగా మొత్తం ఎన్నికల విధానాన్నే సంస్కరించాల్సి వుంటుంది. వీటిలో ముఖ్యమైనవి ఆర్టికల్ 356: రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉన్నది.

రాష్ర్టంలో రాజ్యాంగబద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే సందర్భంలో చట్టసభ రద్దుకు నిర్ణయిస్తే అది రాజ్యాంగ విరుద్ధమే అనిపించుకొంటుంది. ఆర్టికల్ 172(1): అసెంబ్లీ కాలవ్యవధి ఐదేండ్లుగా కొనసాగుతుంది. అత్యయిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాల వ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు. సభ తొలిసారిగా సమావేశమైన నాటి నుంచి కాల పరిమితి మొదలవుతుంది. ఆర్టికల్ 324: రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి, లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. సమయానుసారం, రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాల వ్యవధిని సహేతుక కారణాలతో సవరించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 83(2): ప్రజా తీర్పుతో కొలువుదీరిన లోక్‌సభ కాలవ్యవధి ఐదేండ్లు. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలులేదు. ఆర్టికల్ 83: పెద్దల సభ కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్ 83 సూచిస్తుంది. దీంతో పాటు రాజ్యాంగంలోని 2, 3 చాప్టర్స్, పార్ట్-15లోని పలు అంశాలను, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను జమిలి బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది.

అయితే రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్ ముందుకు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు తిరస్కరించినప్పటికీ 2014 నుంచీ ఒకే దేశం ఒకే ఎన్నికలంటూ వదలకుండా చెబుతున్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ ప్రతిపాదన ఆలోచన కాదు దేశానికి అవసరమని, ప్రతి నిర్ణయం జాతీయ ప్రయోజనాల లక్ష్యంగా ఉండాలని చెప్పారు. విడివిడిగా ఎన్నికలు జరగటం వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతున్నందున ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్చించాలని కోరారు. చట్ట సభలతో పాటు స్థానిక సంస్ధలకూ ఉపయోగపడే ఒకే ఓటర్ల జాబితా తయారు చేస్తే సమయం, నిధులు ఆదా అవుతాయన్నారు. జనం మీద రాజకీయాలే పైచేయి సాధిస్తే జాతి ప్రతికూల మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. నిజానికి ఇప్పుడు కావాల్సింది ఒకేసారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్ధిల్లే విధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్ధతి ఎన్నికల సంస్కరణలు కావాలి.అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50 రాష్ట్రాల్లో రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలెక్ట్టోరల్ కాలేజీ ప్రతినిధులను మొత్తంగా కేటాయిస్తారు.

మన మాదిరి నియోజకవర్గాల ప్రాతిపదిక విధానంలో డబ్బున్న పార్టీలే ప్రాతినిధ్యం పొందగలుగుతున్నాయి. కొన్ని పార్టీలకు వచ్చిన ఓట్ల మేరకు ప్రాతినిధ్యం ఉండటం లేదు. దామాషా ప్రాతినిధ్య విధానంలో డబ్బుతో ఓట్లు కొన్నప్పటికీ అలాంటివారు ఎన్నికయ్యే అవకాశం ఉండదు కనుక ఎవరూ డబ్బు పెట్టరు, నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడి కావటానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలు, వ్యక్తులు డబ్బున్న వారికే పెద్దపీట వేస్తూ అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు కేటాయించే దామాషా ప్రాతినిధ్యం గురించి ఒక్క వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ మాట్లాడవు. తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగతుందని, ఒకేసారి ఎన్నికలు జరిగితే ఇలాంటి అవకాశం ఉండదనేది కేంద్రంలో బిజెపి వాదన. పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పథకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన పెద్దలు దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం, జనాన్ని తప్పుదారిపట్టించే వ్యవహారమే.ప్రతి దానికీ ప్రజాస్వామ్య జపం చేసే వ్యక్తులు, శక్తులూ అభివృద్ధి, ఖర్చు తగ్గించాలనే పేరుతో ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం కలిగించే ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారు. ఇది ఫెడరల్ సూత్రాలకు, రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్ధం.

ఇది ఏక వ్యక్తి ఆధిపత్యానికి దారి తీస్తుంది. అందువలన ఇది ఇక్కడికే పరిమితం అవుతుందన్న హామీ ఏముంది? అసలు బిజెపి ఈ ప్రతిపాదనను పదే పదే ఎందుకు ముందుకు తెస్తున్నది? పాలకపార్టీ, అధికార యంత్రాంగంలో జరుగుతున్న ఈ చర్చ, కదలికల కారణంగానే అధికారం లో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నాయి. దేశ అభివృద్ధి, ప్రయోజనాల గురించి తమకు తప్ప మరొకరికి పట్టవని, అలాగే దేశభక్తి ఇతరులకు లేనట్లుగా, దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నట్లు గత 9 సంవత్సరాలుగా ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ఏదైనా సరే బిజెపి తలుచుకుంటే లోక్‌సభలో బిల్లు పాస్ అవ్వడం పెద్ద పనేమీ కాదు. కానీ రాజ్యసభ ఆమోదం పొందడమే కష్టం. ఇక విపక్షాలు పాలిస్తున్న రాష్ర్ట ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తాయా లేదా? అన్నదే ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం బిజెపి, కాంగ్రెస్ మాత్రమే జాతీయ స్థాయి పార్టీలుగా ఉన్నాయి. సిపిఐ, సిపియం, బిఎస్‌పి, సమాజ్‌వాది, ఆప్ వంటి జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ అవి ఏవో ఒక రాష్ట్రానికి పరిమితం అవుతున్నాయి. అలాంటి పరిణామం జరిగినా ఆశ్చర్యం లేదు. కాబట్టి జమిలి ఎన్నికల విధానాన్ని అనుసరించడం అంటే ప్రజాస్వామ్య మౌలిక తత్వానికి వ్యతిరేకమే అవుతుంది.

సార్వభౌమాధికారం ప్రజలకు లేకుండా ఎన్నికలను కేవలం ఒక ప్రక్రియలా, తంతులా భావించినట్టు అవుతుంది. ఈ పద్ధతి అనుసరించడం అంటే ప్రజల బాధ్యత కేవలం అయిదేళ్లకు ఒకసారి ఓటు వేయడానికే పరిమితం చేసి ఆ తరవాత ప్రజలకు ఏ పాత్రా లేకుండా చేయడమే అవుతుంది. ఆ తర్వాత వ్యవహారం అంతా కార్యనిర్వాహక వర్గం చేతిలోనే ఉంటుంది. క్రియాశీలంగా ఉండే ప్రజలు అయిదేళ్ల పాటు వేచి ఉండలేరు అని డాక్టర్ రావ్‌ు మనోహర్ లోహియా చెప్పిన మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ప్రజా ఉద్యమాలతో పాటు రాష్ట్రాలలో మామూలు పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్య భావాలు వ్యక్తం చేయడానికి వీలుంటుంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా అవసరం. నిజానికి ఎన్నికల నిర్వహణ అంటే ప్రజల కార్యకలాపాల, అభిప్రాయాల వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వడమే. ప్రజాస్వామ్య మనుగడకు ఇది అవసరం. జమిలి ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తోయడం అంటే జనాభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశం లేకుండా చేయడమే.

నాదెండ్ల శ్రీనివాస్
9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News