Monday, April 29, 2024

కరోనా మృతుల్లో తొలి విదేశీయులు

- Advertisement -
- Advertisement -

coronavirus

 అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి
చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు
జపాన్ ఓడలో మరికొందరికి కరోనా

బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా చేరుతున్నారు. ఒక అమెరికన్ మహిళ, జపాన్ పురుషుడు కరోనా వ్యాధి వల్ల చైనాలో మరణించారని తాజా సమాచారం తెలుపుతోంది. దీంతో కరోనా మరణాల సంఖ్య 723కు పెరగ్గా, ధ్రువీకరించిన కేసులు 34,598కు చేరాయని ఆరోగ్యాధికారులు శనివారం చెప్పారు. కరోనా వ్యాధికి కేంద్రంగా మారిన వుహాన్‌లో ఒక అమెరికన్ మహిళ మరణించారని ఇక్కడి అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ప్రాణాంతక వ్యాధివల్ల చనిపోయిన మొదటి విదేశీ వ్యక్తి అని నిర్ధారించారు. ‘కరోనా వైరస్ సోకిందని గుర్తించిన 60 ఏళ్ల అమెరికన్ వుహాన్‌లోని జినియిన్‌టాంగ్ ఆస్పత్రిలో ఫిబ్రవరి 6న మరణించారని నిర్ధారించగలం. ఆమె మరణంతో కుటుంబానికి వాటిల్లిన నష్టానికి మా మనస్ఫూర్తి సంతాపం తెలుపుతున్నాం’ అని అమెరికన్ ఎంబసీ ప్రతినిధి చెప్పారని హాంకాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.

జపాన్ పౌరుడి మృతి

కరోనా వల్ల మృతి చెందిన మొదటి విదేశీ వ్యక్తి తమ దేశ మహిళే అని అమెరికా అధికారికంగా ప్రకటించినా, న్యు మోనియాతో వుహాన్ ఆస్పత్రిలో చేరిన తమ దేశీయుడు కరోనా వల్ల మరణించాడని జపాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ టోక్యోలో తెలిపింది. 60 ఏళ్లలో ఉన్న ఒకాయనకు కరోనా వైరస్ సోకిందని, అయితే ఆ వ్యాధిని సరిగా గుర్తించడంలో ఎదురైన సమస్యలవల్ల ఆయన న్యుమోనియా వల్ల మరణించారని అనుకున్నారని చైనా వైద్య అధికారుల్ని పేర్కొంటూ జపాన్ విదేశాంగశాఖ తెలిపింది. కరోనా వైరస్ వల్ల మరణించిన మొదటి జపానీయుడని వెల్లడించింది.

జపాన్ నౌకలోని భారతీయులకు కరోనా సోకలేదు

న్యూఢిల్లీ : జపాన్‌లోని యోకోహోమా వద్ద డైమండ్ ప్రిన్సెస్ నౌకలో కరోనా వైరస్ భయంతో మొత్తం ప్రయాణికులు, సిబ్బంది కలిపి 3700 మంది వైద్య పరిశీలనలో కొన్ని రోజులు ఉంచారు. వీరిలో 138 మంది భారతీయులు కాగా, వీరిలో ఆరుగురు ప్రయాణికులని, 132 మంది నౌక సిబ్బంది ఉన్నారు. అయితే నౌకలో ఉన్న వారిలో ఇంతవరకు 63 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ 63 మందిలో భారతీయులు ఎవరూ లేక పోవడం గమనార్హం. ఈ నౌక ఆపరేటర్ ఈమేరకు నౌక గురించి వివరిస్తూ శనివారం జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు జపాన్ తీరానికి చేరుకుందని, సాధారణ ఆపరేషన్ల కోసమే అక్కడ మరో 24 గంటల సాటు ఉంటుందని చెప్పారు.

కొత్త కరోనా కేసులు లేవు :ఆరోగ్యశాఖ వెల్లడి

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై భారత ప్రభుత్వం గట్టి నిఘా ఉంచింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే విమానప్రయాణికులకు పకడ్బందీగా వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఇంతవరకు దేశంలోని 21 ఎయిర్‌పోర్ట్‌ల్లో 1,275 విమానాల్లో వచ్చిన 1,39,539 మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు జరిపినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఇంతవరకు కేరళలో మూడు కరోనా కేసుల్ని ధ్రువీకరించారు. చైనాలోని వుహాన్ యూనివర్శిటీలో చదువుతున్న ఈ ముగ్గురు కేరళవాసులు ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు. వారు తమకు తాముగా ఆస్పత్రికి వచ్చారు. వారిని పరీక్షించగా కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది.

చైనా నుంచి స్వదేశానికి కేరళ విద్యార్థులు

కోచి : ప్రాణాంతకమైన కరోనా వ్యాధి వ్యాపించడంతో చైనాలోని హుబెయి ప్రావిన్స్‌లో చిక్కుకుపోయిన 15 మంది కేరళ విద్యార్థులు కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. వారికి కరోనా అంటువ్యాధికి సం బంధించిన ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. విద్యార్థులు కున్మింగ్ ఎయిర్‌పోర్టు నుంచి బ్యాంకాక్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఎయిర్ ఆసియా విమానంలో కొచ్చిన్ వచ్చారు. విద్యార్థులు ప్రయాణించిన విమానం శుక్రవారం రాత్రి 11 గంటలకు కోచి చేరింది. విమానం నుంచి దిగగానే వారిని అయిదు స్టెరిలైజ్‌డ్ అంబులెన్స్‌లలో సరాసరి కలమాస్సరీ మెడికల్ కాలేజి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారిని ప్రత్యేకవార్డులో అడ్మిట్ చేసుకున్నారని అధికారులు చెప్పారు. విద్యార్థుల బంధువులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు కానీ, వారిని కలుసుకోనివ్వలేదు.

First American and Japanese deaths due to coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News