Sunday, September 21, 2025

అక్కడి జంగ్ సైరన్ ఇక్కడా మోగుతుందా?

- Advertisement -
- Advertisement -

లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడంకోసం దేశంలోని విద్యార్థులు, యువజనులు, జెన్ జెడ్ పౌరులు సంసిద్ధులు కావాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ఓటు చోరీని అడ్డుకోవడానికి ముందుకొచ్చి ఈ వర్గాలు చేసే పోరాటానికి తాను సర్వదా అండగా నిలబడతానని తాజాగా గురువారం నాడు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మీద పెద్ద దుమారమే చెలరేగుతున్నది. ఇవాళ భారతదేశం లోపలా వెలుపలా జెన్ జెడ్ అనే మాట వింటేనే చాలామంది కంపరం ఎత్తిపోతున్నారు. వారికి భోజనం సహించడం లేదు. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. దీనికి కారణం తాజాగా పొరుగు దేశం నేపాల్‌లో జెన్ జెడ్ పౌరులు జరిపిన ఆందోళన లేదా ఉద్యమం, ఆ ఉద్యమం కారణంగా అక్కడి ప్రభుత్వం కుప్ప కూలడం.

అసలు జెన్ జెడ్ అంటే ఏమిటి? 1997 2010 సంవత్సరాల మధ్య పుట్టినవారిని జెన్ జెడ్ అని సంబోధిస్తారు. అదంతా యువతరం. ఈ తరం వాళ్లంతా అపారమైన సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మాధ్యమాలతో పరిచయం కలిగి ఉంటారు. ఈ వయసువారికి ఆ కారణంచేత ప్రపంచ జ్ఞానం చాల ఎక్కువ ఉంటుంది. భూగోళంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల మీద వారి దృష్టిలో పడుతుంది. సాధారణంగా పౌరులకు ఇటువంటి ఎరుక ఉండడం ఏలికలకు నచ్చదు. జ్ఞానం ఎక్కువైన కొద్దీ ప్రశ్నించే తత్వం అలవడుతుంది. దానితోపాటు ధిక్కారస్వరం కూడా బలపడుతుంది. కాబట్టి ఈ జెన్ జెడ్ అంటే పాలకవర్గాలకు కంపరం.
రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ స్వతంత్రం వచ్చిన నాటినుండి భారతదేశంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయనను కూడా పాలకవర్గం ప్రతినిధి లెక్కలో వేసుకోవాల్సిందే. అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు జెన్ జెడ్ వర్గంలోని పౌరులకు ఈ పిలుపు ఇవ్వడానికి కారణం ఏమిటి? తన పార్టీని లేదా తన పార్టీ నేతృత్వం వహిస్తున్న కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో బయటపడుతున్న అరాచక స్థితి, ముఖ్యంగా దేశ ప్రజాస్వామ్యానికి మూలమయిన ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు, రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోవడం కారణం.

రాహుల్ గాంధీ ఈ పిలుపు ఇచ్చిన వెంటనే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ‘రాజ్యాంగ సంస్థలపై రాహుల్ కు విశ్వాసం లేదు’ అనేశారు. ఏ రాజ్యాంగ సంస్థల గురించి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతున్నారంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని దృష్టిలో పెట్టుకొనే. రాహుల్ గాంధీ జెన్ జెడ్ పౌరులను ఉద్యమోన్ముఖులు కండి అని పిలుపు ఇచ్చింది కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న లేదా ఆ సంఘం నిర్వ్యాపకత్వం కారణంగా జరుగుతున్న ఓటు చోరీకి వ్యతిరేకంగా. రాహుల్ గాంధీ కొంతకాలంగా భారతదేశ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకల గురించి మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన అనేక దృష్టాంతాలను బయటపెడుతున్నారు.

‘ప్రతిపక్ష నాయకుడిగా నేను నూటికి నూరు శాతం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయను, నా ఆరోపణలను నిరూపిస్తాను’ అని చెప్తున్నారు. తాజాగా ఆయన కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గం, మహారాష్ట్రలోని రాజురా నియోజకవర్గంలో ఓట్ల నమోదు విషయంలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడారు. వాటికి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఫేక్ మొబైల్, ఫేక్ లాగిన్లతో ఓట్ల రద్దు జరుగుతున్నదని, సాప్ట్ వేర్ ద్వారా కేంద్రీకృతంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కర్ణాటక రాష్ట్రంలో సిఐడి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంపట్ల ఆయన ఫిర్యాదు చేశారు. ఇన్ని జరుగుతూ ఉంటే పారదర్శకంగా ఉండాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం పత్రికా గోష్టులు నిర్వహించి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా మొక్కుబడి సమాధానాలు ఇచ్చి తప్పించుకుంటున్నదే తప్ప తన పారదర్శకతను నిరూపించుకోవడానికి, రాజ్యాంగబద్ధమైన సంస్థ స్వతంత్రతను కాపాడుతున్నామని ప్రజలలో విశ్వాసం కలిగించడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం విచారకరం.

రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఇంత అప్రతిష్ఠపాలు కావడానికి, ప్రజల దృష్టిలో పలుచన కావడానికి కారణమేమిటో 30 ఏళ్ల క్రితమే ఈ వ్యవస్థకు నేతృత్వం వహించిన టీఎన్ శేషన్ చెప్పారు. ఆయన 1990 నుంచి 1996 వరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా పనిచేశారు. ఈ దేశంలో ఎన్నికల సంఘం అనే వ్యవస్థ ఒకటి ఉన్నదని, అది పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ అని జనానికి తెలిసి వచ్చింది ఆయన కాలంలోనే. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా’ అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. ఈ వ్యవస్థ భారత ప్రభుత్వంలో భాగం కాదు, భారతదేశానికి సంబంధించినది కాబట్టి ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ అని మాత్రమే అనాలని ఆయన ప్రకటించారు. స్వతంత్ర ఎన్నికల సంఘాలు లేని కారణంగా ప్రజాస్వామ్యాలకు ఎంత హాని జరుగుతున్నదో ఆయన ఆనాడే చెప్పారు. ఎన్నికలనేవి ఒక ప్రహసనంగా, తమాషాగా, రౌడీయిజానికి నిలయాలుగా తయారయ్యాయని ఆయన మీడియా సంస్థలకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

భారతదేశంలో జరుగుతున్న అవినీతిలో ఎన్నికలకు సంబంధించిన అవినీతే అధిక భాగమని అన్నారాయన. ఎన్నికలలో మూడు ‘సి’ లు ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నాయని, ఒకటి క్యాష్.. రెండు క్రిమినాలిటీ.. మూడు కరప్షన్ అంటే నగదు, నేర ప్రవృత్తి, లంచాలు. రాహుల్ గాంధీ రాజకీయాల్లో ఇంకా ఓనమాలు కూడా నేర్చుకోనినాడే ఈ విషయాన్ని శేషన్ చెప్పారు. భ్రష్టు పట్టిపోతున్న ఎన్నికల వ్యవస్థలో మరో కోణాన్ని రాహుల్ గాంధీ బయటపెట్టి జెన్ జెడ్ పౌరులను ఈ ఉద్యమంలోకి ఆహ్వానిస్తున్నారు. ఇది ఇప్పుడే కొత్తగా జరుగుతున్నదేం కాదు.
ఇటీవల నేపాల్‌లో జరిగిన సంఘటనల నేపథ్యంలో మహారాష్ట్ర శివసేన నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానిస్తూ ఇవాళ నేపాల్ లో జరిగినది రేపు ఏ దేశంలోనైనా జరగవచ్చు అన్నారు. వెంటనే ఆయన యువతను రెచ్చగొడుతున్నారనో, మరో కారణంతోనో ఆయన మీద కేసు కూడా పెట్టినట్టు ఉన్నారు. గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాలలో ఒక వార్త చక్కర్లు కొడుతున్నది. అదేమిటంటే, ఒక రాష్ట్ర మంత్రి కుమారుడు ఏదో ఒక బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో తీసుకున్న రుణం ఎగ్గొట్టడానికి తన కారును నీటిలోకి తోసేసి, తానూ మరణించినట్టు సృష్టించి మహారాష్ట్రకు వెళ్లి దాక్కున్నాడని. పోలీసుల దర్యాప్తులో ఇదంతా బయటపడి ఆ మంత్రి కుమారుణ్ని పట్టుకొని, ఇటువంటి నేరానికి కేసు పెట్టడానికి సెక్షన్లేవి లేని కారణంగా అతడిని తీసుకుపోయి తల్లిదండ్రులకు అప్పగించినట్టు వార్తలు వచ్చాయి. రాజకీయ ప్రముఖుడి కుమారుడు కాబట్టి వదిలేశారనే అపవాదు మూటగట్టుకున్నారు పోలీసులు.

రాజకీయ నాయకులు, వారి కుమారులు చేసే ఇటువంటి నిర్వాకాల కారణంగానే యువత నేపాల్ లో వీధుల్లోకి వచ్చి ఉద్యమం చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోసింది. తమ ఆందోళనలో హింస కూడా చెలరేగి కొంత విధ్వంసం జరగడంతో మళ్లీ అదే యువత ధ్వంసం అయిన ప్రాంతాలలో స్వయంగా మరమ్మతులు చేపట్టినట్టు కూడా వార్తలు చదివాం. నేపాల్‌లో జెన్ జెడ్ ఉద్యమం హింస ఉద్దేశంగా ప్రారంభం కాలేదు. సరే, ఏ ఉద్యమమైనా ఒక దశలో సరైన మార్గదర్శకం లేకపోతే పెడదారి పట్టి విపరిణామాలకు దారితీయడం మామూలే. అదే నేపాల్‌లో జరిగింది. అక్కడ అధికారంలో ఉన్నవారు వారి సంతానం, సన్నిహితులు పెద్దయెత్తున అవినీతికి పాల్పడుతుంటే దానిని సామాజిక మాధ్యమాలు బయటపెడుతున్నాయన్న దుగ్ధతో ప్రభుత్వం వాటిని నిషేధిస్తే వీధుల్లోకి వచ్చిన జెన్ జెడ్ ఉద్యమించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరింప చేయడమే కాకుండా అవినీతి పాలకులకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగించి వారిని గద్దె దింపింది. నేపాల్ చిన్న దేశం. అక్కడ జరిగిన విధంగానే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో కూడా జరుగుతుందనుకోవడం పొరపాటు. అయితే ఆనాడే టిఎన్ శేషన్ చెప్పినట్టు అవినీతి ఊడల మర్రిలా విస్తరించిన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ కూడా అందులో కూరుకుపోవడం వల్ల, తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు జెన్ జెడ్ పరిధిలోకి వచ్చే యువ పౌరుల ఆగ్రహానికి గురి కావలసి రావచ్చు. అది జరగకుండా చూడటానికి దేశంలో రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తికి అడ్డురాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాజకీయ వ్యవస్థది. జెన్ జెడ్ అసాంఘిక శక్తి కాదు.. ఏ దేశంలో అయినా దానిదే భవిష్యత్తు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News