Friday, April 26, 2024

సమ్మక్క సారాలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -
Special buses are available for Medaram Jatara
ఈనెల 16వ తేదీ నుంచి హైదరాబాద్ నుంచి స్పెషల్….
ఆర్టీసి ఎండి సజ్జనార్

హైదరాబాద్: సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసి శుభవార్త చెప్పింది. ఈ జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. ఇప్పటికే హన్మకొండ బస్టాండ్ మంగళవారం నుంచి మేడారంకు ప్రత్యేక బస్సులను నడుపుతుండగా హైదరాబాద్ నుంచి ఈనెల 16వ తేదీ నుంచి ఈ ప్రత్యేక బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నామని, ఎంజీబిఎస్ నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసి ఎండి సజ్జనార్ తెలిపారు.

బస్సుల వివరాలు ఇలా….

హైదరాబాద్ డిపో-1 సూపర్ లగ్జరీ బస్సులు ఎంజీబిఎస్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమై మేడారానికి చేరుకుంటాయని, అనంతరం మధ్యాహ్నం 3 గంటల తిరిగి హైదరాబాద్ బయలుదేరుతాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ -2 డిపో బస్సులు ఎంజీబిఎస్ నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమై మేడారం నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరుతాయని ఆయన తెలిపారు. పికెట్ డిపో బస్సులు ఎంజీబిఎస్ నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభమై మేడారం నుంచి సాయంత్రం 5 గంటలకు తిరిగి బయలుదేరుతాయన్నారు.

బుక్ చేసుకునే వెసులుబాటు

ప్రజల సౌకర్యార్థం tsrtconline.in వెబ్‌సైట్‌లో, టిఎస్ ఆర్టీసి యాప్ ద్వారా బస్సులో సీటును రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించామని ఆయన తెలిపారు. మేడారం ప్రత్యేక బస్సుల్లో చార్జీలను ఒక్కరికీ రూ.398లు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎండి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

హన్మకొండ నుంచి పెద్దలు రూ. 125ల చార్జీ

మంగళవారం నుంచి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసి రీజనల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు తిరుగు ప్రయాణం అవుతుందని ఆయన తెలిపారు. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీలుగా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 3,845 బస్సులను నడుపనుంది. బస్సుల్లో ప్రయాణించే అమ్మవారి భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని ప్రయాణికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News