Home ఎడిటోరియల్ సామాజిక న్యాయం ఇదేనా?

సామాజిక న్యాయం ఇదేనా?

Social-justiceతెలంగాణ రాష్ర్టం ఏర్పడింది. సకల కుటుంబ సర్వే జరిగింది. బిసిలు 51.08 శాతం, ఎస్‌సిలు 17.50, ఎస్‌టిలు 9.91, ఓసిలు 21.50, మైనార్టీలు 14.46 శాతంగా చూపించినారు. వాస్తవంగా ఇవి కూడితే 114.45 శాతం వస్తుంది. అంటే మైనార్టీలు 14.46ని ఓసిలు కలుపుకొని 21.50గా చూపించినారు. మైనార్టీలను తీసివేస్తే, 7.05శాతం ఓసి కులాలు. తెలంగాణ రాష్ర్టం రికార్డుల పరంగా 112 బిసి కులాలు, 61 ఎస్‌సి, 35 ఎస్‌టి, 18 ఫార్‌వర్డ్ కులాలు (రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, బ్రాహ్మణ/కరణం, కోమటి, వైశ్య, క్షత్రియ, బురిడికాపు, బలిజ, బోరెడ్డి రెడ్డి, గోనేకాపు, బెంగాలి, చిట్టెపు, జైన్, మార్వాడి, సిక్కు, షేక్/ముస్లిం తదితరులు). ఇతర బిసి, ఎస్‌సి, ఎస్‌టి అర్హత ఉన్నాగాని ఆయా జాబితాలో కలపకుండా ఉన్నవి దాదాపు 50 కులాలు. ఇటీవల బిసిల్లోని 26 కులాలను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. ఈ విషయం, బిసిఇ రిజర్వేషన్ 4శాతం కోర్టులో పెండింగ్ ఉంది. మొత్తం 302 కులాలు.

రిజర్వేషన్‌లు పరిశీలించినట్లయితే బిసిలకు 29శాతం, ఎస్‌సిలకు 15శాతం, ఎస్‌టిలకు 7.5శాతం ఉన్నాయి. బిసిలు ఎ,బి,సి,డి,ఈ లుగా వర్గీకరణ రాష్ర్టపరిధిలో గల విద్య, ఉద్యోగాలలో మాత్రమే ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలలో 33శాతం రిజర్వేషన్‌లో ఈ వర్గీకరణ లేకుండా ఉన్నది. కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్ వర్గీకరణ లేకుండా ఉన్నది. రాష్ర్ట, కేంద్ర చట్ట సభలలో అసలు బిసిలకు రిజర్వేషనే లేదు. బిసిలలో కొందరు లీడర్లు సొంత ఇమేజ్‌తో ఎదిగి రాజకీయ పార్టీలలో సీట్లు సంపాదించి గెలుపొందితే వారిని బిసిలుగా చూపించి, మా పార్టీయే బిసిలకు పెద్దపీట వేసిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. అందుకే ఎంబిసి, సంచారజాతులు ఉద్యమాలు చేస్తూ తమ వాటా గురించి డిమాండ్ చేస్తున్నాయి. వర్గీకరణ లేకపోవటం వలన కొన్ని కులాలు, ఆ కులంలోని కొన్ని కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు అనేది వాస్తవం. బిసి/ఎస్‌సి/ ఎస్‌టికు వర్గీకరణ, క్రీమీలేయర్ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి.

జనాభా ప్రాతిపదికన గాని, స్వాతంత్య్రానికి పూర్వం గాని, తరువాత గాని బిసిలకు రిజర్వేషన్‌ల విషయంలో చాలా చాలా అన్యాయం జరిగినది, ఇంకా జరుగుతున్నది. ఎస్‌సి, ఎస్‌టిలకు 85శాతం న్యాయం జరుగుతున్నా అందులో కూడా వర్గీకరణ లేనందు వలన ఈ జాబితాలో ఉన్న ఉపకులాలు వర్గీకరణ పోరాటాలు చేస్తున్నాయి. బిసి,ఎస్‌సి,ఎస్‌టి జాబితాలను వర్గీకరణ తప్పకుండా చేయవలసిన అవసరం ఉన్నది. లేదా కుల జనాభా లెక్కలు తీసి ఏ కుల జనాభా ఎంత ఉందో అంత వాటా కల్పించవలసిన అవసరం ఉన్నది. చాలా కులాలను ఎస్‌సి/ఎస్‌టి/బిసి జాబితాల్లో కలుపుతున్నా రు. అనాథలను బిసిలో కలిపారు. ట్రాన్స్‌జండర్‌ని కలిపే ఆలోచనలో ఉన్నారు. ఇంకా కలపమని కొన్ని కులాల వారు ఆందోళనలు చేస్తున్నారు. దేశం నిజంగా అభివృద్ధి చెందితే ఈ కులాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయి? సామాజిక న్యాయ నిర్వచనం ఏమిటి అనేది కేంద్ర/రాష్ర్ట ప్రభుత్వాలను నిలదీసి అడగవల్సిన ప్రశ్న. కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ అనే శాఖ క్యాబినెట్ ర్యాంక్ మంత్రితో, సహాయ మంత్రులతో 1998లో ఏర్పాటైనది. సామాజిక న్యాయ సాధికారత అనే గొప్ప పేరుతో ఏర్పడింది ఈ మంత్రిత్వ శాఖ. ఇటువంటి శాఖ ఉండి కూడా సామాజిక న్యాయం, సమ పంపిణీ జరగడంలేదు, భారత రాజ్యాంగం ఆరిక్టల్ 13లోని ప్రాథమిక హక్కులను హరించి వేసే చట్టాలు చెల్లవు. ఆర్టికల్ 14 ప్రకారం అందరు సమానులే. ఆర్టికల్ 15 ప్రకారం కుల/మత/లింగ వివక్షకి తావు లేదు. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికి సమాన అవకాశాలు హామీ ఇస్తుంది. సామాజిక, ఆర్థిక. రాజకీయ, ఉద్యోగ, విద్య ఇతర సంక్షేమ రంగాలలో సమన్యాయం పాటించాలని ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోక పోవటం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. దేశ ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఎప్పుడూ సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. కాని సర్వే సర్వేకు ఫలితాలు మారుతుంటాయి. ఏ సర్వేని నమ్మాలో అర్థం కాదు.

ఇప్పటివరకు ఫార్‌వర్డ్ కులాలు ఎవరు అనేది స్పష్టం గా లేదు. ఎవరు అయితే బిసి,ఎస్‌సి, ఎస్‌టి జాబితాలో లేరో వారంతా పార్‌వర్డ్ కులాలు అనుకుంటే, బిసి, ఎస్‌సి, ఎస్‌టి అర్హత ఉన్నా గాని ఆయా జాబితాలలో చేర ని కులాలు దాదాపు 50 ఉన్నాయి. వాటిలో కొన్ని బాగో తుల, శ్రీ క్షత్రియ రామజోగి, ఏనూటి, గుఱ్ఱపు వాళ్లు, అద్దపువాళ్లు, బొమ్మలవాళ్లు, ఓడ్, రుంజ, పనస, పెక్కర, గౌడజెట్టి, తెరచీరలు, కాకిపడగలు, బైరుకమ్మర, బొప్పల, గౌవులి, బండారా, సాధనసూరులు, గంజి కూటి, కడారి తైదరోల్లు, సరగాని, పటం వారు, మాస య్యలు, పాండవులవారు, ఆదికొడుకులు, సన్నాయిలు తదితరులు. వీరు కూడా ఫార్‌వర్డ్ కులాలు అనుకుంటే అంతకన్నా దారుణం లేదు. బిసి,ఎస్‌సి, ఎస్‌టి కులాలని ఆశ్రయించే/ అడుక్కునే ఈ కులాల వారు ఫార్‌వర్డ్ కులా లలో ఉండటం ఎంత అన్యాయం? సంఖ్యరీత్యా వీరు చాలా తక్కువ జనాభా ఉన్న కులాల వారు. ప్రభుత్వాన్ని కదిలించే శక్తి లేదు, వీరి శక్తి కొలది మెమోరాండాలు ఎమ్మెల్యేలకు, ఎంపిలకు, మంత్రులకు ఇచ్చినాగాని పట్టించుకొనే వారు లేరు. ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్లు వీరికి దక్కడం లేదు. వసతి గృహాలు గురుకుల పాఠశాలల ప్రవేశం, కళ్యాణ లక్ష్మి, అంత్యో దయ, అన్నపూర్ణ, ఆసరా, ఆరోగ్య లక్ష్మి మున్నగు పథ కాలు వీరి దరికి చేరడం లేదు. డ్వాక్రా గ్రూపులు, బ్యాంక్‌లోన్లు, సబ్సిడీలు, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ పథకాలు వీరికి తెలియటం లేదు.

బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు తమ వాటిని అగ్రకులాల వారు దోచుకుంటున్నారని నిత్యం లెక్కలతో వివరిస్తూ ఉన్నారు. కాని బిసి,ఎస్‌సి, ఎస్‌టిల వాటా ఆయా జాబితాల్లోని కేవలం 1520 కులాల వారే దోచుకోవడం ఎంత వరకు న్యాయం? ఈ అస్తవ్యస్త పరిస్థితుల వలన ఇప్పటివరకు బిసి,ఎస్‌సి, ఎస్‌టి, ఫార్‌వర్డ్ కులాలలోని చాలా కులాలు ఎలా నష్టపోయినాయి అనే వివరాలు పరిశీలించుదాం. తెలంగాణ రాష్ర్టంలో ఎమ్మెల్యేలు 119 మంది బిసి జనాభా 51.08 శాతం 112 కులాలు. వాస్తవంగా 60 సీట్లు వీరికి దక్కాలి. కాని వచ్చినవి 20 సీట్లు, కేవలం 7 కులాల వారికి. మున్నూరుకాపు 8, గౌడ 5, యాదవ 2, ముదిరాజ్ 1, విశ్వబ్రాహ్మణ 1, పెరికె 1, బొందిలి 1. ఎస్‌సి కులాలు 61, జనాభా 17.50, ఇంచుమించు 21 సీట్లు రావాలి. వచ్చినవి 19 కేవలం 4 కులాల వారు. అందులో మాదిగ 10, మాల7, నేత కాని1, మోచి 1. ఎస్‌టి కులాలు 35, జనాభా 9.91 శాతం. 12 సీట్లు రావాలి. వచ్చినవి 12 సమన్యాయం జరిగినట్లుగా భావించాలి. కాని వర్గీకరణ లేనందు వలన కేవలం 3 కులాలు లంబాడ 7, కోయ4, గోండు 1. మాత్రమే లబ్ది పొందినాయి. ఫార్‌వర్డ్ కులాలు దాదాపు 7.05 శాతం వీరికి 8 లేక 9 సీట్లు రావాలి. కాని రెడ్డి 42, వెలమ 9, కమ్మ 6, వైశ్య 1, బ్రాహ్మణ 2 మొత్తం 60సీట్లు పొందినారు. మైనార్టీలు 14.46 శాతం వీరికి 17 సీట్లు రావాలి. వచ్చినవి 8.

ఎం.ఎల్.సిలు 36, బిసిల్లో మున్నూరుకాపు 4, గౌడ 4, పెరిక 1, లింగాయత్ 1, ఎస్‌సిల్లో మాదిగ 1, మాల 1, ఎస్‌టిల్లో లంబాడ 1 మొత్తం 13. ఫార్‌వర్డ్ కులాలలో రెడ్డి 10, వెలమ 2, కమ్మ 1, వైశ్య 1, బ్రాహ్మణ 1, మైనార్టీలలో ముస్లిం 7, క్రిస్టియన్ 1. ఇందులో కూడా కేవలం 7 కులాలకే స్థానం దక్కింది. ఎంపిలు లోక్‌సభ 17, రాజ్యాసభ 7 మొత్తం 24. బిసిలకు 12 సీట్లు రావాలి. వచ్చినవి కేవలం 6. మున్నూ రుకాపు 1, గౌడ 1, కురుమ/గొల్ల 1, పద్మశాలి 2, లింగా యత్ 1. ఎస్‌సిల్లో మాదిగ 2, మాల 1, ఎస్‌టి ల్లో లంబాడ 1, గోండు 1 మొత్తం 11 స్థానాలు. 24 లో 11 పోతే 13 అందులో ముస్లింమైనార్టీ 1పోను మిగిలిన 12 ఫార్‌వర్డ్ కులాల వారికే దక్కినాయి. రెడ్డి 6, వెలమ 5, కమ్మ 1. మంత్రులు 18 మంది. బిసిలకు 9 రావాలి. వచ్చి నవి 4, మున్నూరుకాపు 1, గౌడ 1, యాదవ 1, ముది రాజు 1, ఎస్‌సిలకు 4 రావాలి. వచ్చినవి బైండ్ల 1, ఎస్‌టి ల్లో 2 రావాలి. వచ్చినది లంబాడా 1. మొత్తం 208 కులాలలో కేవలం 6 కులాలకే ప్రాధాన్యం. కేంద్ర, రాష్ర్ట చట్ట సభలలో బిసి/ఎస్‌సి/ఎస్‌టి కులాలు 208 ఉంటే బిసిలలో 10 కులాలు, ఎస్‌సిల్లో 5, ఎస్‌టిల్లో 3 కులాలు మాత్రమే ఉండగా 190 కులాలకు రిప్రజెంటేషన్ లేదు.
– 9640274949