Friday, May 3, 2024

రుణమాఫీ అమలుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్

- Advertisement -
- Advertisement -

debt

 

వడ్డీతో కలిపి రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ
కుటుంబం యూనిట్‌గా మాఫీ.. రేషన్ కార్డు ఆధారంగా వర్గీకరణ
బంగారం తాకట్టు పంట రుణాలకు మాఫీ లేదు
ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకూ ఇవ్వకూడదని యోచన

మన తెలంగాణ/హైదరాబాద్ : వడ్డీతో పాటు రూ. ఒక లక్ష వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సాప్ట్‌వేర్‌ను రూపొందించాలని నిర్ణయించారు. దీనిలోనే అర్హులైన రైతుల వివరాలన్నింటిని ఆప్‌డేట్ చేసి విడతల వారీగా రుణమాఫీ చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన వ్యవసాయ, ఆర్థిక, బ్యాంకుల ఉన్నతాధికారులు విధివిధానాలు మార్గదర్శకాలపై చర్చించారు. త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. డిసెంబర్ 11, 2018 తరువాత పంట రుణాలకు బ్యాంకుల్లో చెల్లించి క్లియర్ చేసుకున్న రైతులకు కూడా మాఫీ సొమ్ము ఇవ్వనున్నారు. వీరి సేవింగ్స్ ఖాతాలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేస్తారు. వారికి ప్రోత్సాహకం కింద కొంత మొత్తం ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉండగా తాకట్టుపై తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీ వర్తింపజేయరాదని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

దీంతో బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తించదని అధికారులు చెబుతున్నారు. అలాగే పంట రుణాలు 2016 నుంచి తీసుకోవాలా లేక 2017 నుంచి అనేదానిపై నిర్ణయం తీసుకోలేదు. 2014 రుణమాఫీ పథకం 2017 వరకు అమలు చేశారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రూ. ఒక లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించిన విషయం విధితమే. డిసెంబర్ 11, 2018 కటాఫ్ తేదీ కూడా ప్రకటించారు. ఇప్పటికే బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కూడా కేటాయించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, టై అప్ రుణాలకు మాఫీ వర్తింపజేయకూడదని భావిస్తున్నారు.

వీరంతా ఆర్థికంగా ఉన్నవారే కావడం, అదే సమయంలో క్షేత్రస్థాయిలో సాగు పనులు ఇతర రైతులు చూసుకుంటుడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఆధార్ కార్డును తప్పనిసరి చేయనున్నారు. 2014లో రుణమాఫీ చేసినపుడు అనుసరించిన విధానాలే 90 శాతం వరకు ఇప్పుడు అమలు చేయనున్నారు. రూ.25 వేల లోపు పంట రుణం ఉంటే వన్‌టైమ్ కింద, రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు అయితే రెండు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో, రూ.50 వేల నుంచి రూ. ఒక లక్ష అయితే నాలుగు విడతల్లో చెల్లిస్తారు. అర్హుల గుర్తింపునకు ముసాయిదా విధివిధానాలు, మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. వీటిపై చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తారు.

* రైతులు తీసుకున్న పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని లక్ష రూపాయలకు మించకుండా డిసెంబర్ 11, 2018 కటాఫ్ తేదీతో అర్హులైన వారందరికీ పంట రుణ మాఫీ వర్తింపజేస్తారు.
* మొదటి దశలో తర్వాత అన్ని బ్యాంకుల బ్రాంచీల నుంచి వచ్చిన పూర్తి సమాచారాన్ని ప్రత్యేక సాప్ట్‌వేర్‌లో నమోదు చేస్తారు. దీనిని జాయింట్ మండల కమిటీ సమీక్షిస్తుంది. ఇక్కడ రైతులు వాణిజ్య బ్యాంకుల నుంచి, సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో సరిపోల్చుతారు. ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్‌లో ఎంత మొత్తం రుణం తీసుకున్నప్పటికీ లక్ష మేరకు రుణం తీసుకున్న కుటుంబం జాబితా రూపొందిస్తారు.

* రైతుల అన్ని వివరాలు ఆధార్, క్యాస్ట్, ఫోన్ నెంబర్, ఏ బ్యాంకులో, ఎప్పుడు లోన్ తీసుకున్నారనే వివరాలు సేకరిస్తారు.
* కుటుంబం అంటే భార్య, భర్త వారి మీద ఆధారపడి ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం రేషన్ కార్డు వివరాలను ఆధారం చేసుకుంటారు. ఎఇఒ, విఆర్‌ఒ, పంచాయతీ సెక్రటరీల సాయం తీసుకుంటారు.
* ప్రైవేట్ వడ్డీవ్యాపారుల దగ్గర తీసుకున్న వారికి వర్తించదు. * రైతులకు ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని అప్పు ఖాతాలున్నప్పటికీ ఒక కుటుంబానికి ఒక లక్ష రూపాయల మేరకు రుణం మాఫీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు మూడంచెల్లో అర్హులైన రైతులను ఎంపిక చేస్తారు. కుటుంబం అంటే రైతు భార్య లేదా భర్త ఆధారపడిన పిల్లలుగా పేర్కొంటున్నారు.
* స్వల్పకాలిక పంట రుణాలు 12 నెలల చెల్లింపు కాల వ్యవధి ఉన్న వాటికే మాఫీ వర్తిస్తుంది, ఉద్యాన పంటల కోసం పొందిన స్వల్పకాల రుణాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.

* లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న వ్యవసాయదారుల జాబితాను రూపొందించేందుకు ముందుగా గ్రామస్థాయిలో బ్యాంకుల బ్రాంచ్‌ల వారీగా రైతులు, వారు తీసుకున్న రుణాల వివరాలను క్రోడీకరిస్తారు. దీనిని మండల స్థాయిలో జాయింట్ మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సరి చూసుకుంటారు. మండల తహశీల్దారు కూడా ఈ జాబితాలను పరిశీలిస్తారు. బ్యాంకు అధికారుల ఆమోద ముద్రతో ఈ జాబితాను లీడ్ బ్యాంకు మేనేజర్ జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. జిల్లాల్లో బ్యాంకుల వారీగా, రైతుల వారీగా అర్హులైన వారి జాబితాను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి పంపిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తిరిగి బ్యాంకుల వారీగా రైతుల వారీగా అర్హులైన రైతులకు చెల్లించాల్సిన మొత్తం వివరాలను, ప్రభుత్వం మంజూరు చేయాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తుంది. ఈ మేరకు లక్ష లోపు రుణాల మాఫీకి అర్హులైన వారి జాబితాను పంచాయతీ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై ప్రకటిస్తారు.

Separate software for execution of debt
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News