Saturday, April 20, 2024

తండ్రిని చంపేందుకు కిరాయి హంతకులు: కొడుకు అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కన్న తండ్రిని హతమార్చేందుకు కిరాయి హంతకులను కుదుర్చుకున్న కుమారుడితో ఇద్దరు కిరాయి హంతకులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. 71 సంవత్సరాల నారాయణ స్వామిని హత్య చేసేందుకు ఆయన కుమారుడు మణికంఠ(30) ఇద్దరు కిరాయి హంతకులతో రూ. 1 కోటికి బేరం కుదుర్చుకున్నాడు. కిరాయి హంతకులను టి ఆదర్శ(26), శివకుమార్(24)గా పోలీసులు గుర్తించారు. తాను నివసించే ఆపార్ట్‌మెంట్ ప్రాంగణంలో పార్కింగ్ స్థలం వద్ద ఫిబ్రవరి 13న నారాయణస్వామి హత్యకు గురయ్యారు.

హంతకులు ఆయనను కత్తులతో నరికి చంపివేశారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల ప్రమేయాన్ని కూడా అనుమానిస్తున్నామని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు మంగళవారం తెలిపారు. మణికంఠ రెండవ భార్య పేరిట ఆస్తి రాయాలని నారాయణస్వామి నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రిపై కోపంతోనే ఆయనను హత్య చేయాలని మణికంఠ నిర్ణయించుకున్నాడని పోలీసులు వివరించారు. 2013లో మణికంఠ తన మొదటి భార్యను హత్య చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. తన రెండవ భార్యపై కూడా హత్యాయత్నం చేసి మణికంఠ జైలుకు వెళ్లివచ్చాడు.

రెండవసారి జైలులో ఉన్నప్పుడు కిరాయి హంతకులు అతడికి పరిచయమయ్యారు. తన తండ్రిని చంపితే ఒక కోటి రూపాయలు ఇస్తానని అతను బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్సుగా రూ.1 లక్ష వారికి చెల్లించినట్లు పోలీసులు చెప్పారు. 28 ఫ్లాట్స్‌గల అపార్ట్‌మెంట్‌కు నారాయణస్వామి యజమాని. బెంగళూరులో ఆయనకు అనేక ఎకరాల భూములు కూడా ఉన్నాయి. మణికంఠ రెండవ భార్య పేరిట ఒక ఫ్లాట్, 7 ఎకరాల భూమి, రూ.15 లక్షల నగదు ఇస్తానని నారాయణస్వామి వాగ్దానం చేశాడని పోలీసులు చెప్పారు. మరాఠహల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News