Sunday, October 1, 2023

ఆర్‌టిసి విలీనానికి రైట్..రైట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి కార్మికుల కల ఫలించింది. ఆర్టీసి కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు నెల రోజుల తర్వాత గవర్నర్ ఆమోదం తెలపడం విశేషం. తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందినట్లు గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. న్యాయ శాఖ పరిశీలన తర్వాత బిల్లులోని అంశాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు గవర్నర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్టీసి ఉద్యోగులకు, కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా
ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసిలోని 43,373 మంది సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతి కోసం పంపారు. అది సాంకేతికంగా ఆర్థిక బిల్లు కావడంతో రాజ్‌భవన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అలా పంపిన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించలేదు. ఆర్టీసి విలీన బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు. ఆర్టీసి విభజన, కార్మికుల జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, పింఛన్లు వంటి ఐదు ప్రధాన అంశాలపై తమిళిసై సందేహాలు లేవనెత్తారు.

వాటికి సమాధానమిస్తూ సిఎస్ శాంతి కుమారి గవర్నర్‌కు వివరంగా లేఖ రాశారు. సిఎస్ సమాధానాలతో సంతృప్తి చెందని రాజ్‌భవన్ మరో 6 అంశాలను అదనంగా జోడిస్తూ సమాచారం కావాలని కోరింది. అయితే ఈ సారి కేంద్రం వాటా ఆర్టీసిలో 30 శాతం ఉందని పేర్కొనందున విలీనానికి కేంద్రం అనుమతి ఏమైనా తీసుకున్నారా, తీసుకుంటే సంబంధిత కాపీని పంపాలని అడిగారు. అలాగే ఆర్టీసిలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలను గురించి కూడా అడిగారు. భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయడంలో భాగంగానే ఈ ప్రశ్నలను అడిగినట్టు రాజ్‌భవన్ వివరణ ఇచ్చింది.
ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వడంతో…
శాశ్వత ఉద్యోగులు మినహా మిగిలిన వారి విషయంలో చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకున్నారని గవర్నర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేషన్‌కు సంబంధించిన చర, స్థిరాస్తులు అలాగే కొనసాగుతాయా లేదా చెప్పాలని, అవి కొనసాగితే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుందా లేదా అని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే వారిని నియంత్రించే అధికారం ఎవరికీ ఉంటుందని, ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుకున్న తర్వాత వీరంతా కార్పొరేషన్‌లో డిప్యూటేషన్‌పై పని చేస్తారా లేక వేరే ఏర్పాటు ఏమైనా ఉందా ఇలా పలు ప్రశ్నలను ప్రభుత్వానికి గవర్నర్ సంధించారు. ఈ ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వడంతో ఆర్టీసి విలీన బిల్లుపై గవర్నర్ గురువారం ఆమోదముద్ర వేశారు.

సంస్థ నష్టాలను పూడ్చుకుంటూ…
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆర్టీసి సంస్థ నష్టాలను పూడ్చుకుంటూ క్రమంగా లాభాల్లోకి తెచ్చే క్రమంలో కరోనా వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. వేలాదిమంది ఉద్యోగుల జీవితాలతో ముడి పడి ఉన్నందున ఆర్టీసిని ఆదుకోవాలని నిర్ణయించింది. లక్షలాదిమంది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ జనం హృదయాల్లో ఆత్మీయ చిరునామాగా నిలిచిన ఆర్టీసికి ఉద్యోగులకు అండదండలు అందించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఆర్టీసి ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి ప్రభుత్వం వేతనాలు పెంచింది. దీంతోపాటు ఆర్టీసి మనుగడకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం వారికి భరోసా కల్పించింది.
గవర్నర్‌కు రుణపడి ఉంటాం: అశ్వథామ రెడ్డి
ఆర్టీసి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఆర్టీసి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు రాజకీయంగా కొన్ని విమర్శలు రావడం సహజమని ఆర్టీసి జేఏసి చైర్మన్ అశ్వథామ రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్‌కు సదా రుణపడి ఉంటారని అశ్వథామరెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News