Friday, March 1, 2024

తమిళనాడు, కోస్తాంధ్రకు పెను ముప్పు

- Advertisement -
- Advertisement -

చెన్నై : సైక్లోన్ మిచాంగ్ తమిళనాడును తలడిల్లేలా చేసింది. కోస్తాంధ్రను కాటేసేలా మారింది. చెన్నైలో అర్థరాత్రి దాటిన నాటి నుంచి తుపాన్ కారణంతో భీకర గాలులు, కుండపోత వర్షాలతో పరిస్థితి దిగజారింది. పక్కనే ఉన్న సముద్రం చెన్నైకి వచ్చి చేరిందా? అనే వాతావరణం ఏర్పడింది. భారీ వర్ష సంబంధిత దుర్ఘటనలతో నగరంలో పలు చోట్ల కనీసం ఏడుగురు మృతి చెందారు. కొందరు గాయపడ్డారు. పలు ప్రాంతాలలో భారీ వర్షాలతో వీధులు జలమయం అయ్యాయి. ప్రత్యేకించి చెన్నై ఎయిర్‌పోర్టు ఈ భారీ వర్షాలు తరువాతి వరదలతో నీట మునిగింది. పలు విమానాల రాకపోకలను ఈ ఎయిర్‌పోర్టు నుంచి నిలిపివేశారు. రన్‌వే పూర్తిగా మునిగిపోయింది. దీనితో చెన్నైకు వచ్చే పలు విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లించారు. విమానాల రాకపోకల గురించి విమానయాన సంస్థలు ఏ విధమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు చిక్కుల్లో పడ్డారు. సైక్లోన్ మిచౌంగ్ ఇప్పుడు తీవ్రస్థాయి తుపాన్‌గా పరివర్తనం చెందిందని వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది. సముద్రంలో ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటల వరకూ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం కూడా రెండు మూడు గంటల పాటు విమానాలను నిలిపివేశారు. ఎయిర్‌పోర్టులో ఇతర చోట్ల ఉధృత స్థాయి వరదలతో పలు కార్లు కొట్టుకుపొయ్యాయి. సైక్లోన్ ఇప్పుడు ఉధృత రూపం దాల్చింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరువలోకి చేరుతున్న కొద్దీ దీని ప్రభావంతో భారీ వర్షాలు జోరందుకున్నాయి. చిత్తూరు, తిరుపతి ఇతరత్రా ఆంధ్రప్రదేశ్ పట్టణాలలో భారీ వర్షాలు పడుతూ వస్తున్నాయి. తిరుపతికి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు చాలా మంది గందరగోళానికి గురయ్యారని వెల్లడైంది. విమానాలను చెన్నై నుంచి వేరే ప్రాంతాలకు తరలించారు. చెన్నై మహానగరం ఎప్పుడూ తుపాన్లు, భారీ వర్షాలు వరదలతో అతలాకుతలం అవుతూ రావడం కీలక పరిణామం అవుతోంది. నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై సంచరిస్తున్న ఓ మొసలిని స్థానికులు గమనించారు. మెట్రో స్టేషన్ల వద్ద నీరు నిలిచిపోయింది. దీనితో జనం అడుగుతీసి అడుగు వేయలేకపోయింది.

మెట్రోస్టేషన్ల వద్ద నీటి మడుగులు
సెయింట్ థామస్ మెట్రో స్టేషన్ వద్ద దాదాపు 4 అడుగుల మేర నీరు నిలిచింది. దీనితో ప్రయాణికులు స్టేషన్‌లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. లోపలికి వెళ్లి తమ మజిలీకి చేరుకోవాలంటే తాము పడవలు ఎక్కాల్సిన స్థితి ఏర్పడిందని ఓ ప్రయాణికుడు వాపొయ్యారు. పలు ప్రాంతాలలో ఇళ్లు కూలడం, కొట్టుకుపోవడం వంటి ఘటనల్లో ఏడుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. వైద్యనాథన్ ఫ్లైఓవర్ వద్ద ఓ 70 సంవత్సరాల ముదుసలి చనిపోయి ఉండగా గుర్తించారు. ఫోర్‌షోర్ ఎస్టేట్ బసు డిపో వద్ద మరో వృద్ధుడి మృతదేహాన్ని కనుగొన్నారు. ఓ ప్రాంతంలో మరో వ్యక్తి విద్యుత్‌ఘాతానికి గురై చనిపోగా, మరో చోట కూడా ఇదే దుర్ఘటనచోటుచేసుకుంది. 30 ఏండ్ల మురుగన్ చెట్టు విరిగి మీద పడిన ఘటనలో అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు గుర్తించారు.

వీధులలో జల ప్రళయానికి గురై చనిపోయిన వారిలో ఎక్కువ మంది జార్ఖండ్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూలీ పనిచేసుకుని బతికే వారే ఉన్నట్లు వెల్లడైంది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగళాఖాతంలో తీవ్ర స్థాయి తుపాన్ కేంద్రీకృతం అయింది. ఇది తీరం దాటితే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న పలు ఎపి జిల్లాల్లో దీని ప్రభావంతో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎపి ప్రభుత్వం పలు జాగ్రత్త చర్యలు తీసుకుంది. తుపాన్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని నెల్లూరు, మచిలీపట్టణం నుంచి బాపట్ల మధ్యలో మంగళవారం తాకవచ్చునని వాతావరణ శాఖ విశ్లేషించింది. తమిళనాడులో ప్రభుత్వం సోమవారం, మంగళవారం పలు చోట్ల స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రైవేట్ ఉద్యోగులు, ప్రత్యేకించి ఐటి వృత్తిదారులు ఇంటి నుంచి పనికి పరిమితం కావల్సి ఉంటుందని తెలిపారు. ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు చివరికి జార్ఖండ్, తెలంగాణ వరకూ తుపాన్ ప్రభావం పడింది. దీనితో ఆయా రాష్ట్రాలు పలు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి.

కోస్తాంధ్రకు భారీ ముప్పు?
తిరుపతిలో భారీ వర్షాలతో విలవిల
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెనుతుపాన్ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌గా మారింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఇది ప్రయాణిస్తోంది. ఈ ప్రాంతంలో తీరాన్ని దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే వరకూ ఇది కోస్తాంధ్రకు సమాంతరంగా సాగుతుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వేలాదిగా యాత్రికులు తరలివచ్చే తిరుపతిలో 30 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతికి చేరాల్సిన పలు విమానాలను బెంగళూరుకు, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పలు రైళ్లు రద్దు అయ్యాయి.

మిగ్‌జాం తుపాన్ పరిస్థితిపై చెన్నైవాసి నెట్ స్పందన

ఎయిర్‌పోర్టుకు చేరిన సముద్రమా
చెన్నై మహానగరంలో పరిస్థితి దిగజారింది. భారీ వర్షాలతో ఇప్పుడు చెన్నై విమానాశ్రయం నీట మునిగింది. విమానం రెక్కలు కన్పించడం ద్వారానే దీనిని విమానాశ్రయం అనుకునే పరిస్థితి ఏర్పడింది. సముద్రం ఈ ఎయిర్‌పోర్టును కబ్జా చేసుకున్నట్లు ఉంది. ప్రయాణికుల పరిస్థితి దయనీయం అయితే, ఇక్కడ అతి తక్కువ వేతనాలకు పనిచేసే రోజువారి కూలీల పరిస్థితి మరీ దారుణం అయింది. వారు అత్యంత ప్రతికూల స్థితిలో పని చేయాల్సి వస్తోంది.
చెన్నై క్షేమంగా ఉండాలి
సైక్లోన్ మిచాంగ్‌తో తలెత్తిన భయానక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నాం. చెన్నై నగరం అతలాకుతలం అయింది. నీట దిగ్బంధం చెందిన నగర వాసుల క్షేమం భద్రత కోసం పరితపిస్తున్నాను. చెన్నై ధైర్యంగా ఉండూ . మేమంతా మీ వెంటే ఉంటాం
ఇది కల్వకుంట్ల కవిత భావోద్వేగం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News