Saturday, April 20, 2024

హెచ్‌ఎండిఎలో… ఇంజినీర్లు ఏరీ..?

- Advertisement -
- Advertisement -

HMDA

 

కార్యరూపంలోకి భారీ పథకాలు
ప్రతిపాదనలోనూ మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు
ఏప్రిల్‌లో ముగియనున్న మెంబర్ ఇంజినీర్ పదవి

హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులో భారీ పథకాలను చేపడుతోన్న హెచ్‌ఎండిఎలో ఇంజనీర్ల కొరత స్పష్టంగా ఉన్నది. విశ్వనగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అథారిటీకి 2003లో ఇంజనీరింగ్ పోస్టులు మంజూరయ్యాయి. అనంతరం ఇప్పటి వరకు పోస్టులు మంజూరు కావడం ప్రక్కనపెడితే ఖాళీ పోస్టులను భర్తీ కావడంలేదు. ప్రస్తుతం అథారిటీలో మెంబర్ ఇంజనీర్ కూడా వచ్చే ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందనున్నారు.

సంస్థ చేపట్టాల్సిన పథకాలు మెండుగానే ఉన్నాయి. అందులో డబుల్ డెక్కర్‌గా నిర్మితమయ్యే మెట్రో, రోడ్డు మార్గాలుండే రెండు ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్ సర్వీసు రోడ్ల అభివృద్ధి, గ్రిడ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, గండిపేట సుందరీకరణ, ఇంటర్ సిటీ బస్ టెర్మినల్స్, ట్రక్ టెర్మినల్స్, రెండు మల్లీమోడల టెర్మినల్స్, రెండు నవీనమైన టౌన్‌షిప్‌లు, హైదరాబాద్ శివారులో 16 ఉద్యానవనాల అభివృద్ధి, 20 చెరువుల సుందరీకరణ, భూ సమీకరణ పథకం ద్వారా 2500 ఎకరాల్లో భారీలేఅవుట్లు, కోకాపేట్‌లో ప్రత్యేక టౌన్‌షిప్ వంటి వేల కోట్ల పథకాలు ఒక్కొక్కటిగా కార్యరూపంలోకి వస్తున్నాయి.

ప్రతిపాదనలో హిమాయత్ సాగర్ నుంచి గౌరవెల్లి వరకు మూసీనదిలోనే ప్రత్యేకంగా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం, కొత్వాల్‌గూడలో నైట్ సఫారీ, శంషాబాద్ విమానాశ్రయానికి చేరువగా మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు వంటివి ఉన్నాయి. కానీ, వీటిని పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారులు సరిపడాలేరు. అథారిటీలో మెంబర్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి ఈ ఏప్రిల్ మాసంతో పదవీ విరమణ పొందనున్నారు. ఎస్‌ఇలు, ఇఇలు, డిఇలు వంటి అధికారగనం కొరత స్పష్టంగా ఉన్నది.

కార్యరూపంలోని పథకాలు
రూ. 400 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభమైన బాలానగర్ ఫ్లైఓవర్, బాటసింగారంలో 40 ఎకరాల్లో ట్రాక్‌పార్కు, రూ. 30 కోట్లతో పివి ఎక్స్‌ప్రెస్ వేకు రెండు ఎగువ దిగువ ర్యాంపులు, రూ. 39 కోట్లతో కిష్టారెడ్డిపేట వద్ద లింక్ రోడ్డు, రూ. 100 కోట్లతో గండిపేట సుందరీకరణ, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ(మేడ్చెల్) వరకు నిర్మించతలపెట్టిన డబుల్‌డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి కన్సల్టెన్సీ బాధ్యతలు ఆర్‌వి సంస్థకు బాధ్యతలను అప్పగించనున్నారు. రూ. 99 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ శివారులో 16 ఉద్యానవనాల అభివృద్ధి, రూ. 135 కోట్ల వ్యయంతో 20 చెరువుల సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గండిపేట సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. హుస్సేన్‌సాగర్ చెంతన 10 ఎకరాల్లో రూ. 18 కోట్లతో లేక్ వ్యూ ఫ్రంట్ పార్కు నిర్మాణం, నగరంలో 5 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం పనులు సాగుతున్నాయి.

ప్రతిపాదితాలు
హైదరాబాద్ మహానగరం శివారులో మియాపూర్, ఐడిఏ బొల్లారం, శంషాబాద్, హయత్‌నగర్‌లలో 5 ఇంటర్‌సిటీ బస్ టెర్మినల్స్, 2 ట్రక్ టెర్మినల్స్, చర్లపల్లి, ఈదులనాగులపల్లిలో మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టుల ఏర్పాటు, తెల్లాపూర్‌లో టెక్నోసిటీ, శ్రీనగర్‌కాలనీ(మహేశ్వరం)లో డిస్కవరీ టౌన్‌షిప్‌లు, ఘట్‌కేసర్ మండల పరిధిలోని కొర్రెంల, ప్రతాపసింగారం, శంకర్‌పల్లిలో మోకిల, కుత్బుల్లాపూర్‌లో దుండిగల్ గ్రామాల్లో భూ సమీకరణ పథకం, కొత్వాల్‌గూడలోని 85 ఎకరాల్లో సింగపూర్ తరహాలో నైట్ సఫారీ పార్కు వంటి భారీ పథకాలు ప్రతిపాదనలో ఉన్నాయి. అయితే, అథారిటీలో ఇంజనీరింగ్ విభాగం బలోపేతం చేయాల్సిన పరిస్థితులున్నాయి. గత 2018లోనే హెచ్‌ఎండిఎ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి పదవీ విరమణ పొందారు. అయితే, పథకాల నేపథ్యంలో ఆయన పదవిని పొడిగించారు. ఆయన పదవీ కాలం ఈ ఏప్రిల్ మాసంతో ముగియనున్నది. అయితే, పథకాలను పరిగణలోకి తీసుకుని కనీసంగా 4 ఎస్‌ఇలు, 10 ఇఇలు అవసరమని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Shortage of Engineers at HMDA
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News