Sunday, September 15, 2024

క్రీడలు దేశభక్తి కాదా?

- Advertisement -
- Advertisement -

ఈ నెల 15 స్వాతంత్య్ర దినోత్సవం ఎంతో సంతోషంగా, గర్వంగా జరుపుకున్న వారిలో చాలా మందికి అంతకు నాలుగు రోజుల ముందు ఈ నెల 11న మనకు ఎంతో బాధాకరంగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్ ఇంకా మరపునకు వచ్చి ఉండవు. ఆ క్రీడోత్సవాలలో మొత్తం 85 దేశాలు పాల్గొనగా, పతకాలు గెలవటంలో మనది 71వ స్థానం. లభించిన పతకాలలో స్వర్ణం ఒకటి కూడాలేదు. ఒక రజతం, అయిదు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు ఉన్నాయి. నాలుగేళ్ల కిందటి టోక్యో ఒలింపిక్స్‌తో పోల్చితే మొత్తం పతకాల సంఖ్య 7 నుంచి 6 కు తగ్గింది. అపుడు గెలిచిన వాటిలో ఒక స్వర్ణం కూడా ఉంది. ఈసారి పారిస్‌లో మొదటి మూడు స్థానాలలో నిలిచిన అమెరికా, చైనా, జపాన్‌లను వదిలివేద్దాము.

ఆ తర్వాత 4 నుంచి 70 వ స్థానం వరకు గల 67 దేశాలలో అనేక దేశాల పేర్లయినా మనలో చాలా మంది విని ఉండరు. విన్నవారిలోనూ అనేకులను ప్రపంచ చిత్రపటం ముందు నిలిపినట్లయితే, ఆ దేశాలు ఎక్కడున్నాయో గుర్తించలేరు. ఇక జనాభా విషయానికి వస్తే, అత్యధిక దేశాల జనాభా మన హైదరాబాద్ నగర జనాభాకు మించకపోవచ్చు. అయితే పోటీలలో పాల్గొన్నది ఒక దేశంగా ఇండియా అయినందున మన జనాభా ఎంత? ఈ సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించే వరల్డో మీటర్ అనే సంస్థ ఒకటున్నది. దాని లెక్కల ప్రకారం, మన ఈ 78వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు నాటికి, అనగా 14 ఆగస్టు 2024 నాటికి 1,45, 24,87,559. ఆ విధంగా జనాభా విషయంలో మొత్తం ప్రపంచంలోనే మొదటి స్థానం.

ఈ స్థానాన్ని మరొక మారు పతకాల విషయంలో పోల్చి చెప్పుకుంటే, అది 71వ స్థానం. పాకిస్థాన్ మనకన్న మెరుగుగా 62వ స్థానంలో ఉంది. ఈ రకరకాల అంకెలన్నింటినీ చెప్పుకున్నప్పుడు, మన దేశభక్తి సగర్వంగా రుజువైనదెక్కడ అనే ప్రశ్న అనివార్యంగా తలెత్తుతుంది. ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడలలో ప్రతి క్రీడాంశం ఫైనల్స్ ముగియగానే, స్వర్ణ రజత కాంస్య విజేతలు ముగ్గురూ పోడియంపైకి తమ దేశ పతాకాలను భుజాల చుట్టూ కప్పుకుని విజయహాసంతో వస్తారు. ఆ విధంగా వచ్చిన స్వర్ణపతక విజేత ఈసారి భారతదేశానికి ఒక్కరంటే ఒక్కరైనా లేరు. ఆ విధంగా భారతీయుల దేశభక్తి భావనలకు ప్రతిసారి దెబ్బ తగిలి వారు కుంగిపోయి ఉంటా రు. విషయమేమంటే, దేశభక్తికి క్రీడలతో అవినాభావమైన సంబంధం ఉంటుంది. లేనిదే, క్రికెట్‌లో గెలిచిన ప్రతిసారి భారతీయుల దేశభక్తి ఎంతో ఉప్పొంగిపోయి, ఓడిన ప్రతిసారి అంతులేని విషాదాన్ని కలిగించటం ఎందుకు? మళ్లీ క్రికెట్‌నే తీసుకుని చూద్దాము.

ప్రస్తుతం ఈ విషయమై భారతీయుల దేశభక్తి భావనలు, గర్వం, ఎవరెస్టు శిఖరానికి మించిపోయి నేరుగా ఆకాశాన్నే పొడుచుకుంటున్నాయి. ఎందువల్ల? టెస్టుల్లో ఇండియా నంబర్ వన్. వన్డేల్లో నంబర్ వన్. టీ ట్వంటీల్లో నంబర్ వన్. ఈ ర్యాంకింగ్స్‌లో ఎప్పుడు ఏది ఒకటి తగ్గినా భారతీయుల హృదయాలు కల్లోలానికి గురవుతాయి. తిరిగి మ్యాచ్ సమయానికి ఆలయాలలో పూజలు వెల్లువెత్తుతాయి. ఇది తప్పకుండా మంచి దేశభక్తే. సందేహం లేదు. కాని వేరు సందేహం ఒకటున్నది. పారిస్ ఒలింపిక్స్ కన్న ముందు అటువంటి దేశభక్తి పూజలు ఏమైనా జరిగాయా? టోక్యో ఒలింపిక్స్ నాటి 7 పతకాల కన్నా ఎక్కువ రావాలని? మనకు పారిస్‌లో రెండంకెల పతకాలు, అనగా 7 నుంచి కనీసం 10కి పెరిగి, రాగలవా అంటూ క్రీడారంగ నిపుణులు ఊహాగానాలు చేశారు.

రావాలని కోరుకున్నారు. పారిస్ వెళ్ళే క్రీడాకారుల ప్రతిభను పలు విధాలుగా అంచనా వేశారు. కాని అట్లా రావాలంటూ, క్రికెట్ తరహాలో పూజలు చేసిన దేశభక్తులున్నారా? తీరా టోక్యో కన్న ఒక పతకం తగ్గిపోగా సంతాప సభలు జరిపిన దేశ భక్తులున్నారా అనేదే సందేహమే. విషయం ఏమంటే, మన దేశభక్తి క్రికెట్‌కు తాకట్టు పడిపోయింది. ఎందుకన్నది సుదీర్ఘ చర్చ. కాని అర్థం చేసుకోవటం సాధ్యమే. క్లుప్తంగా చెప్పుకోవాలంటే, పాకిస్థాన్‌తో గల శత్రుత్వం మొదట హాకీ తో ముడిపడి అది దేశభక్తి అయింది. తర్వాత అదే శత్రుత్వం క్రికెట్‌లో ప్రవేశించి అది కొత్త దేశభక్తిగా మారింది. ఈ దశ వచ్చే సరికి క్రికెట్‌లోకి వ్యాపార శక్తులు, వ్యాపార సంస్కృతి విపరీతంగా ప్రవేశించాయి. ఆ జయాపజయాలను దేశభక్తితో, జాతీయ భావనలతో తెలివిగా ముడివేసి ప్రజలకు వెర్రెత్తించాయి. తమ వ్యాపారాన్ని మూడు మ్యాచ్‌లు మూడొందల పువ్వులుగా మార్చుకున్నాయి. అవి మూడు వేల కాయలుగా మారాయి. ఆ క్రమంలో క్రికెట్ దేశభక్తి అయింది.

టోక్యో, పారిస్ ఒలింపిక్స్ కాలేదు. మరొక నాలుగేళ్లకు 2028లో జరిగే లాస్‌ఏంజెలిస్ ఒలింపిక్స్ కూడా కాబోవు అనేందుకు సందేహం అక్కర లేదు. వేరే ఉదాహరణలు కొన్ని చూద్దాము. భారత దేశంలో ఆసియాడ్ క్రీడోత్సవాలు తొలిసారి 1982లో ఢిల్లీలో జరిగాయి. అపుడు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో క్రీడలను అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో, ఎంతో ఉత్సాహంగా ఆమె అందుకు కావలసిన నిధులు కేటాయించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ పోటీలలో భారత దేశానికి చైనా, జపాన్, దక్షిణ కొరియాల తర్వాత నాలుగవ స్థానం లభించింది. గెలిచిన పతకాలు 13 స్వర్ణం, 19 రజతం, 25 కాంస్యం మొత్తం 57. ముఖ్యంగా మనకన్న ఎంతో చిన్నవి అయి, చాలా తక్కువ జనాభా గల జపాన్, దక్షిణ కొరియాలు ఎగువ స్థానంలో ఉండటం ఇందిరా గాంధీకి బాధ కలిగించింది. ఇది “సిగ్గు చేటైన పరిస్థితి” అని పార్లమెంటులో వ్యాఖ్యానించారామే.

తర్వాత 51 సంవత్సరాలకు తిరిగి ఆసియా క్రీడోత్సవాలు జరిగాయి. వాటిలో మన పరిస్థితి ఏమిటి? 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో మొత్తం 107 పతకాలు. చైనా, జపాన్, దక్షిణ కొరియాల తర్వాత తిరిగి అదే విధంగా 4వ స్థానం. ఈ 51 సంవత్సరాల కాలంలో పన్నెండు మంది పరిపాలించారు. ఇందిరా గాంధీ మరొకసారి ప్రధాని అయ్యారు కూడా. ఈ విషయమై బహుశా ఇంకా మాట్లాడుకోనక్కర లేదు. అయితే ఒక విశేషమేమంటే ఇటీవల ప్రధాన మంత్రు లు క్రీడల గురించి మాట్లాడటం దాదాపు మానివేశారు. కప్పులు గెలిచినప్పుడు క్రికెట్ జట్లను, ర్యాంకు లు సాధిస్తే కెప్టెన్లను అభినందించటం మినహా. అదే విధంగా ఇతర క్రీడలలో ఏవైనా మెడల్స్ గెలిస్తే సంబంధిత క్రీడాకారులకు సందేశాలు పంపటం, అవార్డులు, నగదు బహుమతి, స్థలాలు ఇవ్వటం వంటివి తప్పిస్తే.

మన దేశభక్తికి సంబంధించి సమస్య ఏమంటే, ఒక స్పష్టమైన, సమగ్రమైన క్రీడా విధానం మనకెప్పుడూ లేదు. ఏ పార్టీ పరిపాలించినా, ఎవరు ప్రధాని అయినా అదే పరిస్థితి. తగినన్ని నిధులు, క్రీడా సౌకర్యాల కల్పన, శిక్షణలు, ప్రోత్సాహాలు, ప్రభుత్వ బడ్జెట్ నిధులకు తోడు ప్రైవేటు రంగ భాగస్వామ్యం అన్నీ అరకొరగానే ఉంటాయి. ఇది చాలదన్నట్లు అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం, మహిళా క్రీడాకారులకు వేధింపులు, కులతత్వం వంటి జాడ్యాలన్నీ షరా మామూలు. రెండు ఉదాహరణలు చూద్దాం. కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు నిధులు 2023 24 లో రూ. 880 కోట్లు కాగా, 202425 లో కేవలం రూ. 20 కోట్లు పెంచి రూ. 900 కోట్లు చేశారు. మరొక వైపు చైనా క్రీడల బడ్జెట్ 2023లో రూ. 27,200. ఇది గాక ప్రైవేట్ రంగం నుంచి ఇండియా కన్నా పాతిక రెట్లు ఎక్కువ.

మరొక ఉదాహరణ స్టేడియాలు. ఒక లెక్క ప్రకారం ఇండియాలో మొత్తం స్టేడియాలు సుమారు వెయ్యి కాగా, చైనాలో దాదాపు లక్షా ఎనభై వేలున్నాయి. మన స్టేడియాలలో అనేకం క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాగా, చైనా స్టేడియాలు పలు విధాలైన క్రీడలకు ఉపయోగపడతాయి. మన క్రీడలకు సంబంధించి మరొక సమస్య, ఏదైనా అవాంతరం సంభవించినపుడు హడావిడి చేయటం, ఆ తర్వాత మరిచిపోవటం. 1982లో ఢిల్లీ ఆసియాడ్ జరిగిన సంవత్సరాలలో అక్కడ విద్యార్థిగా ఉండిన నేను ఇది స్వయంగా గమనించాను. చైనా, జపాన్, దక్షిణ కొరియాలు మనకన్న అంతముందుండటంపై, ఆ దేశాల క్రీడా విధానాలు ఏమిటంటూ భారత ప్రభుత్వం విచారణలు చేయించింది. నిధులు గణనీయంగా పెంచి క్రీడలను పాఠశాల స్థాయి నుంచి ప్రోత్సహించగలమన్నది. ఆ దేశాల క్రీడా విధానాలపై జాతీయ పత్రికలు, మేగజైన్లలో అనేక కథనాలు వెలువడ్డాయి. కాని రోజులు గడిచే కొద్దీ అంతా షరా మామూలు అయింది.

అందుకే పైన చెప్పుకున్నట్లు, అప్పటి నుంచి మరో 51 సంవత్సరాలు గడిచినాక కూడా నిరుటి ఆసియా క్రీడలలో మనం చైనా, జపాన్, దక్షిణ కొరియాల తర్వాత నాల్గవ స్థానంలోనే మిగిలాం. ఒలింపిక్స్ సంగతి సరేసరి. ఇదంతా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చెప్పుకోవటం ఎందుకంటే, స్వాతంత్య్రం కోసం పోరాడిన దేశభక్తులు కేవలం బ్రిటిష్ వారిని పారదోలాలని మాత్రమే ఆ పని చేయలేదు. స్వాతంత్య్రం సాధించుకున్న వెనుక దేశం, దేశ ప్రజలు సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కలలుగన్నారు. ఆ వివిధ ముఖాలలో క్రీడలు కూడా ఒక ముఖ్యమైన భాగం. అవి యువతరానికి, భావితరాల నిర్మాణానికి దేహదారుఢ్యానికి, మనోవికాసానికి చాలా కీలకమైనవి. అందువల్లనే ఇండియా కన్న అతి చిన్నవైన దేశాలు కూడా ఈ రంగానికి ఇంత ప్రాధాన్యతనిచ్చి ఎంతో సాధిస్తున్నాయి. మరి భారతీయుల దేశభక్తి, పార్టీలు, ప్రభుత్వాల దేశభక్తి ఎక్కడున్నట్లు?

టంకశాల అశోక్
9848191767

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News