Saturday, September 30, 2023

మాల్స్‌కు చిన్న వ్యాపారాలు బలి!

- Advertisement -
- Advertisement -

ఇటీవల కాలంలో మహా నగరాలతో పాటు జిల్లా స్థాయి పట్టణాలలో కూడా ‘డీమార్ట్’, ‘రిలయన్స్’, ‘బిగ్ బజార్’ మొదలైన షాపింగ్ మాల్స్ అనేకం వివిధ బ్రాంచీలతో విస్తరిస్తున్నాయి. దీనికి తోడు ఇంటర్నెట్ సర్వీస్‌ల విస్తరణ పెరగడంతో, అమెజాన్ లాంటి బహుళజాతి సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో వినియోగదార్ల అవసరాలు తీర్చడానికి రీటైల్ రంగంలో అడుగుపెట్టాయి. క్రమంగా నానాటికి విస్తరిస్తూ లక్షల, మిలియన్ చదరపు అడుగులలో ఈ షాపింగ్ మాల్స్ పెద్ద, పెద్ద అడుగులతో విస్తరిస్తున్నాయి. మరింత వివరాలలోకి వెళితే వీటికి దేశ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్‌కు ఎనలేని డిమాండ్ పెరుగుతున్నది. వీటి పెరుగుదలకు అడ్వర్ టైజ్‌మెంట్ సంస్థల యాడ్స్, హోర్డింగ్‌లు, టివి ప్రకటనలు, వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఆన్‌లైన్ వ్యాపార ప్రకటనలు ఇతోధికంగా తోడ్పడుతున్నాయి.

మన దేశంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఈ షాపింగ్ మాల్స్ కల్చర్ కూడా బాగా పెరుగుతున్నది. వీటిని ఏర్పాటు చేయటానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీ లుపడున్నాయి. 2027 నాటికి మన దేశలో ఏడు మెట్రో నగరాల్లో షాపింగ్ మాల్స్‌కు డిమాండ్ 43% వరకు పెరిగే అవకాశం ఉన్నదని జోన్స్ లాంగ్ లా సేల్ (జెఎల్‌ఎల్) ఇండియా, తాజాగా వెల్లడించింది. ‘ఇండియా రిటైల్: ఎవాల్వింగ్ టు ఏ న్యూ డాన్’ అనే పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో భారత్ లో షాపింగ్ మాల్స్‌కు ఉన్న డిమాండ్‌ను విశ్లేషించింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ప్రస్తుతం 89 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్స్ వున్నాయి. వచ్చే ఐదేళ్లలో కొత్తగా మరో 38 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్స్ అందుబాటులోకి రానున్నాయి.

వీటిలో దేశ రాజధాని ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సిఆర్)లోనే 28 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్స్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. కాగా 2027 నాటికి కొత్తగా మరో 11.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్ రాబోతున్నాయని పేర్కొంది. అలాగే, బెంగళూరులో 4.97 మిలియన్ చదరపు అడుగులు, చెన్నైలో 6.23 చదరపు అడుగులు, హైదరాబాదులో 5.48 మిలియన్ చదరపు అడుగులు, కోల్‌కతాలో 2.98 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్ రాబోతున్నాయని పేర్కొంది.

అలాగే, ఆర్థిక రాజధాని ముంబైలో 2.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్స్ రానున్నాయి. అలాగే పుణెలో కూడా 2.32 మిగిలిన చదరపు అడుగుల్లో ఏర్పాటుచేయబోతున్నారు. ఇలా దేశీయ రిటైల్ రంగం దినదినాభివృద్ధిని నమోదు చేసుకుంటూ ముఖ్యంగా వినియోగదారుల కు నూతన షాపింగ్ అనుభవం కల్పించడానికి యజమానులు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారని జోన్స్‌లాంగ్ లా సేల్ (జెఎల్‌ఎల్) ఇండియా హెడ్ రాహుల్ ఆరోరా తెలిపారు. అయితే పాశ్చాతీకరణ, నగరీకరణ విస్తరణతో ఈ షాపింగ్ మాల్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. మొదట్లో మహానగరాల్లో, కార్పొరేట్ నగర పరిధిలో స్థాపించబడి సమాజంలో, ఆర్ధికంగా ఉన్నత వర్గాల ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. క్రమంగా ఇవి ఎగువ, దిగువ మధ్యతరగతి ప్రజలనూ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చేతివృత్తులు నశించడం, పిల్లల విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం ప్రజలు గ్రామాలను విడిచి నగరాల వలస బాటపడుతున్నారు. నగరాల సంఖ్య బాగా పెరిగిపోతున్నది. ప్రజల అవసరాల కోసం ఆకర్షణీయ షాపింగ్ మాల్స్ ఊరూరా వెలసి మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వినియోగదారులను కూడా ఆకర్షించి తన బుట్టలో వేసుకుంటున్నాయి. ఇక్కడ దాదాపు దొరకని వస్తువు లేదు. అన్ని రకాల వస్తువులు, గృహ సామాగ్రి, పరికరాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, కిరాణం సామాగ్రి ఒకే చోట ప్యాకింగ్ చేసి లభిస్తున్నాయి. ఎసి, రంగు రంగుల దీపాల వెలుగులో ఆకర్షణీయంగా పరిసరాలు ఉంటాయి.

క్యాష్, క్రెడిట్, డెబెట్ కార్డులతో వస్తువులు కొనుగోలు చేయవచ్చు.ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా పేమెంటు చేయవచ్చు. ఒకే వస్తువు అనేక రంగుల్లో, సైజుల్లో, వివిధ మోడల్స్‌లో, వివిధ బడా బ్రాండ్ కంపెనీల ఉత్పత్తులు విరివిగా దొరుకుతాయి. ప్రతి వస్తువుపై నిర్ణీత ధర ఉంటుంది. కొన్నింటిపై డిస్కౌంట్‌లు కంపెనీలు ప్రకటించేవి పరిమిత కాలానికి లభిస్తాయి. ధరల విషయంలో వినియోగదారుడి బేరసారాలకు అవకాశం లేదు. అప్పుకు స్థానంలేదు. పైగా అలా అడగడం ‘నామోషీ’ కూడా. ఒక వస్తువు కొనడానికి పోయిన వినియోగదారుడు, ఆ షాపింగ్ మాల్ మాయాజాలంలో చిక్కుకొని, ఏదో ఒక వస్తువును తనకు ప్రస్తుతం అవసరం లేకున్నా భవిష్యత్తులో అవసరం రాకపోతుందా అన్న భ్రమలోపడి కొనేస్తాడు. అనేక వస్తువులు, బ్రాండులు ఒకేసారి మన కండ్ల ముందు జిగేల్‌మంటూ దర్శనం కావడంతో వినియోగదారుడు అయోమయంలోపడిపోతాడు. వివిధ వస్తువుల ప్రదర్శనశాలలో ఏది కొనాలో తెలియక తికమకపడి ఏదో ఒక వస్తువును తప్పక కొనుగోలు చేస్తాడు. ఇలా వినియోగదారుని సమ్మోహన పరిచి, సంభ్రమాశ్చర్యాలకు గురి చేసి ఏదొక వస్తువును కొనుగోలు చేసేలా ప్రేరేపించడమే వ్యాపార కళకు పరాకాష్ట.

ఈ షాపింగ్ మాల్స్ వల్ల, ఆన్‌లైన్ కొనుగోళ్ళ వల్ల దేశంలో సంప్రదాయబద్ధంగా తమ దుకాణాలకు కిరాయిలు చెల్లించి వ్యాపారం చేసుకొనే కోట్లాది మంది పెద్ద, మధ్య తరగతి, చిన్న కిరాణం వ్యాపారులు నష్టపోతున్నారు. వారిపై ఆధారపడిన చిరు ఉద్యోగులు ఎకౌంటెంట్లు, గుమాస్తాలు, ఇతర చిన్నపాటి ఉద్యోగులు ఇప్పుడు వ్యాపారాలు లేక వీధినపడ్డారు.

జిఎస్‌టి వంటి పన్నుల విధానం కూడా, జిల్లా, మండల గ్రామాల్లో ఉండే ఈ చిరు వ్యాపారులను బాగా కుంగదీసింది. కొనుగోళ్ళు బాగా దెబ్బతిన్నాయి. షాపుల కిరాయి పెరిగింది. గుమాస్తాల కనీసవేతనాలు కూడా వ్యాపారులకు భారమైంది. దానితో నలుగురు గుమాస్తాతో నడిచే షాపులు ఒకరితో సరిపెట్టుకునే స్థితి వచ్చింది. ఇలా ఎన్నో కోట్ల మందిని, వారి కుటుంబాలను పోషించిన వ్యాపార సంస్థలు ఈ విదేశీ, స్వదేశీ షాపింగ్ మాల్స్‌ల విస్తరణ పెనుతుపాన్ హోరులో కొట్టుకుపోతున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థకు మూలమైన ఈ సంప్రదాయ వ్యాపారులను, వారి ఉన్నతిపై ఆధారపడి జీవించే చిరు ఉద్యోగులను కాపాడే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

డా. కోలాహలం
రామ్ కిశోర్
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News