Thursday, July 18, 2024

నేడే దాయాదుల సమరం

- Advertisement -
- Advertisement -

India vs Pakistan

 

అండర్ 19 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్-పాక్ ఢీ
రెండు దేశాల్లో నరాలు తెగే ఉత్కంఠ

పోచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు మరో సారి అంతర్జాతీయ వేదికగా తలపడనున్నాయి. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్19 ప్రపంచ కప్ వన్డే టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో ఈ రెండు జట్లు మరోసారి ఢీకొననున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ అయిన భారత్ ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ టోర్నమెంటు విజేతగా నిలిచింది. ఈ సారి కూడా విజయం సాధిస్తే అయిదు సార్లు కప్ గెలిచి చరిత్ర సృష్టిస్తుంది. రెండేళ్ల క్రితం పృథ్వీషా నేతృత్వంలోని భారత యువ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి విజేతగా నిలిచింది. మరోసారి కప్‌ను సొంతం చేసుకునే దిశగా అప్రతిహత విజయాలతో దూసుకు వెళ్తోంది. ఇప్పటివరకు అజేయంగా నిలిచిన ఈ జట్టు పాకిస్థాన్‌ను ఓడిస్తే కప్‌కు అడుగు దూరంలో నిలుస్తుంది.

మరో వైపు పాకిస్థాన్ కూడా ఈ టోర్నమెంటులో ఇప్పటివరకు ఓటమిని ఎదుర్కోలేదు. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా బలమైన ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టగా పాకిస్థాన్ అఫ్ఘానిస్థాన్‌పై విజయం సాధించి భారత్‌ను ఢీకొనేందుకు సిద్ధమైంది. భారత్‌పాక్‌ల మధ్య పోటీ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ రెండు దేశాల్లోను ఉంటుందనేది కాదనే సత్యం. అంతేకాదు, ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లో రాణించిన ఆటగాళ్లు ఒక్కసారిగా హీరోలుగా మారిపోతారు కూడా. అది హాకీ అయినా, క్రికెట్ అయినా ఒకటే. పాకిస్థాన్ కెప్టెన్ రోహౌల్ నజీర్ మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. అయితే ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే సాధారణంగానే హై ఓల్టేజ్ మ్యాచ్‌గానే ఉంటుందని, ఇది ఇరు జట్ల ఆటగాళ్లకు పరీక్షేనని అతను అంటున్నాడు. ఇది నిజంగా హైప్రెజర్ మ్యాచ్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని కూడా రేకెత్తించే మ్యాచ్. అయితే మేమము మా నార్మల్ గేమ్ ఆడతాం.

భారత్‌తో మ్యాచ్‌లో మా ఆటగాళ్లు రాణిస్తారని ఆశిస్తున్నా’ అని అఫ్ఘాన్‌తో మ్యాచ్ అనంతరం పాక్ ఓపెనర్ మహమ్మద్ హురాయిరా వ్యాఖ్యానించాడు.2018లో జరిగిన అండర్19 ప్రపంచకప్ ఫైనల్లో కూడా ఈ రెండు జట్లు తలపడ్డాయి. అప్పుడు భారత్ 203 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది. ఇటీవల గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో కూడా పాక్‌పై భారత్ విజయం సాధించింది. అయితే ఇరు జట్ల మధ్య జరిగే ఏ మ్యాచ్‌లో కూడా గత చరిత్ర లెక్కలోకి రాదు. ఆ రోజు ఏ జట్టు రాణిస్తుందో దానికే విజయం సొంతమవుతుంది. మంగళవారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ప్రియమ్ గిల్ నేతృత్వంలోని టీమిండియాఅన్ని రంగాల్లోను రాణించాల్సి ఉంటుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారత జట్టు బ్యాటింగ్‌కు వెన్నుదన్నుగా ఉన్నాడు.

ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో అతను మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ మాత్రం అంతగా రాణించలేదనే చెప్పాలి. ఆస్ట్రేలియాతో జరిగిన క్యార్టర్ ఫైనల్లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆదుకోకపోయి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. అతర్య అంకోలేకర్, లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లు ఏడో వికెట్‌కు 61 పరుగులు జోడించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే ఆ తర్వాత బౌలర్లు రాణించడంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధించగలిగింది.

అయితే బౌలింగ్ విభాగంలో బలంగా ఉన్న పాక్ భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసరనుందన్న మాట నిజం. ఫాస్ట్ బౌలర్లు అబ్బాద్స్ అఫ్రిది, మొహమ్మద్ అమిర్ ఖాన్, తాహిర్ హుస్సేన్‌లను ఎదుర్కోవడం భారత యువ బ్యాట్స్‌మెన్‌కు పరీక్షేనని చెప్పాలి. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారిగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన హురైరా 64పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ మరో సారి నరాలు తెగే ఉత్కంఠకు వేదిక కావడంలో సందేహం లేదు.

India vs Pakistan in under-19 World Cup semifinals
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News