Sunday, April 28, 2024

బీహార్‌లో పోలీసు రాజ్యం నడుస్తోందా?

- Advertisement -
- Advertisement -

SC outrage on Bihar govt over van driver arrest without FIR

ఎఫ్‌ఐఆర్ కూడా లేకుండా వ్యాన్ డ్రైవర్‌ను 35 రోజులు నిర్బంధించడంపై ఆగ్రహం
రూ.5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్న హైకోర్టు తీర్పు సరైనదే
రాష్ట్రప్రభుత్వం పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ: బీహార్‌లో పోలీసు రాజ్యం నడుస్తున్నట్లుగా ఉందని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక పాల వ్యాన్ డ్రైవర్‌ను కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయకుండా 35 రోజలుపాటు అక్రమంగా నిర్బంధించినందుకు ఆ డ్రైవర్‌కు రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీహార్ ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి కారణం లేకుండా ఒక పాల వ్యాన్ డ్రైవర్‌ను నిర్బంధించిన వాస్తవాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకొంటూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఆ డ్రైవర్‌కు ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని పాట్నా హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 22న తీర్పు ఇచ్చింది. దీనిపై బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు తీర్పుపై బీహార్ సర్కార్ అపీలు చేయకుండా ఉంటే బాగుండేదని కూడా న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎంఆర్‌షాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.

ఈ కేసులో తప్పు చేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకొంటోందని బీహార్ ప్రభుత్వం తరఫు న్యాయవాది దేవశీష్ భరూకా చెప్పారు. డ్రైవర్‌కు రూ.5 లక్షలు చెల్లించాల్సిన అవసరం లేదనేదే తన పాయింట్ అని ఆయన అన్నారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ, ‘ డ్రైవర్‌లాంటి ఒక సామాన్యుడు స్వేచ్ఛ కోల్పోవడం , ఓ సంపన్నుడు స్వేచ్ఛ కోల్పోవడం రెండూ ఒకటే’ అని వ్యాఖ్యానించింది. హైకోర్టుకు డిఐజి సమర్పించిన నివేదికలోనే డ్రైవర్‌ను ఎలాంటి కారణాలు లేకుండా, చివరికి ఎఫ్‌ఐఆర్‌కూడా నమోదు చేయకుండా అక్రమ నిర్బఃదంలో ఉంచారని స్పష్టంగా తెలుస్తోందని, దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందా? అని ప్రశ్నించింది. రూ.5 లక్షల పరిహారం సరైన నిర్ణయమేనని బెంచ్ అంటూ రాష్ట్రప్రభుత్వం పిటిషన్‌ను కొట్టివేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News