Sunday, April 28, 2024

ప్రైవసీ పాలసీని అంగీకరించాలని ఎవరినీ ఒత్తిడి చేయం

- Advertisement -
- Advertisement -

WhatsApp tells Delhi HC on new privacy policy

ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్

న్యూఢిల్లీ: ప్రభుత్వం డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని ఆమోదించే వరకు వివాదాస్పదంగా మారిన తమ నూతన ప్రైవసీ విధానాన్ని అంగీకరించాలని వినియోగదారులను బలవంత పెట్టబోమని, అంతేకాకుండా ఆ షరతులను అంగీకరించని వారికి తమ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవడంలో ఎలాంటి పరిమితులు విధించబోమని వాట్సాప్ శుక్రవారం ఢిల్లీ కోర్టుకు తెలియజేసింది. ‘కొత్త పాలసీ అమలును నిలిపివేయడానికి మేము స్వచ్ఛందంగా అంగీకరించాం. అంతేకాదు దీన్ని అంగీకరించాలని జనాన్ని ఒత్తిడి చేయం’ అని వాట్సాప్ తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు చెప్పారు. రాబోయే వారాల్లో వాట్సాప్ పనితీరును పరిమితం చేయబోం. అంతేకాదు, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు వినియోగదారులకు తెలియజేస్తూ ఉంటాం. కొత్త పిడిపి చట్టం అమలులోకి వచ్చేవరకు ఈ వైఖరిని కొనసాగిస్తాం’ అని కోర్టు విచారణ అనంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో వాట్సాప్ పేర్కొంది.

వినియోగదారులకు సంబంధించిన డేటాను పంచుకోవడానికి వీలు కల్పిస్తూ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరిలోనే ఈ కొత్త విధానం అమలులోకి రావలసి ఉంది. అయితే దీనిపై వినియోగదారులనుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా( సిసిఐ) దీనిపై దర్యాప్తు చేపట్టి ఈ విధానానికి సంబంధించి మరింత సమాచారం అందజేయాలని కోరుతూ వాట్సాప్‌కు, దాని మాతృసంస ్థఅయిన ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీ చేసింది. దీన్ని ఆ సంస్థలు ఢిల్లీ హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. కాగా సిసిఐ నోటీసులను నిలిపివేయడానికి ఇంతకు ముందు విచారణలో ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా సిసిఐ నోటీసులు జారీ చేయడం పరిధిని అతిక్రమించడమేనని వాట్సాప్ వాదిస్తోంది. కాగా సిసిఐ నోటీసులపై సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని హరీష్ సాల్వే కోరడంతో కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News