Monday, April 29, 2024

మతం ఊతకర్రతో ‘దేశభక్తి’

- Advertisement -
- Advertisement -

12 మే 1940లో పశ్చిమ బెంగాల్, ఝర్ గ్రాంలో జరిగిన బహిరంగ సభలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఈ దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటల్ని మనం ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తు చేసుకోవాల్సి వుంది.“హిందూ మహాసభ తమ సన్యాసులను, సన్యాసినులను తెచ్చి, పెద్ద ఎత్తున రాజకీయాల్లో ప్రవేశపెట్టింది. వారు ఓట్లు అడుగుతూ తిరుగుతున్నారు. వారు కనబడగానే హిందువులంతా ఒక పవిత్ర భావనకులోనై, శిరసు వంచి నిలబడుతున్నారు. అది హిందూ మహా సభ వారికి బాగా ఉపయోగపడుతూ వుంది.

హిందువులంతా ఈ విషయాన్ని ఖండించాలి. ఆధ్యాత్మిక వాదులకు రాజకీయాలతోనూ, ఓట్లతోనూ పనేమిటి? మత విశ్వాసాలు తెచ్చి రాజకీయాలకు పులమడం వల్ల, ఇప్పుడే కాదు, రాబోయే కాలాలలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. ప్రజలందరూ దీన్ని గుర్తించాలి. అప్రమత్తంగా వుండాలి. ఏ మతమైనా సరే, దాని పరిధిలో దాన్ని వుండనివ్వాలి. అతిక్రమిస్తే మాత్రం సహించకూడు” దార్శనికుడైన నేతాజీ, ఎనభై యేళ్లకు ముందే నేటి సమకాలీన పరిస్థితిని పసిగట్టారు. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నది ఆర్యోక్తి. కాని, వారు చెప్పిన దానికి విరుద్ధంగా వారే బ్రాహ్మణార్యులు, బ్రాహ్మణిజాన్ని నెత్తిన మోస్తున్న బ్రాహ్మణేతరులు కలిసి కట్టుగా ఈ దేశంలో అతిగా ప్రవర్తించారు. ఇప్పటికీ ప్రవర్తిస్తున్నారు. ఒకప్పటి హిందూ మహాసభ ఇప్పుడు లేదని అనుకోవద్దు. ఆర్‌ఎస్‌ఎస్ బిజెపిలు దాని శాఖలే!

సిఎన్‌ఎస్ పోల్ ప్రపంచంలోని అత్యంత అవినీతి మయమైన పది రాజకీయ పార్టీల జాబితాను విడుదల చేసింది. అందులో మన దేశంలోని అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి నాలుగో స్థానం లభించింది. ఈ లిస్టులో పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్‌కు పిఎంఎల్(ఎన్) మొదటి స్థానం, నేషనల్ రెసిస్టెంట్ మూవ్‌మెంట్, ఉగాండాకు రెండో స్థానం, ప్రొగ్రెసివ్ యాక్షన్ పార్టీ క్యూబాకు మూడో స్థానం దక్కాయి. ఆ తర్వాత నాలుగో స్థానం మన దేశంలోని బిజెపిదే అయితే, కొమింటాంగ్ ఆఫ్ చైనా, నేషనలిస్టు ఫాసిస్ట్ పార్టీ ఆఫ్ ఇటలీ వంటివి కూడా అవినీతి రాజకీయ పార్టీల జాబితాలో వున్నాయి. దేశంలో బిజెపి వారు చేస్తున్న అరాచక కార్యక్రమాలు రోజు మీడియాలో చూస్తూనే వున్నాం.

మీడియాను మోడీ ఎంతగా కొనేసినా ఇంకా నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్న వారు కొంత మందైనా వున్నారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో అల్లర్లు సృష్టించిన ఏడుగురు బిజెపి కార్యకర్తల్ని సిసి ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు. వారు మహేశ్ కుమార్ మిశ్రా, ప్రత్యూష్ శ్రీవాస్తవ, నితిన్ కుమార్, దీపక్ కుమార్ గౌడ్, బ్రిజేష్ పాండే, శతృఘ్ను ప్రజాపతి, విమల్ పాండే. వీరు ముస్లింల టోపీలు ధరించి, ముస్లింల వేషధారణలో అయోధ్యలోని మసీదు వెలుపల అభ్యంతరకరమైన పోస్టర్లు అంటించారు. ఖురాన్ ప్రతుల్ని విసిరేశారు. ముస్లింలను నిందిస్తూ, ముస్లింలను దోషులుగా ప్రచారం చేస్తూ ముస్లింల వేషధారణలో అల్లర్లకు పాల్పడింది బిజెపి కార్యకర్తలేనన్నది స్పష్టమైంది!

గడ్డం పెంచుకున్నంత మాత్రాన ఎవరూ రవీంద్రనాథ్ టాగూర్ అయిపోరు. అలాంటప్పుడు మరి ఇతనేనా మన విజయవంతమైన ప్రధాన మంత్రీ? సర్దార్ పటేల్ విగ్రహానికి రూ. మూడు వేల కోట్లు పెట్టాడు. కార్పొరేట్లకు అయిదు లక్షల యాభై అయిదే వేల కోట్లు రుణ మాఫీ చేశాడు. ప్రధాని తన విదేశీ యాత్రలకు రూ. 25,000 కోట్లు, బిజెపి పార్టీ ఆఫీసుకు రూ. 350 కోట్లూ, తమ పార్టీ వ్యాపార ప్రకటనలకు రూ. 500 కోట్లు, ప్రధాని సెక్యూరిటీకి రోజూ కోటికి పైనే ఖర్చు చేస్తున్నాడు. సంవత్సరానికి మొత్తం సుమారు రూ. 591 కోట్ల 30 లక్షల ఖర్చు వస్తూ వుంది. గడిచిన ఐదు ఏళ్ళలో కుంభమేళాలకు రూ. 500 కోట్లు, ట్రంప్‌కు నమస్కారం చెప్పడానికి రూ. 100 కోట్లు ఖర్చు చేశాడు.

ఇతని వల్లనే కదా ద్రవ్యోల్బణం పెరిగిందీ? ఇతని వల్లనే కదా పెట్రోల్, డీజిల్, గ్యాస్ లిసిండర్ ధరలు ఊహించలేనంతగా పెరిగాయీ? గడిచిన 3040 సంవత్సరాలలో ఏనాడూ ఇంత మంది సైనికులు చనిపోలేదు. ఈయన అధ్వానపు పాలన ఎలా వుందో చెప్పడానికి ఇంకా ఎన్ని ఉదాహరణలు కావాలి? అంటూ ప్రతిపక్ష నేతలు పార్లమెంటులోనే అనేక సార్లు గగ్గోలు పెట్టారు. సంసద్ టివి, ఇతర జాతీయ టెలివిజన్ ఛానళ్ళ ద్వారా దేశ ప్రజలు అన్ని గమనిస్తూ వచ్చారు. తమ ‘మన్ కీ బాత్’ అక్కడ ప్రతిపక్షాలు గొంతెత్తి చెపుతున్నాయని అనుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం చేసింది సంసద్ టివియే గనక, అది అధికార ప్రకటననే అని దేశ ప్రజలు భావించారు!

Also Read:  జిసిసి హబ్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్

కర్నాటకలో విద్వేష ప్రసంగాలకు బిజెపి నాయకులు ఆజ్యం పోస్తున్నారు. కర్నాటక బిజెపి చీఫ్ నళిన్ కుమార్ కాతిల్ “టిప్పు సుల్తాన్ అభిమానులు ఈ దేశంలో వుండడానికి వీలు లేదు. వారిని వెంటాడి వేటాడి చంపేయండి లేదా అడవి ప్రాంతాలకు పారద్రోలండి. మనం హిందువులం శ్రీరాముడి భక్తులం!” అంటూ కర్నాటక లోని కొప్పాల్ జిల్లాలోని యెల్ బుర్గాలో ఈ విద్వేష ప్రసంగం చేశాడు. ఫలితంగా కర్నాటక ప్రజలు తమ తీర్పునిచ్చారు. ఎవరిని పారద్రోలాలన్నది బహుశా వారికి తెలిసినట్టుంది? ఆంగ్లేయులను ఎదిరించి పోట్లాడిన భారతీయ పాలకుడు టిప్పు సుల్తాన్‌ను వీరు దేశద్రోహి అని అంటారు. ఎందుకూ? అంటే అతను ముస్లిం రాజు కాబట్టి! ఆంగ్లేయుల బూట్లు నాకి క్షమాభిక్ష అడుక్కొన్న సావర్కర్ వీరి దృష్టిలో గొప్ప దేశభక్తుడు. ఎందుకూ? హిందూ మహాసభ/ ఆర్‌ఎస్‌ఎస్/ బిజెపిల సభ్యుడు గనక! గాంధీని హత్య చేసిన గాడ్సేకు వెనక వున్నది సావర్కరేనన్న విషయం కావాలనే దాచి పెడతారు.

ఉత్తరప్రదేశ్ అమేథీకి చెందిన మహమ్మద్ ఆరిఫ్ కొన్నేళ్ళ క్రితం తన పొలంలో గాయపడి పడిపోయిన ‘సారస్’ రకం కొంగకు చిన్నపాటి కట్టుగట్టి వైద్యం చేసి కాపాడాడు. అలా ఆ కొంగ అతని దగ్గరే ఉండిపోయింది. అటవీ శాఖ అధికారులు వచ్చి ఆ కొంగను స్వాధీనం చేసుకొని సమస్ పూర్ పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అంత వరకు బాగానే వుంది. కాని ఆరిఫ్‌పై అధికారులు కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. పక్షి ప్రాణాలు కాపాడినందుకు బిజెపి ప్రభుత్వం ఆరిఫ్‌పై కేసు పెట్టింది. కారణం మరేమీ లేదు. అతను ముస్లిం కావడమే. అలా కేసులు పెడితే పెద్ద పెద్ద వాళ్ళ మీదే పెట్టాలి. ప్రధాని మోడీ తన నివాసంలో నెమళ్ళు పెంచుకుంటే కేసు వుండాలి కదా? అలాగే యుపి ముఖ్యమంత్రి యోగి తన కార్యాలయంలో పని చేస్తూ వుండగా, ఆయన ఒళ్ళో బుల్లి కోతి వచ్చి కూర్చుంటుంది.

ఆయన దాన్ని ఆడిస్తూ వుంటాడు. ఆయన మీద కేసు వుండాలి కదా? వీళ్ళు ఆ జంతువుల/ పక్షుల గాయాలు మాన్పలేదు. ఆరోగ్యంగా వున్న వాటినే పెంచుకొని ఆడుకుంటున్నారు. అటవీ చట్టం ప్రకారం అడవి జంతువుల్ని బలవంతంగా ఇంట్లో కట్టి పడేసుకోవడం నేరం. ప్రాణాలు కాపాడి, ఆహారం పెట్టినందుకు ఓ కొంగ ముస్లిం యువకుడికి దగ్గరయ్యింది. అంతే అది అతని పెంపుడు పక్ష కాదు. బలవంతంగా దాన్ని తన దగ్గర వుంచుకోలేదు. విషయం క్షుణ్ణంగా పరిశీలించక, దురుద్దేశంతో కక్ష పూరితంగా కేసులు పెట్టడం నేటి బిజెపి ప్రభుత్వానికి అలవాటైపోయింది.

MEMORY GARBAGE IS FULL CLEAN. అంటూ తరచూ మనం మన మొబైల్‌లో ఒక మెసేజ్ చూస్తుంటాం కదా? అయితే అది, నేటి మన కేంద్రప్రభుత్వానికి కూడా పని కొచ్చేట్లుగా వుంది! మన కేంద్ర ప్రభుత్వపు పోకడ చూసే ఒక ఉర్దూ కవి ఇలా అన్నాడు ‘ఓ చైన్ సె సో రహే,హై షహర్ బేచ్ కర్/ కొయీ సుహాగ్ బచారహో జేవర్ బేచ్‌కర్/ బాప్ నె ఉమర్ గుజారీ థీ ఘరొందే బనానేమె / బేటా ఉస్‌కి సాంసే ఖరీద్ రహా హై ఘర్ బేచ్‌కర్/ బర్బాద్ హోగయే కయీఁ ఘర్ దవా ఖరీద్ నే మె/ కుచ్ లోగోంకి తిజోరీ భర్ గయీ జహర్ బేచ్‌కర్‌”

భారత ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్ళినపుడు “మై యుద్ద్‌కి దేశ్ సే నహీఁ ఆయా/ మై బుద్ధ్‌కి దేశ్ సే ఆయా హూఁ” అని గొప్పగా చెప్పుకొన్నాడు. అంటే నేను యుద్ధాలు చేసే దేశం నుండి రాలేదు. నేను బుద్ధుడు పుట్టి పెరిగిన దేశం నుండి వచ్చాను అని అర్థం! అలా చెప్పుకోవడం బాగుంది. కాని, నేను ముఖం నుండి మనుషులు పుట్టే దేశం నుండి వచ్చాను. భుజాల నుండి మనుషులు పుట్టే దేశం నుండి వచ్చాను అని ఎందుకు చెప్పుకోలేదూ? వినాయకుడికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిన దేశం నుండి వచ్చాను అని కదా చెప్పుకోవాలి? మరి అలా ఎందుకు చెప్పుకోలేకపోయారూ? అలా చెప్పుకొంటే, ప్రపంచ పౌరులు నవ్వుకుంటారని భయం. ఒకప్పుడు గుజరాత్‌లో ఇప్పుడు మళ్ళీ మణిపూర్‌లో నరమేధం జరుగుతూ వుంటే దేశ ప్రధాని మౌనవ్రతం చేపట్టడమేమిటీ? దేశ ప్రజలు భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పి, సమస్యను పరిష్కరించాల్సింది ఎవరూ? గత్యంతరం లేక నిండు పార్లమెంటులో విపక్ష నేత ‘తమరు దేశభక్తులు కారు. దేశ ద్రోహులు’ అని గొంతెత్తి అరవాల్సిన పరిస్థితి వచ్చింది కదా?

ఈ దేశ పాలకులు రాజ్యాంగబద్ధంగా నడుచుకొంటున్నారా? లేక మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నారా? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎంత కాలం అధికారం వెలగబెట్టగలరూ? ‘మీ విద్వేషపు బజారులో మేం ప్రేమ దుకాణాలు తెరుస్తూ వెళతాం’ అని అన్నారు విపక్ష నేత రాహుల్. “డెమొక్రసీ హమారీ డిఎన్‌ఎ మై హై” అని దేశ ప్రధాని అమెరికా వైట్ హౌస్‌లో గొంతు చించుకొని వచ్చారు. అసలు ఆయనకు డెమొక్రసీ అనే పదం ఉచ్ఛరించే అర్హత వుందా? అని దేశ పౌరులు ఆలోచనలో పడ్డారు.

వాస్తవాల్ని తొక్కిపెట్టి గాలి కబుర్లు చెప్పే వారిని ఈ ఆధునిక ఆలోచనా యుగంలోని జనం విశ్వసించరు. మణిపూర్‌లో ఇద్దరు కుకీ తెగ మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన పై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహించింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. మానవ హక్కుల్ని కాపాడాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్ని కోరింది. “మణిపూర్ మె భారత్ మాతాకి హత్యా హు ఈ హై” అని విపక్ష నేత గొంతు చించుకొని అరిచిన అరుపు పార్లమెంటులోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. జాతుల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్ల కోసం కుట్రలు చేసే పాలకులు మతాన్ని దోపుడు కర్రలుగా చేసుకొని, ప్రభుత్వాన్ని నడిపిస్తూ వుంటే ఏమనుకోవాలి? అదొక వికలాంగ ప్రభుత్వమనుకోవాలి! మతం వేరు ప్రజాస్వామ్యం వేరు అని పాలకులు గ్రహించినప్పుడు కదా మళ్ళీ దేశ ఆరోగ్యం పునరుద్ధరించబడేదీ? రాహుల్ గాంధీ ఆక్రోశాన్ని పార్లమెంటు రికార్డుల్లోంచి తొలగించుకోగలరు. కాని, ప్రపంచ పౌరుల మనసుల్లోంచి తొలగించలేరు.

డా. దేవరాజు మహారాజు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News