Thursday, June 13, 2024

సిఎఎపై షహీన్‌బాగ్ నిరసన ఓ కుట్ర

- Advertisement -
- Advertisement -

CAA

 

సామరస్యానికి హానిచేసే రాజకీయ పన్నాగం
ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక షహీన్‌బాగ్, జామియా మిలియా ఆందోళనలపై ప్రధాని మోడీ ఆగ్రహం
కాంగ్రెస్, ఆప్‌లపై తీవ్ర విమర్శ

న్యూఢిల్లీ: సీలంపూర్, జామియా నగర్, షహీన్ బాగ్‌లలో జరుగుతున్న ‘కా’ వ్యతిరేక ఆందోళనలు కాకతాళీయం కావని, రాజకీయ దురుద్దేశంతో, దేశంలో సామరస్య వాతావరణానికి హాని కలిగించేందుకు కావాలని చేస్తున్న కుట్ర అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. ఆందోళనలకు ఆప్, కాంగ్రెస్ ఆజ్యం పోస్తున్నాయని ఆరోపించారు. ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల సందర్భంగా తూర్పు ఢిల్లీలో కర్కర్‌డూమాలో ఒక ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ ప్రజల్ని రెచ్చగొడుతూ, వారికి తప్పుడు సమాచారమిస్తున్నాయని మండిపడ్డారు. ‘వారు రాజ్యాంగం, త్రివర్ణ పతాకం గురించి ప్రధానంగా చెబుతుంటారు. కానీ అసలు కుట్ర నుంచి తప్పుదారి పట్టించడమే వారి లక్షం’ అని మోడీ దుయ్యబట్టారు.

షహీన్‌బాగ్‌లో ఆందోళన గురించి ప్రస్తావిస్తూ ఆయన నొయిడా నుంచి వచ్చి వెళ్లేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘సాధారణంగా ఢిల్లీ ప్రజలు ఏమీ అన రు. అయితే, ఓటు బ్యాంకు రాజకీయాలను చూస్తూ వారు ఆగ్రహిస్తున్నారు. కుట్రలో తమ బలం పెరుగుతున్నట్టు అనిపిస్తే వారు మరో రోడ్డును లేదా వీధిని అడ్డగిస్తారు. ఢిల్లీలో అలాంటి అరాచకాలకు అవకాశమివ్వలేం. ఢిల్లీ ప్రజలు మాత్రమే దాన్ని అడ్డుకోగలరు. బిజెపికి వేసే ప్రతి ఓటు ఈ పని చేయగలదు’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘సీలంపూర్, జామియా (నగర్) లేదా షహీన్ బాగ్ కావచ్చు…ఏదైతేనేం…గత చాలా రోజులుగా సిఎఎ కి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అవి యాదృచ్ఛికంగానే జరుగుతున్నాయంటారా? కానే కాదు. అలా ఓ ప్రయోగం చేస్తున్నారు. జాతి సామరస్యానికి హాని కలిగించాలనే రాజకీయ దురుద్దేశం ఈ ఆందోళనల వెనక ఉంది’ అని తీవ్రస్వరంతో అన్నారు.

ప్రచారంలో కీలకం ‘షహీన్‌బాగ్’
బిజెపి ఎన్నికల ప్రచారంలో షహీన్ బాగ్ ఆందోళనల అంశం కీలకంగా మారింది. ప్రతి ర్యాలీలో పార్టీ అగ్రనాయకత్వం పాల్గొంటోంది. మోడీ కాంగ్రెస్‌ను కూడా వదిలిపెట్టలేదు. బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నించినవారు ‘టుకడే టుకడే’ నినాదాలు చేసేవారిని కాపాడుతున్నారని విమర్శించారు. సైన్యాన్ని, సర్జికల్ దాడుల్ని ప్రశ్నించిన ఆప్ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ను కూడా మోడీ ఆక్షేపించారు. 2022 నాటికల్లా అన్ని పేద కుటుంబాలకూ బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టిస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఒకవేళ కేజ్రీవాల్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటిలాగే ప్రజా సంక్షేమ పథకాల్ని ఆపేస్తుందన్నారు. దశాబ్దాలుగా దేశాన్ని పీడిస్తున్న సమస్యలకు తన ప్రభుత్వం పరిష్కారాలను ఆలోచిస్తోందని చెప్పారు. అక్రమ కాలనీలను క్రమబద్ధీకరిస్తామని ఢిల్లీ ప్రజలకిచ్చిన హామీని బిజెపి నిలబెట్టుకున్నదని ఆయన ఉదహరించారు. ద్వేష రాజకీయాలతో భారతదేశాన్ని ఏకీకృతం చేయలేమన్నారు.

Shaheenbaugh protest against CAA is conspiracy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News