Sunday, July 21, 2024

అంగన్‌వాడీలో లబ్ధిదారులకు అందని సేవలు

- Advertisement -
- Advertisement -

వేతనాలు చెల్లించకపోవడంతో వేళకు రాని సిబ్బంది
పౌష్టికాహారం అందక చిన్నారులు, గర్భిణీల ఆవేదన
మూడు నెలల నుంచి జీతాలు రాక టీచర్లు , హెల్పర్ల ఇబ్బందులు
ఈనెలాఖరులోగా ఇవ్వకుంటే సమ్మె బాట పడుతామని అంగన్‌వాడీలు హెచ్చరిక

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలు పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహరాన్ని అందిస్తూ పేదల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఉమ్మడి పాలనలో ఆదరణ నోచుకోని కేంద్రాలు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత సెంటర్లకు భవనాలు, అంగన్‌వాడీ టీచర్లకు మూడు పర్యాయాలు వేతనాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. రాష్ట్రంలో డిసెంబర్‌లో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో అంగన్‌వాడీ సిబ్బంది కష్టాలు ఎదుర్కొంటున్నారు.

మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపడంలేదు. అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకొచ్చే పరిస్థితి దాపురించిందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు సిబ్బంది సమయానికి రాకుండా అరకొర సేవలు అందిస్తుండటంతో లబ్దిదారులైన గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహరం అందడం లేదు. వారికి రోజు వారీగా వంట చేసి ఆహారం ఇవ్వాలి. జీతాలు ఇప్పటివరకు చెల్లించకపోతే నెలంతా చేతి నుంచి డబ్బులు పెట్టి వంట ఏవిధంగా చేస్తామని పేర్కొంటున్నారు. తాము జీవించడం కష్టంగా మారడంతో కేంద్రాలకు వచ్చే వారికి సరుకులు కొనుగోలు చేసిన తేవాలని అంటున్నారు. ప్రభుత్వం గుడ్లు, మంచినూనె, పాలు సరఫరా చేసి గ్యాస్, కూరగాయలు, వాటిలో మసాలు సొంత డబ్బులు పెట్టలేమని చెబుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు 35700 ఉండగా 58,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా వీరిలో అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ. 13, 600, మిని అంగన్‌వాడీ టీచర్ల, హెల్పర్లకు రూ. 7600లు చెల్లిస్తున్నారు. ఇందులో ఇప్పటికి 12,221 అంగన్ వాడీ కేంద్రాలు ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతాయి. వీటిలో 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు సూక్ష్మ పోషకాలతో ఫోర్టిపైడ్ చేయబడిన రోస్ట్ గోధుమలు, వేయించిన శనగపప్పు, పాలపొడి, చెక్కర, ఆయిల్, మెత్తగా పొడి చేసిన బాలామృతం పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్క లబ్ధిదారునకు, ఒక్క రోజుకి 100 గ్రాముల చొప్పున 25 రోజులకు ప్రతినెల మొదటి రోజున రెండున్నర కిలోల ప్యాక్ పంపిణీ, వారానికి 4 చొప్పున నెలకి 16 గ్రుడ్లు అందిస్తున్నారు.

3 సంవత్సరముల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అంగన్ వాడీ కేంద్రంలో ప్రతిరోజు (75 గ్రా బియ్యం, 15గ్రా పప్పు, 5గ్రా ఆయిల్, 25గ్రా కూరగాయలతో) వేడి భోజనం వడ్డిస్తున్నారు. అదే విధంగా 20 గ్రాముల స్నాక్స్ ప్రతి రోజు వారానికి 4 గ్రుడ్లు చొప్పున నెలకి 16 గ్రుడ్లు ఇస్తున్నట్లు అంగన్‌వాడీ టీచర్లు వెల్లడించారు. గర్బిణీలు, బాలింతలకు ఒక సంపూర్ణ భోజనం 150 గ్రాముల అన్నం, 30 గ్రాముల పప్పు, 16గ్రాముల ఆయిల్, 50 గ్రాముల ఆకుకూరలతో పాటు 200మి,లీ పాలు, ఒక గ్రుడ్డు ప్రతిరోజు అంగన్ వాడీ కేంద్రం వద్ద పంపిణీ చేశాయి. వేతనాలు రాకపోవడంతో ఈనెల మొదటి వారం నుంచి సిబ్బంది సమయం దొరికినప్పుడల్లా వస్తుండటంతో ఈ సరకులు లబ్దిదారులకు పంపిణీ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో పక్క కేంద్రాల్లో పనిచేస్తే సిబ్బంది భవిష్యత్తులో అంగన్‌వాడీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుందని పలువురు అంగన్‌వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా తమ వేతనాలు బ్యాంకు ఖాతాలో జమ చేయకుంటే సమ్మెబాట పడతామని హెచ్చరిస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు తమ సమస్యల పట్ల చొరవ చూపి వేతనాలు వచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News