Saturday, October 5, 2024

బ్యాట్ పట్టుకోవడం రాదు కాని… రాజకీయ నేతలపై రాహుల్ విసుర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బ్యాట్ పట్టుకోవడం రాదు కాని అసోసియేషన్‌ను మాత్రం పట్టుకుని కూర్చున్నారు అని క్రీడా సంఘాలలో రాజకీయ నాయకుల ఆధిపత్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులకు బదులుగా క్రీడాకారులే వివిధ క్రీడా సంస్థలకు నాయకత్వం వహించే వ్యవస్థ రావాలని, అప్పుడే క్రీడలలో భారత్ తన సత్తాను చాటగలదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అభిప్రాయపడ్డారు. భారత్‌లో నేడు డబ్బుంటే కాని ఆట లేదన్న పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు. హర్యానాతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల బృందంతో సమావేశమై వారి సమస్యలు విన్నానని ఎక్స్ వేదికగా బుధవారం ఆయన ఒక పోస్టు పెట్టారు.

హర్యానాకు చెందిన క్రీడాకారులతో తాను జరిపిన సంభాషణకు సంబంధించిన ఏడు నిమిషాల వీడియోను కూడా రాహుల్ షేర్ చేశారు. క్రీడాకారులను నేరుగా బలపరిచి రాజకీయ నాయకులుగా బదులుగా క్రీడాకారులే క్రీడా సంఘాలకు ఇన్‌చార్జులుగా వ్యవహరించే వ్యవస్థ రానంతవరకు భారత్ తన పూర్తి సత్తాను చాటలేదని ఆయన వ్యాఖ్యాఖ్యానించారు. భారత్‌లో అపారమైన ప్రతిభ ఉందని, కాని ప్రతి క్రీడాకారుడికి సమానంగా ప్రయోజనాలు చేకూర్చగల పారదర్శకత, నిజాయితీ, లభ్యత కొరవడ్డాయని ఆయన తెలిపారు. క్రికెట్, జూడోతోసహా వివిధ క్రీడా సంఘాలకు రాజకీయ నాయకులు సారథ్యం వహించడంపై ఆయన అభ్యంతరం తెలియచేశారు. బ్యాట్ పట్టుకోవడం రాదు కాని సంఘాన్ని మాత్రం పట్టుకుంటారు అంటూ ఆయన రాజకీయ నాయకలపై చెణుకులు విసిరారు. రాజకీయ నాయకులకు బదులుగా క్రీడాకారులే క్రీడా సంఘాలకు సారథ్యం వహించడం వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందా అని రాహుల్ ప్రశ్నించగా వస్తుందంటూ క్రీడాకారులు ముక్తకంఠంతో చెప్పడం వీడియోలో కనిపించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News