Friday, May 3, 2024

క్రోధిపై వేల కోట్ల ఆశలు

- Advertisement -
- Advertisement -

ఆదాయం అధికం.. అదుపులో వ్యయం
రాజ్యపూజ్యం ఫుల్.. అవమానాలు నిల్
పంచాంగ శ్రవణంతో రాజకీయ ఆర్థికవర్గాల్లో కొత్త ఆశలు 
ఆర్థిక ఇబ్బందులు తొలగి పరిపాలనకు ప్రశంసలు
వస్తాయని ధృడవిశ్వాసం కేంద్ర రాజకీయాలు
రాష్ట్రానికి మేలు

మన తెలంగాణ /హైదరాబాద్: శ్రీ క్రోధి నామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని పంచాంగకర్తలు చెప్పిన అంశాలు రాజకీయ, అధికారవర్గాల్లో సరికొత్త ఆశలు రేకెత్తించా యి. రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, వాటి ప్రభావాలు తెలంగాణ ప్రజానీకానికి అన్ని విధాలుగా మేలు చేసేవిగా ఉన్నాయని అధికారవర్గాలే కాకుండా నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అవుతారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెట్టించిన ఉ త్సాహంతో సింహంలా పనిచేస్తారని పంచాంగకర్త చెప్పిన మాటలు ఇటు రాజకీయంగా, అటు ప్రభుత్వ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి జరగబోయే ప్రయోజనాలపై ఎవరికితోచిన విధంగా వారు లెక్కలు వేసుకుటుంటే ఆర్థికశాఖాధికారులు మాత్రం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒనగూడే ఆర్థికపరమైన లాభాలను లెక్కలువేస్త్తున్నారు.

అంతేగాక 2024-25వ ఆర్థికసంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి పెరుగుతుందని, ఖజానాకు రావాల్సిన ఆదాయం భారీగా వస్తుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి కూ డా రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిల నిధులన్నీ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఆర్థిక శాఖలోని కొందరు సీనియర్ అధికారులు ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరా లు, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనుసరిస్తున్న విధానాలకు తోడు పంచాంగకర్తలు విశదీకరించిన అంశాలు మరింత బలం చేకూరుస్తున్నాయని, అందుచేతనే రాష్ట్ర ఖజానాకు రికార్డుస్థాయిలో ఆదాయం పెరుగుతుందని ఆ అధికారులు ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్లుగా రావాల్సిన 21 వేల కోట్ల రూపాయల బకాయిలు వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలను తగ్గించి సాఫ్ట్‌లోన్లుగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర సర్కార్‌ను కోరుతూ ఇచ్చిన వినతిపత్రానికి తప్పకుండా ఆచరణకు నోచుకుంటుందని, అంతేగాక తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు రావాల్సిన 19 వేల కోట్ల రూపాయల నిధులను కూడా రాబట్టుకునే అవకాశం ఉందని ఆ అధికారులు ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఎందుకంటే గాంధీభవన్‌లో మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా జరిగిన పంచాంగ పఠనంలో ఎఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అవుతారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సింహంలా పనిచేస్తారని చెప్పిన మాటలు, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలు కూడా అందుకు తగినట్లుగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ పంచాంగం వాస్తవరూపం దాలిస్తే “తెలంగాణ రాష్ట్రానికి శ్రీ క్రోధి నామ సంవత్సరం స్వర్ణయుగంగా” చరిత్రలో నిలిచిపోతుందని ఆ అధికారులు వ్యాఖ్యానించారు.

అంతేగాకుండా కేంద్రం నుంచి రావాల్సిన పాత బకాయిలను కూడా వసూలు చేసుకునే అవకాశాలు ఉంటాయని వివరించారు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడానికి పంట రుణాలను మాఫీ చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారని, ఒకవేళ రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే మాత్రం పంట రుణాల మాఫీ కోసం జాతీయస్థాయిలోనే కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి రెగ్యులర్ బడ్జెట్ ఉండే నిధుల కంటే అదనంగా మరో 54 వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుందని, అందుకు అవసరమైన నిధుల్లో సగానికిపైగా నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచే రాబట్టుకునే వీలుందని, ఎందుకంటే రాష్ట్రంలోనూ… కేంద్రంలోనూ ఒకే విధమైన ప్రజా సంక్షేమ పథకాలు అమలు జరిగే పరిస్థితులు వస్తాయని, అందుచేతనే రాష్ట్ర ఖజానాపైన భారం కూడా తగ్గుతుందని అంటున్నారు.

వంటగ్యాస్ సిలిండర్ ధరను 500 రూపాయలకే సరఫరా చేసే పథకాన్ని ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉందని, కొద్దిరోజుల్లోనే దీనిపై మరింత స్పష్టంగా ప్రకటన వస్తుందని, ఇప్పటికే ఈ పథకం రాజస్థాన్ రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నారని, ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని, ఈ పథకాన్నే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒకే నియమ, నిబంధనలతో అమలుచేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వివరించారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కూడా మరింత బలహీనపడతాయని, దాంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరింత బలాన్ని పుంజుకొని సింహం మాదిరిగానే పనిచేస్తారని పంచాంగ పఠనంలో చెప్పిన అంశాలు కూడా తమ అభిప్రాయాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ ఆర్థిక విధానాల మూలంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టంలో మార్పులు జరుగుతాయని, ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు 4శాతం వరకు మాత్రమే రుణాలు సేకరించుకునే అవకాశం ఉందని, కానీ రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకోవాలంటే ఈ పరిమితిని కనీసం 5 శాతానికి పెంచే ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీలో ఉందని, అదే జరిగితే తెలంగాణ రాష్ట్రానికి ఏడాదికి కనీసం 54 వేల కోట్ల రూపాయల నుంచి సుమారు 65 వేల కోట్ల రూపాయల వరకూ రుణాలు తీసుకునే వెసులుబాటు లభిస్తుందని ఆ అధికారులు వివరించారు.

అంతేగాక రాష్ట్ర సెక్యూరిటీ బాండ్ల వేలం నుంచి కూడా ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు, ఆంక్షలు లేకుండానే సమృద్ధిగా నిధులను తెచ్చుకోవచ్చునని, అదే జరిగితే ఆరు గ్యారంటీల్లోని సంక్షేమ పథకాలకే కాకుండా అభివృద్ధి పథకాలకు కూడా భారీగా నిధులను వ్యయం చేసే అవకాశాలు పెరుగుతాయని ఆ అధికారులు వివరించారు. పాలమూరు-రంగారెడ్డి భారీ లిఫ్ట్ ప్రాజెక్టుకు జాతీయహోదాను తెచ్చుకునే అవకాశాలు మరింత మెరుగవుతాయని, అదే జరిగితే పంచాంగంలో చెప్పినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సింహం మాదిరిగానే తన విధులు సమర్ధవంతంగా నిర్వహించడానికి వీలవుతుందని, అంతేగాక కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోనే అత్యంత బలమైన నేతగా ఎదుగుతారని, ఈ తరహా మార్పులు, అభివృద్ధికి తప్పకుండా మరో రెండు నెలల వ్యవధిలోనే పక్కాగా పునాదులు పడతాయని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అధికారవర్గాలు సైతం భావిస్తున్నాయి. ఇలా అధికారులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతల వ్యాఖ్యానాలన్నీ వాస్తవ రూపం దాల్చాలంటే మరో రెండు నెలల వరకూ వేచిచూడాల్సిందే…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News