Sunday, April 28, 2024

ఎల్‌ఐసి ప్రై‘వేటు’ను అడ్డుకుందాం

- Advertisement -
- Advertisement -

భారతీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించగా, ప్రై‘వేట్‘ పరం కాకుండా కాపాడుకునేందుకు లియాపి (లైప్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) యుద్ధానికి సిద్ధమవుతోంది. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చడమే గాక వ్యవసాయభివృద్ధికి, ప్రాజెక్టుల నిర్మాణానికి, పంచవర్ష ప్రణాళికకు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు, ఇలా అనేక రకాలుగా లక్షలాది కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఎల్‌ఐసి సంస్థ ప్రైవేటీకరణపై లియాపి తీవ్రంగా మండిపడుతోంది. ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడి ఎల్‌ఐసి ప్రై‘వేట్‘ పరం కాకుండా పోరాడుదామని పిలుపునిస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల ఏజెంట్ల సమాఖ్య ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ఏజెంట్లతో పాటు పాలసీదారులను, ప్రజలను మద్దతు తెలుపాల్సిందిగా కోరుతోంది. కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తూ ప్రతి ఏటా దేశంలోనే అగ్రగామిగా లాభాల్లో నడిచిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసిని బహుళజాతి కంపెనీలతో కుమ్మక్కై వారికి కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎల్.ఐ.సి ప్రైవేటీకరణను నిలిపి వేయాలని లియాపి నాయకులు కోరుతున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఎల్.ఐ.సి ప్రైవేట్‌పరం కాకుండా చూడాలని లియాపి విజ్ఞప్తి చేస్తోంది. లేని పక్షంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లక్షలాది మందితో ధర్నా నిర్వహిస్తామని లియాపి హెచ్చరిస్తోంది.

ఎంతటి త్యాగలకైనా సిద్ధపడుతాం, ఎల్‌ఐసిని పరిరక్షించుకుంటాం పోరాడితే పోయేది ఏమీ లేదు సమయాభావం తప్ప… అంటూ లియాపి ముందుకు సాగుతోంది. భారతీయ జీవిత బీమా సంస్థ ప్రభుత్వ రంగ సంస్థగా 1956 సెప్టెంబర్ 1న ఆవిర్భవించింది. కేవలం రూ. ఐదు కోట్ల ప్రభుత్వ పెట్టుబడితో ప్రారంభమైన ఎల్‌ఐసి దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఎదిగింది. ప్రజల నమ్మకమే పునాదిగా ముందుకు సాగుతున్న సంస్థ ఒక్క ఎల్‌ఐసి మాత్రమే.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బీమా సవరణ బిల్లుపై భారతీయ జీవిత బీమా సంస్థలోని ఎల్‌ఐసిలో భారత ప్రభుత్వం మూలధనాన్ని రూ. ఐదు (5) కోట్ల నుంచి వంద (100) కోట్లకు పెంచడం జరిగింది. ఇలా పెంచడం వలన పాలసీదారుల బోనస్ 95 శాతం నుండి 90 శాతం కుదించడం జరిగింది. 1956 ఎల్‌ఐసి చట్టం ప్రకారం జీవిత బీమా సంస్థకు అన్ని ఖర్చులు పోయి మొత్తంలో 90 శాతం పాలసీదారులకు 5 శాతం కేంద్రానికి చెల్లించాల్సి ఉండగా, చట్ట సవరణ ద్వారా ఈ నిష్పత్తి 90:10 గా మార్చడం జరిగింది. అంటే ఈ చట్ట సవరణ ద్వారా పాలసీదారులకు 5శాతం నష్టం జరిగింది. ప్రభుత్వానికేమో మరో 5 శాతం లాభం చేకూరింది.

భారత దేశ ఆర్థిక రంగంలోనే అగ్రగామిగా నిలుస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలను సమకూరుస్తూ ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడంలో ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ పోషించిన పాత్ర అత్యంత కీలకం. నియమ, నిబంధనలతో సంపూర్ణ ప్రగతిపథంలో సంస్థను నడిపే దిశగా 11 లక్షల 48 వేల 811 మంది ఏజెంట్ మిత్రులు పటిష్ట వ్యాపారం చేస్తూ బీమా రంగంలో ఎల్‌ఐసిని అగ్రస్థానంలో నిలుపుతున్నారు. ఎల్‌ఐసి 15 వేల మంది డెవలప్‌మెంట్ ఆఫీసర్‌తో, లక్షమంది ఉద్యోగస్థులతో సుమారు 40 కోట్ల పాలసీదారులకు నిత్యం సేవలందిస్తూ భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా భారతీయ జీవిత బీమా సంస్థ చెరగని ముద్ర వేసుకున్నది.

1956 సెప్టెంబర్ 1న రూ. ఐదు కోట్ల ప్రభుత్వ మూలధనంతో ప్రారంభించబడి గత సంవత్సరం 10 వేల కోట్లకు పైగా వివిధ రూపాలలో కేంద్ర ప్రభుత్వానికి ఈ ఎల్‌ఐసి పన్నులు చెల్లించింది. ఈనాడు 2612 కోట్ల రూపాయలను డివిడెండ్ రూపంలో కేంద్రానికి చెల్లించి, 32 లక్షల కోట్ల నికర ఆస్తులను ఎల్‌ఐసి ఆర్జించ గలిగిందంటే అతిశయోక్తి లేదు. భారతీయ జీవిత బీమా సంస్థ కేవలం లాభార్జనే ధ్యేయంగా పనిచేయడం లేదు. ఇది భారత జాతికి అంకితం చేయబడినటువంటి ప్రజా సంస్థ. జాతి సంక్షేమానికై ప్రతి దేశవాసులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల రూపకల్పనకు వేలాది కోట్ల రూపాయలను డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేసి జాతి ప్రయోజనానికి అంకితభావంతో తన వంతు పాత్రను శక్తిమేరకు పోషిస్తోన్నది ఈ భారతీయ జీవిత బీమా సంస్థ. అంతేకాకుండా ప్రైవేటు పెట్టుబడిదారులు, బడా వ్యాపారవేత్తలు బ్యాంకులకు, ఇతర సంస్థలకు శఠగోపం పెట్టి లూటీ చేసిన ప్రజాధనాన్ని పరాయి దేశాలకు సాగనంపుకొని సంస్థలను దివాలా తీయించినప్పుడు ఆ సంస్థలకు అభయ హస్తాన్ని అందించి, ఆపద్బాంధవుడిగా నిలిచి వారికి సహాయం అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీయకుండా కవచకుండలాలుగా నిలిచి కాపాడుతోంది.

రైల్వేలకు, వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు లక్షల కోట్ల పెట్టుబడులను సమకూర్చి ప్రజా పంపిణీ వ్యవస్థకు పెద్దపీట వేసి దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టు కొమ్మగా ఎల్‌ఐసి నిలిచింది. అత్యంత అవినీతి గల మన దేశంలో అవినీతి రహిత సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఒక ఎల్‌ఐసి మాత్రమే అని చెప్పక తప్పదు. ఎల్‌ఐసి కుటుంబ సభ్యులుగా ఏజెంట్లు, పాలసీదారులు, ప్రజలు అందుకు గర్వించాలి. అటువంటి ఈ ఎల్‌ఐసిని నిర్వీర్యం చేయాలని 1990 నుండి అనేక కమిటీల పేరుతో ఎల్‌ఐసి ని భ్రష్టు పట్టించాలనే చెడు దృష్టితో, ఆర్థిక సంస్కరణలతో, వివిధ కమిటీల పేరుతో అనేక దండయాత్రలు ఎల్‌ఐసి మీద మొదలయ్యాయి. అది ఏజెంట్ నాయకులు ఉద్యోగస్థులు ఆ ముప్పును ఎప్పటికప్పుడు పసిగట్టి, ఉద్యమాలను, పోరాటాలను పార్లమెంటు వరకు తీసుకెళ్లి వారి కుటిల యత్నాలను తిప్పికొట్టి కాపాడుకోగలిగారు. ఇటువంటి విపత్కర సమయములో కూడా కొత్తగా ఉద్యోగుల నియామకాలను, కొత్త శాఖలను, కొత్త డివిజన్లను, ఆఖరుకు కొత్త జోన్లను, ఏర్పాటు చేసుకోగలిగారు. అనేక కారణాలతో ఏజెంట్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో కేంద్రం ముందుకు సాగుతున్నది. వీటినన్నింటిని కాదని ఏజెంట్లు, వికాస అధికారులు, సిబ్బంది అనేక విజయాలు సాధిస్తూ వస్తున్నారు.

అదే విజయ పరంపరను కొనసాగించాలంటే, ప్రజల ఆస్తిని కాపాడుకోవాలంటే నేడు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసి లిస్టింగ్’ చేయాలి, అటు పిమ్మట ప్రైవేటుపరం చేయాలి అనే బిల్లుకు వ్యతిరేకంగా అందరూ సన్నద్ధం కావాలి. ఆర్థిక శాఖామాత్యులు నిర్మల సీతారామన్ మాటలు ఎల్‌ఐసిని మరో బిఎస్‌ఎన్‌ఎల్ లా చేయాలని పూనుకున్నట్లు అర్థమవుతోందని లియాపి ఆరోపిస్తోంది. ఇలాంటి తరుణంలో తోటి ఏజెంట్లు, వికాస్ అధికారులు, కార్మికులు, అధికారులు, సిబ్బంది, పాలసీదారులు, ప్రజా సంఘాలు, ప్రజలను అందరినీ కలుపుకొని సంఘటితమై పోరాడుదామని, ఎల్‌ఐసి మనుగడకే ప్రమాదకరమైన, భయానక పరిస్థితుల్లో అందరం ఒకే పంథాలో ఉండి ‘ఎల్‌ఐసి’ సంస్థను రక్షించుకునేందుకు సంఘటితమై ‘ఎల్‌ఐసి రక్షణే మన ధ్యేయం’గా ఐక్యం కావాలని లియాపి పిలుపునిస్తోంది. ఏది ఏమైనా కుల, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ భారత ప్రభుత్వరంగ సంస్థ భారతీయ జీవిత భీమా సంస్థను ప్రై‘వేట్’పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ ‘లియాపి‘ విజయం సాధించాలని ఆశిద్దాం.

 

చుక్క గంగారెడ్డి
99481 33539

 

Protest against LIC Privatisation by Indians
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News