Sunday, June 9, 2024

సగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

సగర హక్కుల పోరాట సమితి డిమాండ్
బిసి భవన్‌లో ఘనంగా భగీరథ జయంతోత్సవాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిల అభ్యున్నతికి కులాల వారిగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సగర(ఉప్పర) జాతి అభివృద్ధికి కూడా సగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సగర హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. మంగళవారం బిసి భవన్‌లో భగీరథ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ సగర ఫెడరేషన్‌ను కార్పొరేషన్ గా మార్చి రూ. 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలని, ప్రతి సగర కుటుంబానికి 20 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

సగరులను బిసి డి గ్రూపు నుండి ఎ గ్రూపుకు మార్చాలని ఈ సందర్భంగా సగర ఉప్పర హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నీరడి భూపేష్ సాగర్, బిసి జాతీయ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, విజయేంద్ర సాగర్ డిమాండ్ చేశారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 లక్షలకు పైగా సగరులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా వెనకబడి ఉన్నారని, కనీసం ఒక ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి కూడా లేరని అందుకు సగరులను బిసి- డి గ్రూపు నుండి బిసి- ఎ గ్రూపుకు మార్చాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్య రిజర్వేషన్ల పరంగా లభించి వారి అభ్యున్నతికి దోహదం పడుతుందని ఆయనన్నారు. సగరులు సంచార జాతులుగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలలో సగరులను ఎస్‌సిలుగా గుర్తిస్తున్నారని, జమ్మూ కశ్మీర్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం, కర్ణాటకలలో సగరులను బిసి- ఎ గ్రూపుగా పరిగణిస్తున్నారని కృష్ణయ్య తెలిపారు.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో మాత్రమే బిసి- డి గ్రూపుగా గుర్తిస్తున్నారన్నారు. కావున వెంటనే ఈ విషయమై తగు విచారణ జరిపి గ్రూపు మార్పుకు దోహదం చేయాలని డిమాండ్ చేశారు. సగర ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా మార్చి వెంటనే రూ.500 కోట్లు కేటాయించి కార్పొరేషన్‌కు చైర్మన్, డైరెక్టర్లుగా సగరులను నియమించాలని, భగీరథ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని, జనాభా దామాషా ప్రకారం సగరులకు రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సగరులను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, భద్రాచలం దేవస్థానానికి పాలకమండలి నియమించి ఛైర్మన్ గా సగరులనే నియమించాలని కోరారు. ఈ కార్యక్రమలో నీరడి భూపేష్ సాగర్, బిసి జాతీయ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, విజయేంద్ర సాగర్, హనుమంతు సాగర్, పార్థసారథి సాగర్, కోలా జనార్ధన్, నందా గోపాల్, అనంతయ్య, జయంతి, ఉదయ్ నేత, నిఖిల్, హేమంత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News