Wednesday, April 24, 2024

స్పీకర్ల మౌనంపై సుప్రీం బాణం

- Advertisement -
- Advertisement -

sampadakiyam ఫిరాయింపు ఫిర్యాదులపై స్పీకర్ల నిరంకుశ వైఖరిని ప్రశ్నిస్తూ వారి రాజకీయ పక్షపాతాన్ని ఆక్షేపిస్తూ ఈ విషయంలో నిర్ణయాధికారాన్ని ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించాలని సుప్రీంకోర్టు పార్లమెంటుకు సూచించడం ఎంతైనా సంతోషించవలసిన పరిణామం. ఒక పార్టీ నుంచి ఎన్నికయ్యే శాసన సభ్యులు ప్రలోభాలకు లోబడి మరో పార్టీలోకి దుమికే జాడ్యం దేశ రాజకీయాల్లో తరచూ అప్రజాస్వామిక పరిణామాలకు దారి తీస్తున్నది. ఎన్నికల ద్వారా ప్రజలిచ్చిన తీర్పుకి విరుద్ధమైన రీతిలో ప్రభుత్వాలు ఏర్పడడానికి, కూలిపోడానికి దోహదపడుతున్నది. అలా మారిన వారు ఆ పార్టీకి గల మొత్తం శాసన సభ్యుల సంఖ్యలో మూడింట రెండొంతుల మందికి తక్కువగా ఉంటే ఫిర్యాదు మేరకు వారి సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారాన్ని స్పీకర్‌కు ఫిరాయింపుల నిరోధక చట్టం కట్టబెడుతున్నది.

అదే సమయంలో ఆ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోడానికి స్పీకర్‌కు చట్టం ఎటువంటి గడువూ విధించలేదు. పాలక పక్షాల చెప్పు చేతల్లో , కనుసన్నల్లో నడుచుకునే స్పీకర్లు దీనిని వాడుకొని ఫిరాయింపుల ఫిర్యాదులపై తిష్ట వేసుకొని కూర్చుంటున్నారు. ఎప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటున్నారు. దీనితో ఫిరాయింపుదార్ల పంట పండుతున్నది. స్పీకర్లు నిర్ణయం తీసుకోకుండా ఉన్నంత కాలం కోర్టుల జోక్యానికి చట్టం అవకాశం ఇవ్వడం లేదు. నిర్ణయం తీసుకున్న తర్వాతనే దాని మంచి చెడ్డలను నిర్ధారించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. కర్నాటకలో కాంగ్రెస్, జెడి(ఎస్)లకు చెందిన 15 మంది శాసన సభ్యులు రాజీనామాలు చేసి ఆ రెండు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం మైనారిటీలో పడిపోడానికి తద్వారా అది కూలిపోడానికి దోహదపడిన కేసులో వారి శాసన సభ్యత్వాలను రద్దు చేసిన స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా విమర్శకు గురయింది.

వారి సభ్యత్వాల రద్దు సరైన చర్యేనని ధ్రువీకరించిన ధర్మాసనం అవే స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని వారికి కల్పించడం ఫిరాయింపు దుర్మార్గానికిచ్చిన నజరానాగా ప్రతిఫలించింది. ఇలా అంతిమాధికారం ఎవరికి కట్టబెట్టినా అది దుర్వినియోగం కాకుండా ఆపగలిగే వారుండరనే నైరాశ్యం స్థిరపడిపోయింది. దేశాన్ని పాలించిన, పాలిస్తున్న పార్టీలే చట్టంలోని కంతలను ఉపయోగించుకొని ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వాలను కూల్చడం, కాపాడుకోడం చేస్తున్న నేపథ్యమే స్పీకర్ల శీలహీనతకు ప్రధాన హేతువవుతున్నది. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ప్రత్యామ్నాయ నిర్ణాయక వ్యవస్థను ప్రతిపాదించిన తాజా కేసు మణిపూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఒకరు బిజెపిలో చేరి దాని ప్రభుత్వంలో మంత్రి పదవి పొంది న ఉదంతానికి సంబంధించినది.

అతడి శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ దాఖలయిన పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేయడాన్ని ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ ధర్మాసనం స్పందిస్తూ నిర్ణయం తీసుకోడానికి స్పీకర్‌కు నాలుగు వారాల గడువిచ్చింది. అప్పటికీ స్పీకర్ మౌనం కొనసాగిస్తే తిరిగి తమను ఆశ్రయించాలని కాంగ్రెస్ ఎంఎల్‌ఎలకు సూచించింది. అదే సమయంలో స్పీకర్లు పార్టీ సభ్యులుగా వ్యవహరిస్తున్నందున ఫిరాయింపుల ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు స్వతంత్ర సంస్థను నెలకొల్పాలని పార్లమెంటుకు ధర్మాసనం సలహా ఇచ్చింది. పార్లమెంటులోనూ పాలక పక్షానిదే పై చేయిగా ఉంటుంది కాబట్టి అది మెజారిటీ నిర్ణయంతో నెలకొల్పే స్వతంత్ర సంస్థ లేదా ట్రిబ్యునల్ కూడా దాని చెప్పుచేతల్లోనే వ్యవహరించేదిగా ఉంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

వాస్తవానికి ఫిరాయింపుదారుల శాసన సభ్యత్వాల రద్దు విషయంలో ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి కట్టబెట్టాలని లా కమిషన్ అభిప్రాయపడింది. రాజ్యాంగం పని తీరును సమీక్షించడానికి ఏర్పాటయిన జాతీయ కమిషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఫిరాయింపుదార్ల సభ్యత్వ రద్దు అధికారాన్ని స్పీకర్లకో, ఇతర సభాధ్యక్షులకో ఇవ్వడానికి బదులు ఎన్నికల కమిషన్‌కు దఖలు పర్చడమే శ్రేయస్కరమని భావించింది.

ఎన్నికల సంఘం తదితర రాజ్యాంగ సంస్థల నిష్పాక్షికతను కూడా హరించే కొండ చిలువలు దేశాధికార పీఠాన్ని అధిష్ఠిస్తున్న వర్తమానంలో అటువంటి ఏర్పాటు వల్ల కూడా ప్రయోజనం కలగకపోవచ్చు. అంతిమంగా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఒక్కరైనా, ఎందరైనా తమను ప్రజలు ఏ పార్టీ ద్వారా ఎన్నుకుంటారో ఆ పార్టీని వీడిన వెంటనే సభ్యత్వాలు కోల్పోయేటట్టు ఆ సభ ఉనికిలో ఉన్నంత వరకు తిరిగి పోటీ చేసే అర్హతకు దూరమయ్యేటట్టు ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణ తీసుకు రావడం వల్లనే కొంతైనా మేలు కలుగుతుంది, ఆయారాం గయారాంల ఆటకట్టవుతుంది.

 

SC wants disqualification powers of Speakers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News