Monday, April 29, 2024

కశ్మీర్: ఇలా ఎంత కాలం?

- Advertisement -
- Advertisement -

 Kashmir

 

ఒక వైపు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలపై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తూనే మరో వైపు యూరపు తదితర దేశాల రాయబారుల బృందాన్ని మరోసారి కశ్మీర్ సందర్శనకు తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తుండడం విస్మయం కలిగిస్తున్నది. ప్రజా నాయకులపై నిర్బంధ కాండను కఠినతరం చేస్తూనే అక్కడి పరిస్థితి బాగుందని ప్రజలు సుఖశాంతులతో బతుకుతున్నారని ప్రపంచానికి చాటుకోదలచడం ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న విచిత్ర పరిస్థితిని సూచిస్తున్నది.

ఇటువంటి ఇరకాటాన్ని ప్రభుత్వం ఎందుకు తెచ్చుకున్నది అనే ప్రశ్నకు అవకాశం కలిస్తున్నది. ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ఆరు మాసాలైనా అక్కడ పరిస్థితిని చక్కదిద్దలేకపోవడం స్పష్టంగా కనుపిస్తున్న వైఫల్యం. గత నెల 9,10 తేదీల్లో కేంద్రం ప్రోద్బలంతో తొలిసారి విదేశీ దూతల బృందం కశ్మీర్‌కు వచ్చింది.

ముస్లింల పట్ల వ్యతిరేకత గూడుకట్టుకున్న మితవాదులను వీలయినంత ఎక్కువ మందిని ఎంచుకొని ఈ బృందాన్ని కూర్చారనే విమర్శ వినవచ్చింది. అయినా వారిలో కొందరు ఎవరూ వెంట లేకుండా తమంతట తాముగా కశ్మీర్ ప్రజలతో మాట్లాడ్డానికి అవకాశం ఇవ్వాలని కోరారని అందుకు మన అధికారులు నిరాకరించారని వార్తలు వచ్చాయి. కొనసాగుతున్న నాయకుల నిర్బంధాలు, ఇంటర్‌నెట్‌పై ఆంక్షల పట్ల ఆ బృందంలోని సభ్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారని కూడా తెలియవచ్చింది. అయినా మొత్తం మీద పరిస్థితి బాగానే ఉందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అటువంటప్పుడు ఇప్పుడు మరొక బృందాన్ని ఎందుకు తీసుకురావలసి వస్తున్నది? అంతర్జాతీయ ఒత్తిడి, ముఖ్యంగా యూరపు నుంచి బాగా పెరిగింది. కొత్త బృందాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలకు ఇదే కారణమని బోధపడుతున్నది. 705 మంది సభ్యులు గల యూరోపియన్ యూనియన్ పార్లమెంటులో 539 మంది ప్రాతినిథ్యం వహిస్తున్న 5 బృందాలు కలిసి మన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ సంయుక్త తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం దాని మీద ఓటింగ్ తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వచ్చే మార్చి 2వ తేదీన ప్రారంభమయ్యే యూరోపియన్ పార్లమెంటు సమావేశాల్లో ఇది మళ్లీ చర్చకు, ఓటింగ్‌కు రాకుండా చూసుకోవలసిన అవసరం మన ప్రభుత్వానికి కలిగింది. అందుకోసం దేశంలో అంతా బాగుందని చూపించుకోడానికి మరోసారి విదేశీ రాయబారుల బృందాన్ని తీసుకు రాదలచినట్టు అర్థమవుతున్నది. ఇలా మసిబూసి మారేడు కాయ చేసినట్టు అతి ప్రయాసతో అంతర్జాతీయ అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవలసిన అగత్యం కలగడం బాధాకరం. ఇందుకు బదులు కశ్మీర్‌లోని ప్రధాన పక్షాల నాయకులపై నిర్బంధాన్ని తొలగించి ఇంటర్‌నెట్ పై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేస్తే బాగుంటుంది. కాని అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరిపైనా ప్రజా భద్రత చట్టాన్ని ప్రయోగించడంలోనే స్పష్టపడుతున్నది. వాస్తవానికి వీరిద్దరూ మొదటి నుంచి గృహ నిర్బంధంలో కొనసాగుతున్న వారే. మరో మాజీ ముఖ్యమంత్రి 83 ఏళ్ల ఫారూఖ్ అబ్దుల్లాపై ఇంతకు ముందే ప్రజా భద్రత చట్టాన్ని ప్రయోగించి నిర్బంధంలో కొనసాగిస్తున్నారు.

ఈ చట్టం కింద కోర్టుకు చూపించకుండానే ఎవరినైనా రెండేళ్ల పాటు నిర్బంధంలో ఉంచవచ్చు. ఆర్టికల్స్ 370, 35ఎ రద్దును వ్యతిరేకిస్తూ ఉద్రిక్తతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే కారణం చూపి ముఫ్తీ మొహమ్మద్‌ను గృహ నిర్బంధలో ఉంచారని వార్తలు చెబుతున్నాయి. ప్రజాస్వామ్య రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను అనుమతించకుండా ఇలా ఎంత కాలం కశ్మీర్‌ను అంధకారంలో ఉంచుతారనే ప్రశ్నకు పాలకుల నుంచి సమాధానం లేదు. ఇంటర్‌నెట్ బంద్‌ను నిరవధికంగా కొనసాగించడం ఎంతమాత్రం సమ్మతం కాదని సుప్రీంకోర్టు గత నెలలోనే స్పష్టంగా తీర్పు ఇచ్చింది. అలాగే ప్రజలు ఒక దగ్గర చేరకుండా నిషేధించే 144 సెక్షన్‌ను పదేపదే విధించడాన్ని తప్పు పట్టింది.

ఈ సందర్భంగా అసమ్మతి అస్థిరత్వానికి దారి తీస్తుందనడం సరైనది కాదని కూడా వ్యాఖ్యానించింది. ఈ తీర్పు ప్రభావంతోనే మొబైల్ ద్వారా ఇంటర్‌నెట్ సేవలను ప్రభుత్వం పాక్షికంగా పునరుద్ధరించింది. ఏమైనప్పటికీ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను నిరవధిక నిర్బంధంలో ఉంచడం కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం చెప్పుకుంటున్న దాన్ని సమర్థించే విధంగా లేదు. ఇప్పటికైనా వారిని విడుదల చేసి వారితో చర్చలు జరపడమే కశ్మీర్‌లో 6 మాసాలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు పరిష్కార ద్వారాలను తెరవగలదు.

 

Repression in Kashmir
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News