Monday, April 29, 2024

‘ఇండియా’ కూటమిపై ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదు : ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం , ఎట్టిపరిస్థితుల్లోనూ ఇండియా కూటమిపై ప్రభావం చూపబోదని విపక్షాలు సోమవారం పేర్కొన్నాయి. అయితే వచ్చే సంవత్సరం జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం విపక్షాలు గట్టిగా పనిచేయవలసి ఉంటుందని స్పష్టం చేశాయి. పార్లమెంట్ లోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో సోమవారం ఉదయం ఇండియా కూటమి సమావేశం జరిగింది. విపక్షనేతలంతా సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) నేత ఫరూక్ అబ్దుల్లా ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ దీనివల్ల ఇండియా కూటమిలో ఎలాంటి బేధం ఏర్పడదని, తామంతా గట్టిగా పనిచేయవలసి ఉందని అభిప్రాయపడ్డారు. “విజయాలు, పరాజయాలు సంభవిస్తుంటాయి. ఓటమి నుంచి , అలాగే గెలిచే వారి నుంచి నేర్చుకోవాలని, దేశాన్ని పటిష్టపర్చవలసిన అవసరం ఉంది.

” అని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల పోటీకి అభ్యర్థులను ప్రకటించినప్పుడు సమాజ్‌వాది పార్టీకి కాంగ్రెస్ ఎలాంటి సర్దుబాటు కల్పించలేదని, ఆ ప్రభావం ఫలితాల్లో కనిపించిందన్న వ్యాఖ్యకు సమాధానంగా అంతా సర్దుకుంటుందని చెప్పారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత మనోజ్ ఝా కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూటమిపై ఎలాంటి ప్రభావం చూపించవని అన్నారు. “ సార్వత్రిక ఎన్నికలు అనేక విభిన్న అంశాల ఆధారంగా జరుగుతాయి. ఇండియా కూటమి లక్షాన్ని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలి. ఇందులో వివాదం ఏదీ లేదు. ” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి ఏ పొరపాటు జరిగిందో తమ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుంటుందని వివరించారు. ఎన్నికల ప్రభావం కూటమిపై పడకుండా జాగ్రత్త పడతామన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూటమి భాగస్వామిగా సమాజ్‌వాది పార్టీ పాలుపంచుకోలేదని ప్రశ్నించగా, ఈమేరకు అవసరమైన దిద్దుబాటు చేస్తామన్నారు.

లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఎంపీ చిరాగ్ పాశ్వాన్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైఖరిపై ధ్వజమెత్తారు. బీహార్‌లో కులగణన చేపట్టడం ఇండియా కూటమికి నితీశ్ తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలపైన, మాజీ బీహార్ సిఎం జితన్ రామ్ మాంఝీకి వ్యతిరేకంగా నితీశ్ వ్యాఖ్యలు చేయడం కూటమికి నష్టం కలిగిస్తుందని ఆరోపించారు. బీహార్‌లో కులగణన సర్వేవల్ల వ్యత్యాసాలు పెరుగుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారని, ఇది కూడా కూటమికి నష్టం కలిగిస్తుందని ఎంపీ చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News