పాట్నా: ఎస్‌సి/ఎస్‌టి అట్రాసిటీ యాక్ట్ తరహాలో బీహార్‌లో ఇబిసిల రక్షణకు చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ అతి పిచ్‌డా న్యాయ్ సంకల్ప్ సదస్సులో మాట్లాడారు. బీహార్‌లో అత్యధిక సంఖ్యలో ఉన్న అత్యంత నిరుపేద వెనుకబడిన తరగతుల హక్కులు, ప్రయోజనాల అవసరం ఎంతైనా ఉంది. వారిపై దాడుల నిరోధానికి సమగ్ర చట్టం కట్టుదిట్టమైన రూపంతో ఖరారు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ విధమైన చట్టం తీసుకురావడం జరుగుతుందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ వాగ్దానం చేశారు. ఈ సదస్సులో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. నిరుపేద బిసిల సంక్షేమానికి ఈ సందర్భంగా రాహుల్ పది సంకల్పాలతో కూడిన కార్యాచరణను కూడా ప్రకటించారు. బీహార్ జనాభాలో ఇబిసిల సంఖ్య 36 శాతం వరకూ ఉంటుంది.
ఇక్కడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం తరువాత ఈ ఇబిపిల సదస్సు నిర్వహించారు. ఇబిసిలపై అత్యాచారాల నిరోధక చట్టం, స్థానిక సంస్థలు, పంచాయతీ సంస్థలలో ఇప్పుడున్న 20 శాతం సీట్ల కోటాను గణనీయంగా పెంచడం వంటి వాగ్దానాలను కూడా రాహుల్ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రభుత్వ పనుల కాంట్రాక్టులలో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, ఇబిసిలకు మొత్తం 50 శాతం కోటాతో పనుల అప్పగింతలు కూడా జరుగుతాయని వెల్లడించారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రూ 25 కోట్ల పనుల ప్రాజెక్టుల వరకూ ఆయా వర్గాలకు అప్పగించే ఆలోచన ఉందని రాహుల్ వెల్లడించారు.