Sunday, April 28, 2024

బిఆర్ఎస్ ‘ఘర్ వాపసీ’

- Advertisement -
- Advertisement -

కారెక్కుతున్న తెలంగాణ ఉద్యమ నేతలు
కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని భావిస్తున్న నాటి ఉద్యమకారులు
బిఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు చేతులు కలుపుతున్న కీలక నేతలు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి వివిధ కారణాలతో గులాబీ పార్టీలకు దూరమైన ఉద్యమనేతలందరూ మళ్లీ కారెత్తుతున్నారు. 2001లో తెలంగాణ రాస్ట్ర సమితి పేరిట ఉద్యమ పార్టీగా ఏర్పాటైన రోజుల్లో క్రియాశీలకంగా పని చేసిన చాలా మంది నేతలు వివిధ కారణాలతో పార్టీని వీడిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, జిట్టా బాలకృష్ణారెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్, ఏపూరి సోమన్న వంటి నేతలు మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొందరు, అంతకుముందు మరికొందరు వివిధ కారణాలతో పార్టీని వీడారు. ఎన్నికల్లో టికెట్లు రాని కారణంగానో, ఇతర పదవులు లభించలేదన్నఅలకతోని కొంతమంది కాంగ్రెస్, బిజెపిల్లో చేరగా, మరికొందరు సొంత పార్టీలను స్థాపించారు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ తొమ్మిదిన్నర పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసిన ఉద్యమనేతలంతా మళ్లీ కారెక్కుతున్నారు. ప్రధాన నాయకులే కాకుండా జిల్లా స్థాయిల్లో పలువురు టిఆర్‌ఎస్ మాజీ నేతలంతా ఇపుడున్న కాంగ్రెస్, బిజెపి తదితర పార్టీలను వీడి తిరిగి సొంత గూటికి చేరుతున్నారు.

ఉద్యమనేతలను అక్కున చేర్చుకుంటున్న గులాబీ పార్టీ
వివిధ కారణాలతో బిఆర్‌ఎస్‌ను వీడిన తెలంగాణ ఉద్యమ కాలం నాటి నాయకులను ఆ పార్టీ నాయకత్వం సాదరంగా ఆహ్వానం పలుకుతూ అక్కున చేర్చుకుంటుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న కష్టకాలంలో తమతో కలిసి నడిచి కష్టసుఖాలలో పాలుపంచుకున్న నాయకులను గులాబీ పార్టీ రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుంది. ఇలా ఇప్పటికే పలువురు నాయకులు సొంత గూటికి చేరారు. తాము ఆశించిన పదవులు దక్కకపోవడం, వారు కొనసాగుతున్న పార్టీల్లో కోరుకున్న గుర్తింపు లేకపోవడం, పార్టీ మారినా అనామకంగా మిగిలిపోయే ముప్పు ఏర్పడడంతో పాటు, తమ అనుచరుల ఒత్తిడి మేరకు ఉద్యమ నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఎన్ని రోజులు గడిచిన ఉద్యమకాలంలో అప్పటి టిఆర్‌ఎస్ పార్టీతో కలిసి చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు గుర్తు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని విశ్వసిస్తూ సొంతగూటికి చేరుతున్నారు.

గులాబీ గూటికి చేరిన కీలక నేతలు
జిట్టా బాలకృష్ణారెడ్డి : అప్పటి టిఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి 2009లో భువనగిరి టికెట్ ఆశించారు. రాజకీయ పార్టీలతో పొత్తుల కారణంగా టిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఆయనకు భువనగిరి టికెట్ లభించలేదు. తనకు టికెట్ రాకపోవడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. వరసగా 2009, 2014, 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్, బిజెపి సహా వివిధ పార్టీలలో చేరడంతో సొంతంగా యువ తెలంగాణ పార్టీ పేరిట రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. చివరకు ఆ పార్టీని బిజెపిలో విలీనం చేసి ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇటీవల బిజెపి పార్టీ రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరారు. వివిధ పార్టీలలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న జిట్టా బాలకృష్ణారెడ్డి చివరకు గులాబీ పార్టీనే తెలంగాణను శ్రీరామరక్ష అని భావించి 14 ఏళ్ళ తర్వాత తిరిగి గులాబీ కండువా కప్పుకున్నారు.
డాక్టర్ చెరుకు సుధాకర్ : తెలంగాణ ఉద్యమంలో పిడి యాక్టు కింద తొలి కేసు నమోదైన ఉద్యమ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్. 2014 ఎన్నికల సమయంలో నకిరేకల్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, గులాబీ అధినేత తీసుకున్న నిర్ణయాలకు నిరసగా పార్టీని వీడారు. ఆ ఎన్నికల్లో బిజెపి బి ఫారంపై తన భార్య లక్ష్మిని నకిరేకల్‌లో పోటీకి పెట్టినా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బిజెపి నుంచి బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ ఇంటి పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ తరపున వివిధ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పట్టభద్రుల ఎంఎల్‌సి నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లోనూ పోటీచేసి ఓటమి పాలయ్యారు. కొద్ది నెలల కిందటే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అక్కడి నాయకులతో పొసగక, ఆయన సరైన గుర్తింపు దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో టికెట్ అమ్ముకునే సంస్కృతిని సహించలేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్, మరో మంత్రి హరీశ్‌రావుల సమక్షంలో చెరుకు సుధాకర్ గులాబీ కండువా కప్పుకున్నారు.
ఏపూరి సోమన్న : తెలంగాణ ఉద్యమంలో గాయకుడుగా ఊరూరా తిరిగి ఆట పాటలతో హోరెత్తించిన ఏపూరి సోమన్న అన్ని పార్టీలు తిరిగి చివరకు గులాబీ గూటికి చేరారు. 2014లో తొలి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలోనే ఆయనకు అవకాశం కల్పించినా, పార్టీకి దూరమయ్యారు. కొన్నాళ్లు కాంగ్రెస్‌లో పనిచేసిన ఆయన వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీలో చేరి కీలకంగా పనిచేశారు. వివిధ పార్టీలలో పనిచేసిన ఆయన తెలంగాణలో సిఎం కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆకర్షితిడై సొంత గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభల్లో కెసిఆర్, కెటిఆర్ పర్యటనల్లో ఆటపాటలతో ఉర్రూతలూగిస్తున్నారు.
దాసోజు శ్రవణ్ : ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్థాపించిన పిఆర్‌పి నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి. మొదటి నుంచి పార్టీ అధినేత కెసిఆర్‌కు సన్నిహితుడు. కానీ, తాను కోరుకున్న ఎంఎల్‌ఎ స్థానం దక్కలేదన్న ఆలకతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కొన్ని నెలలు పనిచేశారు. టిపిసిసి చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ కారణాలతో కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఆయన ఎఐసిసి అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మరో జాతీయ పార్టీ బిజెపిలో చేరారు. అక్కడి పని విధానం, బయట నుంచి వచ్చే నాయకులకు కనీస ప్రాధాన్యం లేకవడం వంటి అవమానాలు భరించలేక కొన్ని నెలలకే బిజెపిని కూడా వీడి తిరిగి సొంత గూడు బిఆర్‌ఎస్‌లో చేరారు. తొలి నుంచి కలిసి నడిచిన ఉద్యమ నాయకుడు కావడంతో పార్టీ నాయకత్వం కూడా ఆయనను గవర్నర్ కోటాలో ఎంఎల్‌సిగా ఎంపిక చేసినా గవర్నర్ ఆ నిర్ణయాన్ని ఆమోదించలేదు. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ బిఆర్‌ఎస్ హైదరాబాద్ అధ్యక్షుడితో పాటు కీలక నేతగా కొనసాగుతున్నారు.
స్వామి గౌడ్ : బిఆర్‌ఎస్ మీద అలిగి బయటకు వెళ్లిన వారికి ఇతర పార్టీల్లో ఎలాంటి పదవులు దక్కలేదు. తెలంగాణ శాసనమండలి తొలి చైర్మన్‌గా అవకాశం దక్కిన టిఎన్‌జిఒ మాజీ అధ్యక్షుడు స్వామి గౌడ్ వివిధ కారణాలతో బిఆర్‌ఎస్‌కు దూరమై బిజెపిలో చేరారు. కానీ, అక్కడ ఎక్కువ కాలం కొనసాగలేక పోయారు. దీంతో కొద్ది నెలల కిందట ఆయన తిరిగి బిఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News