Friday, April 19, 2024

నా మనుషులను కాదు..నన్ను సస్పెండ్ చేయండి: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

దమ్మపేటః నా మనుషులను కాదు.. నన్ను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని నెమలిపేట గ్రౌండ్లో జరిగిన పొంగులేటి శీనన్న ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు, గిరిజనులకు, ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న గిరిజనేతరులకు ఇల్లు లేని వారికి ఎలాంటి లాభం చేకూరలేదని, అక్కడక్కడ పది, పదిహేను ఇళ్ళు కట్టి భూతద్దంలో చూపిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

పోడు భూములకు, ఏజెన్సీలోని గిరిజనేతరులకు భూములకు పట్టాలిస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఊసే ఎత్తకపోవడం బాధాకరం అన్నారు. కనీసం గ్రామపంచాయితీలకు నిధులు ఏర్పాటు చేయకపోవడం, పెండింగ్ బిల్లులను విడుదల చేయకపోగా, మళ్ళీ ఒక్కో గ్రామపంచాయితీకి పది లక్షలు, మున్సిపాలిటికి రూ. 30 లక్షలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. సర్పంచ్‌లు తమ భార్యల మెడలో బంగారాన్ని తాకట్టు పెట్టి పంచాయితీలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
వైరాలో తన మనుషులను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సంతోషకరం..
ఆదివారం వైరాలో 8 మంది ప్రజాప్రతినిధులను, తన అభిమానులను బీఆర్‌ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం సంతోషకరమని, సస్పెండ్ చేయాల్సింది కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కాదనీ, దమ్ముంటే తనను బీఆర్‌ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పొంగులేటి వ్యాఖ్యానించారు.
పార్టీ మారడం ఖాయం.. కానీ తొందర నిర్ణయం తీసుకోను….
పార్టీ మారడంపై పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం ఖాయమని.. కానీ తొందర నిర్ణయాలు తీసుకోనని తెలిపారు. తన కార్యకర్తల మెజారిటి నిర్ణయం ప్రకారమే తాను నిర్ణయం తీసుకుంటానని.. కొన్ని పత్రికలు, టీవీ ఛానెళ్ళలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పార్టీలోకి.. ఈ తేదీన వెళ్తున్నారు.. ఆ పార్టీలోకి, ఆ తేదీన వెళ్తున్నారని వస్తున్న వార్తలు సంతోషకరమే కానీ, తన అభిమానులు ప్రకటించిన పార్టీనే, తేదీ నాడే తాను నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక…
దమ్మపేట ఆత్మీయ సమ్మేళనంలో పలు ప్రభుత్వ అధికారులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ నాయకులు చెప్పే మాటలు విని, తనను అభిమానించే నాయకులను ఇబ్బందికి గురిచేస్తే తనకు సమయం వచ్చిన నాడు వడ్డీ, చక్రపు వడ్డీతో పాటు తిరిగి చెల్లిస్తానని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News