Saturday, April 20, 2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశిఫలాలు

- Advertisement -
- Advertisement -

మేషం….

ఈ రాశి వారికి ఆదాయం –5 వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–1.
గురుడు జన్మరాశి సంచారం సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అయితే కొన్ని ఒత్తిడులు, ఆరోగ్యసమస్యలు ఎదురైనా ప్రభావం స్వల్పంగానే ఉంటాయి. ఇక అక్టోబర్వరకు గురు, రాహువుల కలయిక వల్ల కలిగే గురు ఛండాలయోగం వల్ల మానసికంగా అశాంతి. కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. మీ నైపుణ్యం ,సమర్థతతో గౌరవాన్ని సంపాదించుకునే అవకాశాన్ని గురుడు ఇస్తాడు. ఇక శని లాభస్థానంలో సంచారం అన్ని విధాలా శుభదాయకం.
అలాగే, దుబారా ఖర్చులను తగ్గించుకుని పొదుపు మార్గాలు పాటిస్తారు.

అక్టోబర్30 వరకు జన్మరాహువు, సప్తమంలో కేతువు కారణంగా మానసిక ఆందోళన. భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు. వీరు పరస్పర అవగాహనతో మసలుకోవడం మంచిది. తదుపరి పరిస్థితులు చక్కబడతాయి. ఇక ఆదాయానికి ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. స్థిరాస్తులను సమకూర్చుకోవడంలో సఫలమవుతారు. వారసత్వ ఆస్తులు కొన్ని లభించవచ్చు. పెండింగ్లో ఉన్న ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులు ఎన్నడూ లేని విధంగా ఫలితాలు పొందబోతున్నారు. సమాజసేవ, ధార్మిక కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం అధికంగా ఉంటుంది.
ఏ పనినైనా పూర్తి చేసే వరకూ విశ్రాంతి తీసుకోరు. అంత పట్టుదలతో ఉంటారు. మీ ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. మహిళలకు అన్నింటా విజయాలు చేకూరతాయి.

వ్యాపారస్తులుు లాభాల స్థాయిని పెంచుకునేందుకు తగిన ప్రణాళికతో ముదుకు సాగుతారు. ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. వీరి పనితీరుని అధికారులు ప్రశంసిస్తారు. కొందరికి పదోన్నతులు కలుగవచ్చు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. అనూహ్యంగా పెట్టుబడులు సమకూరతాయి. పారిశ్రామికవేత్తలు మునుపటి కంటే మరింత చురుగ్గా అడుగులు వేస్తారు. రాజకీయవేత్తలకు కొత్త హోదాలు, పదవులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. కళాకారులు చేజారిన అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. వీరికి కొన్ని అవార్డులు, పురస్కారాలు రావచ్చు. జూన్17 నుండి శని వక్రగతిలో సంచారం వల్ల నాలుగు నెలలు కొన్ని అనుకోని సంఘటనలు, ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసం పెంచుకుని మసలుకోండి. ద్వితీయార్ధంలో వివాహయత్నాలు కలసివస్తాయి. చైత్రం, వైశాఖం, ఆషాఢం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

పరిహారాలు… నిత్యం హనుమాన్ఛాలీసా, ఆదిత్య హృదయం పఠనం చేయాలి.

వృషభం…
–వీరికి ఆదాయం –14, వ్యయం–11, రాజపూజ్యం 5, అవమానం–1.
వీరికి ఈ ఏడాది సమస్థాయిలో ఫలితాలు ఉంటాయి. గురుడు ఏప్రిల్21 వరకు గురుడు అత్యంత శుభుడు. తదుపరి సాధారణ ఫలితాలు ఇస్తాడు. శని మొత్తమంతా శుభఫలితాలు ఇస్తాడు. రాహుకేతువులు అక్టోబర్31వ తేదీ నుండి శుభదాయకమైనవిగా ఉంటాయి. ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని పునఃపరిశీలించుకోవలసి ఉంటుంది.
విలాసాలకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ మీకు అనుకూలంగా మారతాయి.
ద్వితీయార్ధంలో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

ఇంటి నిర్మాణాలు తిరిగి కొనసాగిస్తారు. అలాగే, పెద్ద వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ప్రయత్న లోపం లేకుండా విద్యార్థులు చేసే కృషి ఎంతో ఉపకరిస్తుంది. ఇతరుల పట్ల సామర స్యంగా మెలుగుతూ కార్యాలను చక్కదిద్దుకుంటూ వెళ్లడం ఉత్తమం. ప్రధమార్థంలో ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించి ఖర్చులకు సిద్ధపడాలి. అయితే క్రమేపీ స్వస్థత చేకూరుతుంది. కొందరికి విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు రావచ్చు. కళాకారులకు ఈ ఏడాది అద్భుతమైన అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులు తమ సంస్థల విస్తృతి కోసం మరింత కృషి చేస్తారు. పెట్టుబడులకు ఎటువంటి లోటు లేకుండా జరిగిపోతుంది. ఉద్యోగస్తులు తమపై పడిన భారాన్ని తగ్గించుకునేందుకు తాపత్రయపడతారు.

రాజకీయవేత్తలు, పారిశ్రామికరంగం వారి చిరకాల కోరిక నెరవేరవచ్చు. అయితే ప్రధమార్థంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వివాహాది శుభకార్యాలు ద్వితీయార్థంలో కలసివస్తాయి. వ్యవసాయదారులు మునుపటి కంటే లాభపడతారు. వైద్యులు, సాంకేతిక రంగంలోని వారిలో మరింత భరోసా ఏర్పడుతుంది. జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు కలిసివచ్చేవి. మిగతావి సామాన్యం. వీరు అక్టోబర్వరకూ రాహు, కేతువులకు జపాలు వంటి పరిహారాలు చేయాలి. అలాగే, దుర్గామాతకు ఎక్కువగా పూజాదికాలు నిర్వహించాలి.

మిథునం….
–వీరికి ఆదాయం –2, వ్యయం–11, రాజపూజ్యం–2 అవమానం–4.
వీరికి గ్రహాలన్నీ సంవత్సరమంతా అనుకూలమే. వీరు ఏ కార్యక్రమం చేపట్టినా వెనుదిరగకుండా విజయాలు సాధిస్తారు. ఆదాయం గతంకంటే మరింతగా మెరుగుపడుతుంది. రావలసిన బాకీలు చాలా వరకూ వసూలవుతాయి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మీపట్ల అసహనంగా ఉన్న వారు కూడా స్నేహహస్తం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలలో పెండింగ్లో ఉన్న ఒప్పందాలు ఖరారు చేసుకుంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహయత్నాలు ఫలించి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. తండ్రి తరఫు నుండి ధన, ఆస్తి లాభ సూచనలు ఉండవచ్చు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కే అవకాశం. ఒక వ్యక్తి ద్వారా మీకు లబ్ధి జరుగుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు ఢోకాలేదు. లాభాలు విశేషంగా అందుతాయి. ఉద్యోగాలలో మీపై ∙అభియోగాలు తొలగుతాయి. ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, సాంకేతికవర్గాల వారు విజయాలు సాధిస్తారు. పడిన శ్రమ వృథా కాదు. వైద్యులు, న్యాయవాదులు, పరిశోధకులకు శుభదాయకమే. కళాకారుల సుదీర్ఘ ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి. వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభదాయకమే. రాజకీయవర్గాలకు ద్వితీయార్ధంలో కొన్ని పదవులు వరించవచ్చు.
విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. కొద్దిపాటి రుగ్మతలు ఇబ్బంది కలిగించవచ్చు. అయితే వెనువెంటనే ఉపశమనం లభిస్తుంది.
చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్య మాసాలు విశేషంగా కలసివస్తాయి. మిగతావి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
వీరు ప్రతి శనివారం సుందరకాండ పారాయణ చేయడం మంచిది.

కర్కాటకం…
–వీరికి ఆదాయం –11 వ్యయం–8, రాజపూజ్యం–5 అవమానం–4.
ఈ రాశి వారిపై అష్టమశని ప్రభావం అధికంగా ఉంటుంది. కేవలం గురుబలమే వీరికి శ్రీరామరక్ష అని చెప్పవచ్చు. అలాగే, రాహు, కేతువులు కూడా సమపాళ్లలో ఫలితాలు ఇస్తారు. కొన్ని విషయాలలో భావోద్వేగాలకు లోనవుతారు. అయితే పుణ్యక్షేత్రాల సందర్శనంతో ఉపశమనం కలుగుతుంది. బంధువులు, కుటుంబసభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. అష్టమశని ఫలితంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉండాలి. అలాగే, ప్రతి కార్యక్రమంలోనూ మరింత జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా నష్టపోయే అవకాశాలున్నాయి. గురుబలం వల్ల ఆదాయానికి లోటు లేకుండా జీవితాన్ని నడిపిస్తారు.

అలాగే, శుభకార్యాలకు ఖర్చులు చేయాల్సి వస్తుంది. చర, స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలలో చురుకుదనం కనిపిస్తుంది. వ్యాపారస్తులు కొత్త సంస్థల ఏర్పాటులో ఆచితూచి వ్యవహరించాలి. బ్యాంకు రుణాలు వంటి వాటి వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు మరింత పనిభారంతో పాటు, పైస్థాయి వారి అజమాయిషీ పెరుగుతుంది. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా ముందుకు సాగితే అనుకున్న విజయాలు సాధించవచ్చు. రాజకీయనాయకులకు మొదట్లో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నా ద్వితీయార్థంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులు ఈ సంవత్సరం కొంతభిన్నమైన వైఖరితో అందరినీ ఆకట్టుకుంటారు. రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. అనుకున్న పెట్టుబడుల్లో కొంత జాప్యం తప్పదు. విద్యార్థులకు విద్యాకారకుడైన గురుడు అనుకూలస్థితి వీరికి ఉపకరిస్తుంది. న్యాయ, వైద్య, పరిశోధనారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు.చైత్రం, వైశాఖం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలిస్తాయి. మిగతావి సాధారణంగా ఉండవచ్చు. వీరు శనికి తైలాభిషేకం, జపాలు చేయించాలి. అలాగే, ఆంజనేయ స్వామిని విరివిగా పూజించడం మంచిది.

సింహం…
–వీరికి ఆదాయం –14, వ్యయం–2, రాజపూజ్యం–1 , అవమానం–7.
వీరు గురుబలం కలిగి ఉంటారు. ఇక శని,అక్టోబర్నుండి రాహు, కేతువులు అనుకూలించరు.ఆర్థికంగా ఉన్నతస్థితి పొందినా ఏదో ఖర్చు ఎదురవుతూనే ఉంటుంది.పోటీపరీక్షలలో అవలీలగా విజయం సాధిస్తారు.ఇతరులకు సలహాలు ఇచ్చే స్థాయికి చేరుకుని ఉత్సాహంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలు నిర్వహణపై సంబంధిత వ్యక్తులతో చర్చలు సాగిస్తారు. మీ శుభసంకల్పాలు నెరవేరే సమయం. అయితే కొంత శ్రమ తప్పకపోవచ్చు. ఇంటి నిర్మాణాలు ద్వితీయార్ధంలో కలసివస్తాయి.
అయితే శని ప్రభావం, అక్టోబర్నుండి రాహు, కేతువుల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు మరింత అప్రమత్తంగా మెలగాలి. భార్యాభర్తల మధ్య కలహాలు తీవ్రంగా మారి కొంత ఎడబాటు తప్పకపోవచ్చు.

మీతో సన్నిహితంగా మెలిగిన వారే ఇబ్బందులు పెట్టేందుకు యత్నిస్తారు. వ్యాపారులు ఎంత కష్టపడినా మీ అంచనాలకు తగినంత లాభాలు అందుకోలేరు. ఉద్యోగస్తులు విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, కర్తవ్యాలు నెరవేరుస్తూ ముందుకు సాగాలి. రాజకీయవేత్తలు, పారిశ్రామికవర్గాల వారు తమకు తామే సమస్యలు సృష్టించేకునే వీలుంది. తొందరపాటు వీడడం మంచిది. వైద్యులు, శాస్త్రవేత్తలు గుర్తింపు పొందినా ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటారు. కళాకారులకు పరీక్షాసమయం. వీరు తీసుకునే నిర్ణయాలపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కలసివస్తుంది. చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు సానుకూలం. మిగతావి సాధారణంగా ఉంటాయి. వీరు శనీశ్వరునికి పరిహారాలు. రాహుకేతువులకు అక్టోబర్31 నుండి పరిహారాలు చేయాలి.

కన్య…
–వీరికి ఆదాయం –2, వ్యయం–11 రాజపూజ్యం–4 అవమానం–7.
వీరికి శని మినహా గ్రహాలస్థితిగతులు అంతగా అనుకూలం కాదు. గురుడు ఏప్రిల్21 నుండి అష్టమస్థితి సంచారం, రాహువుతో కలయిక మరింత క్లిష్టంగా ఉండే అవకాశం. ఇక శని సంచారం శుభఫలితాలు ఇస్తుంది. మొత్తం మీద వీరు కొన్ని శుభాలు పొందినా అధికంగా ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుంది. నిరుద్యోగ యువతకు శుభపరిణామాలు. ఉద్యోగలాభం. ఆదాయపరంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నా ఏదో విధంగా అవసరాలు తీరతాయి. బంధువులు, స్నేహితుల మనోభావాలను గుర్తించి మసలుకోవడం అవసరం. ఒక పరిచయస్తుని ద్వారా అందిన సమాచారం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. బియ్యం మిల్లులు, ఫైనాన్స్రంగంలోని వారికి అనుకూల పరిస్థితులు.

ఇంటి నిర్మాణాల్లో జాప్యం లేకుండా పూర్తికి కృషి చేస్తారు. ఏప్రిల్– అక్టోబర్మధ్య కాలంలో అష్టమంలో గురుఛండాల యోగం వల్ల కీలక వ్యవహారాలలో తొందరలేకుండా ముందుకు సాగాలి. ఆరోగ్యంపై అత్యధిక శ్రద్ధ వహించడం మంచిది. ఉదరం, నరాల బలహీనత వంటి రుగ్మతలు బాధపెట్టవచ్చు. వ్యాపారస్తులు లాభాలు అందుకున్నా ఏదో ఒక వివాదం వెంటాడుతునే ఉంటుంది. భాగస్వాములతోనే విభేదాలు రావచ్చు. ఉద్యోగస్తులు విధుల పట్ల అప్రమత్తంగా మెలుగుతూ చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. వీరిపై నిఘా పెరిగే సూచనలు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవర్గాలు సమస్యలతోనే గడుపుతారు. కళాకారులు అవకాశాలు చేజేతులా పోగొట్టుకుంటారు. సాంకేతికరంగం, వైద్యులు, శాస్త్రవేత్తలకు కొంత అనుకూలంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు రెండు పంటలూ సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు శ్రమతో కొన్ని విజయాలు అందుకుంటారు. మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. జ్యేష్ఠం, ఆషాఢం, మార్గశిరం, పుష్యమాసం అనుకూలం. మిగతావి సాధారణంగా ఉంటాయి.
వీరు శని, గురుడు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం మంచిది.

తుల…
వీరికి ఆదాయం –14, వ్యయం–11, రాజపూజ్యం–7, అవమానం–7.
ఏప్రిల్21 నుండి గురుసంచారం, అక్టోబర్31 నుండి రాహువు సంచారం అనుకూలం. శని సంచారం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. చిత్రవిచిత్రమైన రీతిలో వ్యవహారాలు చక్కదిద్దుతారు. గురుబలం వల్ల అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఖ్యాతి, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. లౌక్యంతో మీ కార్యదక్షతను నిరూపిస్తారు. ఆర్థికంగా విశేషంగా అభివృద్ధి కనిపిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తీరి ఊరట చెందుతారు. ఉద్యోగార్ధులు ఉద్యోగాలు దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖరీదైన వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు. శనిసంచారం కొంత ప్రతికూలతగా ఉండవచ్చు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు రావచ్చు.

అవివాహితులకు వివాహయోగం. కొన్ని కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు కొత్త భాగస్వాములతో జతకడతారు. లాభనష్టాలు సమతూకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు విశేష గుర్తింపు లభిస్తుంది. వీరికి పదోన్నతులు లభించవచ్చు. పారిశ్రామిక, శాస్త్రవేత్తలకు శుభదాయకమైన కాలం. కళాకారులకు మరిన్ని అవకాశాలు అవలీలగా దక్కుతాయి. రాజకీయవేత్తలకు ప్రజాదరణ పెరుగుతుంది. వీరికి అనూహ్యమైన ఆహ్వానాలు రాగలవు. వ్యవసాయదారులు రెండుపంటలూ లాభపడతారు. ఆషాఢం, శ్రావణం, మార్గశిరం, మాఘమాసాలు సానుకూలమైనవి. మిగతావి సాధారణంగా ఉంటాయి.
వీరు శనీశ్వరునికి, రాహువునకు పరిహారాలు చేయించుకోవడం మంచిది.

వృశ్చికం…
–వీరికి ఆదాయం –5, వ్యయం–5, రాజపూజ్యం –3 అవమానం–3.
వీరికి అర్ధాష్టమ శని ప్రభావం మినహా, మిగతా గ్రహాలన్నీ అనుకూల ఫలితాలు ఇస్తాయి. గురుని శుభత్వం వల్ల ఆర్థికంగా విశేషంగా కలసివస్తుంది. సంతాన రీత్యా సౌఖ్యం, వారికి ఉద్యోగలాభాలు సంతోషం కలిగిస్తాయి. మీ నైపుణ్యతను పదిమందీ గుర్తించే సమయం. ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు మరింత పెరుగుతాయి. చర, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఎన్నడూ ఊహించని వారితో పరిచయాలు ఏర్పడతాయి.గృహం, వాహనాలు కొంటారు. రాహుకేతువుల ప్రభావం మిశ్రమ ఫలితాలు అందిస్తుంది.
ఇక అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.

చేసే పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య విషయాలలో అత్యంత జాగరూకత పాటించాలి. విద్యార్థులకు అవకాశాలు అసంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారస్తులు ప్రధమార్ధంలో అధిక లాభాలు, ద్వితీయార్థంలో మిశ్రమంగా ఉంటుంది. పెట్టుబడులకు ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగస్తులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నా బదిలీలు తప్పకపోవచ్చు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు సొంత ఆలోచనలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. కళాకారులు తమ ప్రతిభను చాటుకునే సమయం ఆసన్నమైంది. వ్యవసాయదారులు రెండుపంటలపై లాభాలు గడిస్తారు. వైద్య, శాస్త్రరంగాల వారు విశేష గుర్తింపుతో పాటు, ప్రతిభను చాటుకుంటారు.
శ్రావణం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు విశేషంగా కలిసివస్తాయి. మిగతావి మిశ్రమంగా ఉంటాయి.
వీరు శనీశ్వరునికి, రాహుకేతువులకు పరిహారాలు చేయించాలి.

ధనుస్సు…
–వీరికి ఆదాయం –8 వ్యయం–11, రాజపూజ్యం–6 , అవమానం–3 .
వీరికి అక్టోబర్31 నుండి అర్ధాష్టమ రాహుదోషం మినహా మిగతా గ్రహాలన్నీ అనుకూలం. వీరికి అన్ని విధాలా అభివృద్ధి ఉంటుంది. ఆర్ధికంగా విశేషంగా కలసివస్తుంది. ఎంతోకాలంగా ఒకరి వద్ద పెండింగ్లో ఉన్న సొమ్ము అందవచ్చు. విరివిగా దానధర్మాలు, విరాళాలు అందిస్తారు. సంతాన అభివృద్ధితో ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల తోడ్పాటుతో ఎటువంటి కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. శని సంచారం కూడా లాభిస్తుంది. కొత్త నిర్మాణాలు చేపట్టి చురుగ్గా సాగిస్తారు.
కుటుంబ విషయాలలో సమస్యలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. విద్యాసంస్థల నిర్వహాకులకు గతేడాది కంటే మరింత అనుకూలం. విద్యార్థులకు ఏ పరీక్షలోనైనా విజయమే సిద్ధిస్తుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిపిస్తారు.

ప్రధమార్ధంలో ఆశ్చర్యకరమైన ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. స్థిరాస్తులను వృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. వాహనాలు, నగలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు లావాదేవీల్లో దూసుకువెళతారు. ఉద్యోగస్తులు ఒత్తిడుల నుండి బయటపడతారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల చిరకాల నిరీక్షణ ఫలిస్తుంది. రాజకీయవేత్తలకు ఊహించని పదవీయోగం. ప్రజాదరణ పెరుగుతుంది. కళాకారులు అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యవసాయదారులకు రెండు పంటలలోనూ లాభాలు అందుతాయి. వైద్య, శాస్త్రరంగాల వారు తమ నిబద్ధతను చాటుకుంటారు. అక్టోబర్31 నుండి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే, తల్లి తరఫు వారితో వివాదాలు. మానసిక ఆందోళన. చైత్రం, వైశాఖం, భాద్రపదం, ఆశ్వయుజం, మాఘ మాసాలు సానుకూలం. మిగతావి సాధారణంగా ఉంటాయి.
వీరు చండీపారాయణ, రాహువునకు పరిహారాలు నిర్వహించడం మంచిది.

మకరం…
వీరికి ఆదాయం –11, వ్యయం–5, రాజపూజ్యం–2 , అవమానం–6.
వీరికి ఏప్రిల్21 నుండి అర్థాష్టమంలో గురుడు సంచారం. అలాగే, అక్టోబర్30 వరకు అర్ధాష్టమ రాహువు, ఏల్నాటి శని ప్రభావం మీపై కనిపిస్తుంది. ఏ పని చేపట్టాలన్నా ఏకాగ్రతి లోపించి మధ్యలో విరమిస్తుంటారు. మానసికంగా ఆందోళన, చికాకులు. కుటుంబసభ్యులు, మిత్రులతో స్నేహపూర్వకంగా మసలుకుంటూ వివాదాలకు దూరంగా ఉండాలి. తరచూ దూరప్రయాణాలతో వ్యయప్రయాసలు తప్పవు. ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై అప్పుల కోసం అన్వేషణ సాగిస్తారు. గురుసంచారం మిశ్రమ ఫలాలు ఇస్తుంది. కొత్త ఇంటి నిర్మాణాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రియల్ఎస్టేట్రంగం వారు ఎక్కువగా లాభపడతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తీరే సమయం.

తల్లిదండ్రుల నుండి స్థిరాస్తి లేదా కొంత ధనలాభాలు ఉండవచ్చు. ఇక శని, మరో వైపు రాహు ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ భయాందోళనలు, ఆలోచనలపై ఒక నిర్ణయానికి రాలేరు. ఆత్మవిశ్వాసం పెంచుకుని ముందుకు సాగడం ఉత్తమం. నిరుద్యోగులు ఎంత కృషి చేసినా ఫలితం నామమాత్రంగా ఉంటుంది. వ్యాపారులకు సామాన్యమైన లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడరాదు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలకు సమస్యలు ఎదురుకావచ్చు. కళాకారులు అందిన మంచి అవకాశాలు కూడా చేజార్చుకుంటారు. విద్యార్థులకు శ్రమాధిక్యంతో ఫలితాలు అందుతాయి. రాజకీయవేత్తలకు పరీక్షా సమయం. కొన్ని విచారణలు ఎదుర్కొనే సమయం. వ్యవసాయదారులు ఉత్పత్తులు పెరిగినా తగిన గిట్టుబాటు లేక ఇబ్బందులు పడతారు. అక్టోబర్31 నుండి రాహుసంచారం కొంత ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తీరతాయి.
వైశాఖం, జ్యేష్ఠం, ఆశ్వయుజం, కార్తీక మాసాలు విశేషంగా కలసివస్తాయి. మిగతావి సాధారణంగా ఉంటాయి.
వీరు శని, రాహువులకు జపాలు, ఇతర పరిహారాలు చేయాలి.

కుంభం…
–వీరికి ఆదాయం–11 , వ్యయం–5, రాజపూజ్యం–2 , అవమానం–6.
గురుసంచారం అంత కలసిరాదు. జన్మరాశిలో శని సంచారంతో ఏల్నాటి శని ప్రభావం కలిగినా కుంభరాశి కావడం వల్ల మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఇక రాహువు అక్టోబర్వరకూ శుభఫలితాలు ఇస్తాడు. మొత్తానికి వీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొవలసి ఉంటుంది. కుటుంబంలో మీ మాటను కాదనలేకపోయినా వారిలో అసంతృప్తి కనిపిస్తుంది. వివాదాలకు మరింత దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఖర్చులు అదుపు చేసుకోవడం మంచిది. ఎక్కువ శ్రమ పడితే కొంత ఫలితం కనిపిస్తుంటుంది.

శని సంచారం ఈ ఏడాది అనుకూలం. ఆచితూచి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి. జూన్18, నవంబర్4 మధ్య మాత్రం శని కొంత∙ప్రభావం చూపవచ్చు. వాహనాలు విషయంలో తొందరపాటు వద్దు. రాహుకేతువులు ప్రథమార్థంలో శుభదాయమైన ఫలితాలు ఇస్తారు. నిరుద్యోగులు తమ అన్వేషణ తీవ్రతరం చేసి ఎట్టకేలకు విజయం సాధిస్తారు. స్థిరాస్తులు కొనుగోలులో మొదట్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా చివరికి దక్కించుకుంటారు. వ్యాపారులు కృషికి తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు బాధ్యతలు పెరిగి కొంత విరక్తి చెందే అవకాశాలున్నాయి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తల శ్రమ ఇతరులకు ఉపయోగపడుతుంది. రాజకీయవేత్తలపై ఒత్తిడులు పెరుగుతాయి. వీరికి కొన్ని పదవులు సైతం చేజారవచ్చు. కళాకారులకు ద్వితీయార్థంలో అనుకూలిస్తుంది. వ్యవసాయదారులు మనోనిబ్బరంతో నష్టాలు అధిగమిస్తారు. విద్యార్థులకు శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వీడి ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. చైత్రం, జ్యేష్ఠం, కార్తీకం, మార్గశిర మాసాలు అనుకూలించగా, మిగతావి సామాన్యఫలితాలు ఉంటాయి.
వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, గురునికి జపాలు, రాహుకేతువులకు పరిహారాలు చేయడం మంచిది.

మీనం…
–వీరికి ఆదాయం –8, వ్యయం–11, రాజపూజ్యం–1, అవమానం–2.
వీరికి ఏల్నాటి శని ప్రారంభమైనా మూర్తిమంతం చేత శుభకారకుడే. అలాగే, ధనస్థానంలో గురు సంచారం విశేష లాభదాయకంగా ఉంటుంది. కీర్తిప్రతిష్ఠలు పెరిగి సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. అన్ని వ్యవహారాలలోనూ చురుగ్గా అడుగులు వేస్తారు. ఆత్మవిశ్వాసానికి పట్టుదల తోడై మీరు అనుకున్నది సాధిస్తారు. మీ మంచితనం, ఆదరణ ఇతరులను సైతం ప్రభావితం చేస్తుంది. ఆదాయానికి లోటులేకున్నా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉత్సాహం పెరుగుతుంది. శత్రువులు కూడా మీపట్ల అనుకూలత వ్యక్తం చేస్తారు.

మీ వాగ్ధాటితో విజయాలు సాధిస్తారు. బంధువులు, ఆత్మీయులతో సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపడతాయి. సంతానం విషయంలో మీ ఆశలు నెరవేరతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం, ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు. అక్టోబర్31 నుండి రాహు,కేతువుల ప్రభావం వల్ల కొత్త సవాళ్లు, సమస్యలు ఎదురై కొంత ఇబ్బంది పడతారు. చర, స్థిరాస్తుల కొనుగోలుపై కొంత సందిగ్ధత నెలకొన్నా ద్వితీయార్థంలో సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. వ్యాపారుల యత్నాలు సామాన్యంగా ఫలిస్తాయి. వీరు భాగస్వాముల చర్యలతో కొంత కలత చెందుతారు. ఉద్యోగస్తులు విధులలో సమర్థతను∙చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు.

పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. రాజకీయవర్గాల వారు కొన్ని వివాదాలలో చిక్కుకున్నా మనోధైర్యంతో బయటపడే అవకాశం. కళాకారులు, వైద్యరంగాల వారికి ద్వితీయార్థంలో శుభదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండోపంట అనుకూలిస్తుంది. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మార్గశిర మాసాలు విశేషంగా కలసివస్తాయి. మిగతావి సామాన్యం.
ఇక వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, రాహుకేతువులకు పరిహారాలు చేయడం మంచిది.
శుభమస్తు సర్వేజనాం సుఖినోభవంతు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News