Sunday, April 28, 2024

తొలిసారి ఓటర్లు రికార్డు సంఖ్యలో ఓట్లు వేయాలి

- Advertisement -
- Advertisement -

వారి తొలి వోటు దేశం కోసం కావాలి
యువజనులకు ప్రధాని మోడీ పిలుపు
‘మన్ కీ బాత్’కు 3 నెలలు విరామం
లోక్‌సభ ఎన్నికల దృష్టా మార్చి నుంచి ప్రసారం ఉండదు

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్టా రాజకీయ నైతిక విలువల ప్రకారం తన నెలవారీ ‘మన్ కీ బాత్’ వచ్చే మూడు నెలలు ప్రసారం కాదని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రకటించారు. నెలవారీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 110వ ఎపిసోడ్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ తొలిసారి వోటర్లు ఎన్నికలలో రికార్డు సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. వారి తొలి వోటు దేశం కోసమే పడాలని ఆయన సూచించారు. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్/ మేలో జరగవచ్చునని భావిస్తున్నందున 2019లో వలె ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసిసి) మార్చిలో అమలులోకి వచ్చే అవకాశం ఉందని మోడీ చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ను వచ్చే నెల ప్రకటించే అవకాశం ఉన్నది.

అధికార పార్టీకి ప్రచారానికి లేదా రాజకీయ ప్రయోజనానికి అవకాశం ఇచ్చే పనికి అధికారిక కార్యక్రమాలకు గాని, ప్రభుత్వ నిధులతో సాగే వేదికలకు గానీ వినియోగించరాదని ఎన్నికల కమిషన్ ఎంసిసి ప్రభుత్వాలను కోరుతుంటుంది. ‘మన్ కీ బాత్’ 110 ఎపిసోడ్‌లలో ప్రభుత్వం క్రీనీడ కూడా పడకుండా చూడడం ఈ కార్యక్రమం సాధించిన భారీ విజయం అని ప్రధాని పేర్కొన్నారు. దేశ సంఘటిత బలం, విజయాలకు ఈ కార్యక్రమం ప్రసారాన్ని అంకితం చేసినట్లు మోడీ తెలియజేశారు. ‘ఇది ప్రజల, వారి కోసం, వారికి ఉద్దేశించిన కార్యక్రమం’ అని ఆయన చెప్పారు.

‘అయితే, రాజకీయ నైతిక విలువలను అనుసరిస్తూ ‘మన్ కీ బాత్’ను లోక్‌సభ ఎన్నికల సమయంలో వచ్చే మూడు నెలల పాటు ప్రసారం చేయడం లేదు’ అని ప్రధాని తెలిపారు. ‘మనం వచ్చేసారి భేటీ అయినప్పుడు అది ‘మన్ కీ బాత్’కు 111వ ఎపిసోడ్ అవుతుంది’ అని మోడీ చెప్పారు. ఆ సంఖ్య ఒక సాధారణ సంఖ్య మాత్రమేనని, దానికన్నా మెరుగైనది ఏమి ఉండగలదని ఆయన అన్నారు. కాగా, ఎన్నికలలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోగలమన్న దృఢ విశ్వాసాన్ని ప్రధాని మోడీ తరచుగా వ్యక్తం చేస్తున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తొలిసారి వోటు వేయబోతున్న ప్రజలు రికార్డు సంఖ్యలో తమ వోట్లు వేయాలని కూడా మోడీ విజ్ఞప్తి చేశారు. 18వ లోక్‌సభ వారి ఆకాంక్షలకు ప్రతీక అవుతుందని ఆయన సూచించారు. యువత రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటుండడమే కాకుండా ఈ కాలంలో చర్చల గురించి చైతన్యవంతులు కూడా కావాలని ప్రధాని కోరారు. ‘మీ తొలి వోటు దేశం కోసం కావాలన్నది మీరు దృష్టిలో పెట్టుకోవాలి’ అని మోడీ పిలుపు ఇచ్చారు.

తొలి సారి వోటు వేసేవారికి స్ఫూర్తిదాయకం కావలసిందిగా ప్రభావశీలురను, ఇతర ప్రముఖ వ్యక్తులను మోడీ కోరారు. ‘మేరా పెహలా వోట్ దేశ్ కే లియే’ (నా తొలి వోటు దేశం కోసమే’ అనే ప్రచార కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ ప్రారంభించిందని ప్రధాని వెల్లడిస్తూ, తొలిసారి వోటర్లు గరిష్ఠ సంఖ్యలో తమ వోటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. యువ వోటర్లు ఎంత ఎక్కువగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే దాని ప్రభావం అంత ఎక్కువగా దేశంపై పడతాయని ప్రధాని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News