Friday, April 26, 2024

2022 నాటికి సిరిసిల్లలో రైలు కూత

- Advertisement -
- Advertisement -

Railway facility

 

సిరిసిల్ల : సిరిసిల్లకు రైల్వేలైన్ రాకతో జిల్లా ముఖచిత్రం సమూలంగా మారనుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామంలో ఉన్న అతిథి గృహంలో నిర్వహించిన నియోజక వర్గ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే సౌకర్యంతో సిరిసిల్ల జిల్లా ముఖచిత్రం మారడమే కాకుండా జిల్లా అభివృధ్ధిలో రైల్వే కీలకంగా నిలవనుందని ఆయన అన్నారు.

జిల్లాలో రైల్వేలైన్ కోసం అవసరమున్న 845 ఎకరాల భూ సేకరణను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని మే నెలాఖరు నాటికి వంద శాతం భూ సేకరణ పూర్తి చేసి రైల్వేలైన్ నిర్మాణం చేపట్టేందుకు వీలుగా రైల్వే అధికారులకు అప్పగించాలన్నారు. చట్టపరమైన చిక్కులు రాకుండా భూ సేకరణను అత్యంత పకడ్భంధీగా సేకరించాలన్నారు.

రైల్వేలైన్ అలైన్‌మెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి ఇబ్బంధులు తలెత్తకుండా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. తంగళ్లపల్లి రైల్వేస్టేషన్ కార్గో మూమెంట్, అక్వాహబ్‌లతో అనుసంధానించాలన్నారు. రైల్వే అలైన్‌మెంట్‌లో యుటిలిటి షిప్టింగ్‌లను సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ధవళేశ్వరం మాదిరిగా మధ్యమానేరు జలాశయం బ్యాక్‌వాటర్‌పై రోడ్డు కమ్ రైల్వేబ్రిడ్జి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు.

అలాగే రోడ్డు కం రైల్వే బ్రిడ్జి రింగ్‌రోడ్‌షో రింగ్ రోడ్‌తో అనుసంధానం చేయాలన్నారు. భూ సేకరణ పనులు త్వరిత గతిన పూర్తి చేసి రైల్వే అధికారులకు అందజేస్తే 2022 కల్లా సిరిసిల్ల జిల్లా ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. సిరిసిల్ల జిల్లాకు రైలు మార్గం అందుబాటులోకి వస్తే సిరిసిల్ల ప్రాంతం అన్ని విధాలుగా అభివృధ్ధి చెందుతుందన్నారు. ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో ఎక్కడికైనా తరలించి విక్రయించుకోవచ్చన్నారు. ప్రజలు తక్కువ చార్జీలతోనే దేశంలో ఎక్కడికైనా ప్రయాణించే వీలు కలుగుతుందన్నారు.

ఎగువమానేరు జలాశయం పర్యాటక కేంద్రంగా అభివృధ్ధి
మానేరు వాగుపై ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు జలాశయం పర్యాటక అభివృధ్ధికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ నుండి గంటన్నరలో నర్మాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు పర్యాటక అభివృధ్ధికి ప్రణాళికలు వేయాలన్నారు. కాటేజీల నిర్మాణానికి, బోటింగ్, జల క్రీడలు తదితర అభివృధ్ధి పనులకోసం ప్రణాళికలో పెద్దపీట వేయాలన్నారు. నర్మాల జలాశయం అతిథి గృహాన్ని రెండు కోట్ల రూపాయలతో ఆధునీకరించాలన్నారు. అతిథి గృహంలోపల ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దాలన్నారు. నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన పనులను ప్రారంభించాల్సి ఉందన్నారు. మరో పది రోజుల్లో మళ్లీ నర్మాలకు వస్తానని, అప్పటికల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన, అతిథి గృహం ఆధునీకరణ పనులు, పర్యాటక అభివృధ్ధి పనులకు శంఖుస్థాపన చేస్తానన్నారు. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

Railway facility in Sirisilla by 2022
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News